SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్
Breaking News
వండర్ బాయ్‌పై ఐఐఎం స్టడీ
Published on Sat, 06/06/2026 - 06:08
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సక్సెస్ ఫార్ములా ఏమిటి? ఐపీఎల్ 2026లో పరుగుల వరద, సిక్సర్ల సునామీ సృష్టించిన 15 ఏళ్ల సూర్యవంశీకి ఆ శక్తి ఎక్కడిది?
‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ ఇది కనిపెట్టడానికే ప్రత్యేక కేస్ స్టడీ మొదలుపెట్టింది. చిన్న వయసులోనే సూర్యవంశీ తన ఫేమ్, ఒత్తిడి ఎలా ఎదుర్కొంటున్నాడో తెలుసుకునేందుకే ఈ స్టడీ...
కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుతురులో స్టేడియం. స్ట్రైక్‌లో పదిహేనేళ్ల కుర్రాడు. స్టాండ్స్‌లో నలభై వేల మంది ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ‘వైభవ్... వైభవ్’.... మొదటి బంతి... బాదాడు. ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్. రెండో బంతి... గట్టిగా కొట్టాడు. థర్డ్‌మ్యాన్ మీదుగా మరో సిక్సర్. స్టేడియంలో సౌండ్ మీటర్ పగిలిపోయేలా అరుపులు. ఇన్ని వేలమంది తన కోసం అరుస్తున్నా ఆ కుర్రాడి కళ్లలో ఉద్వేగం లేదు, ఆనందం లేదు. కేవలం ప్రశాంతత. ఆ ప్రశాంతతే ఇప్పుడు ఐఐఎం క్లాస్‌రూమ్‌లో కేస్ స్టడీ అయింది. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, సిక్సర్లలో క్రిస్ గేల్ రికార్డు బద్దలుకొట్టిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ‘ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ (ఇండోర్) ప్రత్యేక కేస్ స్టడీ మొదలుపెట్టింది. చిన్న వయసులోనే ఫేమ్‌ను, ఒత్తిడిని, అంచనాలను ఎలా ఎదుర్కొంటున్నాడో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం.
చిచ్చరపిడుగు
వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెట్టి అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రూ.1.10 కోట్లకు ఎంపికై, తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026 సీజన్ లో 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులతో చెలరేగిపోయాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో పాటు అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా బద్దలు కొట్టాడు.‘మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్’ అవార్డు సహా ఐదు అవార్డులు గెలిచాడు. ఇంత చిన్న వయసులోనే కోట్ల మంది అభిమానాన్ని, మీడియా, సోషల్ మీడియా ఒత్తిడిని తట్టుకుంటూ రాణిస్తున్న వైభవ్ తీరుపై ఐఐఎం ఇండోర్ దృష్టి పెట్టింది. వైభవ్‌లాంటి చైల్డ్ ప్రాడిజీలు అసాధారణ ప్రదర్శన ఎలా చేస్తారు, ఫేమ్ వచ్చిన తర్వాత ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారు అనే అంశాలపై మూడేళ్లలో పూర్తయ్యేలా ఇంటర్‌డిసిప్లినరీ స్టడీ మొదలవుతోంది.
బ్యాట్‌తో రికార్డులు, బ్రెయిన్ తో బ్యాలెన్స్
వైభవ్ సక్సెస్ కేవలం పరుగుల కథ కాదు. అది ‘ప్రెజర్ అండర్ పర్ఫార్మెన్స్’కు పాఠం. ఐ.ఐ.ఎం. డైరెక్టర్ హిమాన్షు రాయ్ ఇదే విషయమై స్పందిస్తూ ‘చైల్డ్ ప్రాడిజీల అసాధారణ ప్రదర్శన వెనుక పర్సనాలిటీ, ప్రవర్తన, ప్రాక్టీస్‌తో పాటు తల్లిదండ్రులు, కోచ్‌లు, సీనియర్ల సపోర్ట్ కీలకం అవుతాయి. ఆ వివరాలతోపాటు వైభవ్ మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలు, గ్రౌండ్‌లో బాడీ లాంగ్వేజ్, వైఫల్యాన్ని స్వీకరించే తీరును ఐఐఎం టీమ్ విశ్లేషిస్తోంది’ అన్నారు. ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా, కగిసో రబాడ, ప్యాట్ కమిన్స్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను వైభవ్ ఎదుర్కొన్న ధైర్యాన్ని కూడా స్టడీ చేస్తారు.
‘సపోర్ట్ సిస్టమ్’ అసలు బలం
వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొడుకు క్రికెట్ కోసం వ్యవసాయం పక్కనపెట్టి రోజూ 100 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాక్టీస్‌కు తీసుకెళ్లాడు. కోచ్ మనీష్ ఓఝా అతనికి టెక్నిక్‌తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ నేర్పాడు. ఈ పేరెంటల్ అండ్ కోచింగ్ సపోర్ట్ మోడల్‌ను ఐఐఎం డాక్యుమెంట్ చేస్తోంది. ఫేమ్ వచ్చినా వైభవ్ గ్రౌండెడ్‌గా ఉండటం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం లాంటి అలవాట్లను కార్పొరేట్ లీడర్‌షిప్ పాఠాలుగా మార్చనున్నారు.
గ్రౌండ్ నుంచి బిజినెస్ క్లాస్‌రూమ్‌కు
ఐఐఎం ఇండోర్ ఈ స్టడీ కోసం సైకాలజీ, సోషియాలజీ, కమ్యూనికేషన్, బిహేవియరల్ సైన్సెస్ నిపుణులతో టీమ్ ఏర్పాటు చేసింది. ‘వైభవ్ మోడల్’ పేరుతో జరిగే ఈ పరిశోధన ఫలితాలను రీసెర్చ్ జర్నల్స్‌తో పాటు బీసీసీఐతోనూ పంచుకుంటారు. భవిష్యత్ సీఈఓలకు ఎర్లీ సక్సెస్ మేనేజ్‌మెంట్, టాలెంట్ రిటెన్షన్, ప్రెజర్ హ్యాండ్లింగ్‌పై పాఠాలుగా దీన్ని వాడనున్నారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి సిలబస్‌లోకి వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్లు చెబుతున్నారు.
బిహార్ సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో హైస్కూల్ చదువు చదువుతున్న ఒక సాదాసీదా కుర్రవాడు 15 ఏళ్లకే ఐ.ఐ.ఎం. పుస్తకాల్లోకి ఎక్కుతున్నాడంటే ఇది కేవలం క్రికెట్ గెలుపు కాదు... 9 ఏళ్ల వయసు నుంచే చేసిన కఠోర సాధన, క్యారెక్టర్, కమిట్‌మెంట్ గెలుపు. గెలవాలనుకోవాలనుకునేవాళ్లు గెలవడం అంటే ఏమిటో తెలుసుకునే గెలుపు.
Tags : 1