తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
Breaking News
కాన్స్‌లో మెరిసిన ఇక్కత్
Published on Fri, 05/22/2026 - 06:10
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఈసారి సెలబ్రిటీలు మాత్రమే నడవలేదు. రెండు వందల ఏళ్ల తెలంగాణ చేనేత చరిత్ర నడిచింది! గ్రామీణ భారతీయ కళాకారుల ప్రతిభ ప్రపంచాన్ని తాకింది. గ్రామీణ మగ్గం నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ వరకు సాగిన ఈ ప్రయాణం తెలంగాణ చేనేతకు కొత్త దారులు తెరిచింది. ప్రపంచ సినీ రంగం తాలూకు అత్యంత ప్రతిష్టాత్మక వేదికగా గుర్తింపు పొందిన కాన్స్ ఫెస్టివల్‌లో తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు తొలిసారిగా మెరిశాయి. ఆ చారిత్రాత్మక సమయానికి ప్రతీకగా, సాక్షిగా నిలిచారు మిస్ ఆసియా ఇంటర్నేషనల్, అంతర్జాతీయ ఇక్కత్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్...
భారత ప్రభుత్వ జౌళీ మంత్రిత్వ శాఖ, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ మద్దతుతో పాటు పోచంపల్లికి చెందిన 30 మందికి పైగా మాస్టర్ నేతన్నలు కలిసి వందల గంటల శ్రమతో కాన్స్ ఫెస్టివల్ కోసం ప్రత్యేక దుస్తులను రూపొందించారు.
ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్
ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో జరుగుతున్న 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై గురువారం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రష్మీ ఠాకూర్ ర్యాంప్ వాక్ చేశారు. దీంతో పోచంపల్లి నేత కార్మికులు చేతితో నేసిన ఎఐ ట్యాగ్ పొందిన డబుల్ ఇక్కత్, తెలియా రుమాల్ నైపుణ్యాలతో రూపొందించిన ఆ వస్త్రం ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని ఆకర్షించింది. ‘పోచంపల్లి టు కాన్స్’ అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ కౌచర్ కాస్ట్యూమ్‌లో తెలంగాణ చేనేత వైభవం, భారతీయ హస్తకళ ప్రతిభ, సంప్రదాయం, ఆధునికతలు ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్‌గా నిలిచాయి. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన భగత్‌సింగ్, ప్రసన్నలక్ష్మీల దంపతుల కూమారై రష్మీ ఠాకూర్ ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన అడుగులు వేస్తూ మిస్ ఏషియా ఇంటర్నేషనల్, నేషనల్ అంబాసిడర్ ఫర్ హ్యాండ్‌లూమ్‌గా ఎన్నికయ్యారు.
ప్రపంచ వేదికపై మన రాజసం
కాస్ట్యూమ్స్‌కు జతగా రష్మీ ధరించిన ప్రసిద్ధ హైదరాబాదీ ముత్యాలు ఆ అందాన్ని మరింత రాజసంగా మార్చాయి. నిజాం రాజుల వారసత్వాన్ని గుర్తు చేసే ఆ ముత్యాలు ఇక్కత్ నమూనాలతో అద్భుతంగా కలిసిపోయి భారతీయ కళాసంపదకు ప్రపంచ వేదికపై సరికొత్త గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగువేల మందికి పైగా జర్నలిస్టులు, కోట్లాది మంది ప్రేక్షకులు చూసే కాన్స్ వేదికపై తెలంగాణ చేనేత ప్రతిష్టాత్మకంగా నిలవడం చేనేత రంగానికి చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ప్రపంచ మార్కెట్‌లలో పోచంపల్లి ఇక్కత్‌కు మరింత గుర్తింపు, డిమాండ్, గౌరవం తీసుకురావడంలో ఈ ప్రదర్శన కీలక పాత్ర పోషించనుంది.
ఇది తెలంగాణ అరంగేట్రం!
ఇది నా ఒక్కరి అరంగేట్రం కాదు. ఇది తెలంగాణ అరంగేట్రం. పోచంపల్లిలో వందల గంటలు మగ్గం ముందు కూర్చుని కష్టపడిన ప్రతి నేతన్న కల ఇది. మన దారం ఇప్పుడు ప్రపంచ దారం అయింది. తెలంగాణ చేనేతను ప్రపంచ లగ్జరీ ఫ్యాషన్ వేదికపై నిలబెట్టడం నా లక్ష్యం. ఇక్కత్ వస్త్రాల కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాను.
– రష్మీ ఠాకూర్
– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి
Tags : 1