తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
Breaking News
ఆటో పాఠాలూ... జీవిత సత్యాలు!!
Published on Fri, 05/22/2026 - 06:22
రాంబాబుగాడి ఇంటికి చేరే సమయానికి వాడు ఆటో ఫొటోకు దండేసి, ఊదుకడ్డీలు వెలిగించి ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రం... పైగా అది వెనక్కు తిరిగి ఉన్న ఆటో!!
వాడి సంగతి తెలిసిందేగా. ఏదైనా ఎక్స్ట్రీమ్. అందుకే మొదట పెద్దగా పట్టించుకోలేదుగానీ... చివరాఖరికి ఆగబట్టుకోలేక అడిగేశా... ‘ఏంట్రా ఇదీ?’ అని.
‘‘మహా మహా వ్యక్తిత్వ వికాస నిపుణులకు లక్షలాది రూపాయలిచ్చీ, పెద్ద పెద్ద హోటళ్లలో ఖరీదైన రూములిప్పించీ, భారీ భారీ కాన్ఫరెన్సు హాళ్లు బుక్ చేసీ వాళ్ల చేత పనికిమాలిన పర్సనాలిటీ డెవలప్మెంటు స్పీచులెన్నో ఇప్పించుకుంటారుగానీ... పైసా తీసుకోకుండా జీవితపాఠాలెన్నో చెప్పేదేరా ఆటో... మన మంచి ఆటో’’ అంటూ కొన్ని లైఫ్ లెసన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. అవీ...
‘‘నన్ను చూసి ఏడ్వకురా... అప్పు చేసి కొన్నా’’
→ అంటే ఏమిటీ? ఏడుస్తూ ఉండటం వల్ల లాభముండదు. హాయిగా నవ్వుతూ బతకాలి. అప్పుడే సంతోషం. ఎవరినీ చూసి అసూయ పడకు. వీలైతే జాలి పడు. కడుపుకు తిన్నా తినకున్నా వాడు కడుపు కట్టుకుని మరీ ఈఎమ్ఐలు కట్టాలి కదా.
‘‘స్టీరింగు తిరగనీ, చక్రాలూ తిరగనీ, కళ్లు మాత్రం తిరగనీకు’’
→ జీవితంలో కొన్ని తిరగడం వల్ల ప్రయోజనం ఉంటుందనీ... మరికొన్ని తిరగకపోతేనే మంచిదనేదే ఇక్కడ సూక్తి! మొదటి రెండూ తిరిగితే గమ్యం చేరగలం. కళ్లు తిరిగితే ఆ డ్రైవర్‌కే కాదు... సదరు సెవన్సీటరు ఆటోలోని అందరికీ ముప్పు. ఇక్కడ ఇంకో సూక్తీ దాగుంది. రోడ్డు మీద నుంచి నీ కళ్లను పక్కకు తిప్పకూ... తిరగనీకు! అలా తిరిగితే యాక్సిడెంటు కావచ్చు. అది బోలెడంత ప్రమాదం.
‘‘రోడ్ కింగ్’’
→ ఇదెన్ని లారీల మీదా ట్రక్కుల మీదా ఉంటుందో తెలుసా! రెండు ముక్కల్లోనే ఎంత లైఫ్ ఫిలాసఫీ!! నువ్వెక్కడ బతికినా సరే రాజాల బతుకు. ఇంట్లోనూ రాజే... రోడ్డెక్కినా రాజులాగే. ఇలా బతికేవాడు జీవితం పట్ల ఏ ఫిర్యాదూ లేకుండా హాయిగా మొనగాడి బతుకు బతుకుతాడని అర్థం.
‘‘పడకు పడకు వెంట పడకు... కీప్ డిస్టాన్స్’’
→ ఎన్ని ఆటలో మీదా, మరెన్ని ట్రక్కులూ, లారీల వెనకాల రాసుంటుందీ కొటేషన్! వాహనం నడిపేటప్పుడూ ఎవ్వరి వెనకా పడొద్దు. యాక్సిడెంట్లు కావచ్చు. ఇక జీవితం విషయానికి వస్తే ఏ అమ్మాయి వెనకా పడకు. సామాన్యుల నుంచి సహాయ మంత్రుల కొడుకుల వరకూ వర్తించేదీ కొటేషన్. ఇది లాస్ట్‌లో ఎందుకు చెబుతున్నానంటే... ఈ కొటేషన్ పాటించి ఉంటే ఇవ్వాళ మహామహా మాన్యులూ మంత్రుల కుమారుల దగ్గర్నుంచి, సాధారణ సామాన్యుల కొడుకుల వరకూ అందరూ ఇళ్లల్లోనే... కిలకిల నవ్వుతూ కలకల తుళ్లుతూ కళ్లముందే హాయిగా ఉంటారని చెప్పేందుకే ఈ సూక్తి. లిస్టులో లాస్ట్దే అయినా బట్ నాట్ లీస్ట్దీ కొటేషన్.
తమ మీటర్లను గిర్రున తిప్పేందుకు దూరం దారుల్లో తీసుకెళ్లి తిప్పుతారనీ, మీటర్ల మీద ఎడాపెడా ఎగస్ట్రాలడుగుతారనీ... వాళ్లను ‘ఆటో’వికులంటూ ఆడిపోసుకుంటాంగానీ... ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా వాటిని గమనించని మనమే ఆటవికులమని తెలియడం లేదా. లోక విద్యార్థుల కోసం తన వీపునే బ్లాక్‌బోర్డు చేసుకుని జ్ఞానమందించేదే ఆటో! అందుకే జై ఆటో. జైజై ఆటో! అందమైన ఆటో కొటేషన్లు రాయించే అందరికీ ఇవే నా జేజేలంటూ లైఫ్లెసన్ ముగించాడు మా రాంబాబుగాడు.
– యాసీన్
Tags : 1