ఏపీలో పంచాయతీ ఎన్నికల్లేవు.. హైకోర్టుకు తేల్చి చెప్పిన ప్రభుత్వం
Breaking News
ఈ వారం కథ: ప్రశ్న
Published on Sun, 05/03/2026 - 08:33
‘‘వల్లీ! మా డాడీ ఫోన్ చేశారు. పదో తారీఖున మనందర్నీ ఊరికి రమ్మన్నారు...’’ హబ్బీ వాసు మాటలకు ఆశ్చర్యంగా చూశాను. ‘‘ఎనీథింగ్ ఇంపార్టెంట్?’’‘‘అహ. వీలునామా రాస్తారట. తమ్ముళ్ళనీ చెల్లినీ కూడా పిలుస్తున్నారు ’’‘‘బావుంది. చాలామంది కరోనా తర్వాత రాశారు. మామగారు ఇప్పుడు రాస్తున్నారన్నమాట. మంచిదే! ఏమైనా ఆయనకు ముందు చూపు ఎక్కువే. కాని, అందరికీ ముందే చెబితే లేనిపోని గొడవలు రావూ!’’‘‘వస్తాయి. వాటిని మొదట్లోనే పరిష్కరించేయొచ్చు అన్నారు’’ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూంటే వాసు చిన్న తమ్ముడు రఘు ఫోన్ చేశాడు.
‘‘అన్నయ్యా, నాన్న వీలునామా రాస్తారట. నా సంగతి నీకు తెలుసుగా. నాది పెన్షన్ లేని ప్రైవేటు జాబు. ఎప్పుడు వూడుద్దో తెలీదు. మీ పిల్లలు బాగా సెటిలయ్యారు. నా పిల్లలింకా కాలేజీలోనే వున్నారు. అంచేత నాక్కొంచెం అదనంగా...!’’‘‘ఫేవర్ చేయించమంటావు? డాడీకి అందరి, అన్ని సంగతులూ తెలుసు. ఒకరితో చెప్పించుకోరు. నీకెలా న్యాయం చేయాలో అలా చేస్తారు గాని వూరికే భయపడకు’’వాసు ఫోన్ పక్కన పెడుతోంటే మళ్ళీ ఫోన్ మోగింది. డిస్ప్లే చూసి,‘‘పెద్ద తమ్ముడు శేషు’’ నాకు చెప్పి, ‘‘చెప్పరా. వీలునామా గురించేనా!’’ అడిగాడు.‘‘ఆ మాట విన్నప్పట్నుంచీ యమ టెన్షన్ గా వుందన్నయ్యా...’’‘‘ఎందుకురా!’’‘‘డాడీ సంగతి నీకు తెలుసుగా. అందరూ సమానమేనంటూ సమానంగా పంచుతారు. నేను నిండా మునిగిపోతాను!’’‘‘ఏం?’’‘‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే. వాళ్ళ దుస్తులకూ, చదువులకూ చాలా ఖర్చయ్యింది.
ఇక అసలు ఖర్చంతా ముందుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పురుళ్ళూ పుణ్యాలూ...!’’‘‘శేషూ! ఉద్యోగం చేస్తున్నావు. మొన్ననే రెండో ప్రమోషన్ తీసుకున్నావు. నువ్వు బీదార్పులు అరవడం ఏం బాగోలేదు. పిల్లలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మనది కానీ డాడీది కాదు. అయినా నాన్నను అడక్కుండా నాకు చెబుతావేంటి!’’‘‘నువ్వు చెబితే నాన్న వింటారు...!’’‘‘అంతా ఓపెన్ గా చెప్పే చేస్తానన్నారు. అందరం అక్కడే వుంటాం గనుక అప్పుడే మాట్లాడదాం...!’’ ‘‘నన్ను సపోర్టు చేస్తావనుకున్నాను అన్నయ్యా!’’‘‘నాకు నువ్వెంతో రఘూ అంతే. ఏం చేసేదీ, ఎలా చేసేదీ అంతా డాడీ ఇష్టం.
ఆయన ఏం చేస్తారో వినకుండా ముందే ఆందోళన పడటం అనవసరం’’ ఫోన్ పెట్టేసి, ‘‘నా సపోర్టు కోసం చేశాడు’’ చెప్పాడు వాసు. ‘‘అన్న గారిగా మీకూ బాధ్యత వుందిగా, చెయ్యండి’’ ఆఫీసుకు రెడీ అవుతుంటే అడబడుచు రమ కాల్ చేసింది. ‘‘నాకు చేశావేంటి రమా. మీ తమ్ముళ్ళిద్దరూ ఇంతక్రితమే మీ అన్నయ్యకు చేశారు’’ ‘‘వాళ్ళు చేయడమే కాదు బుడిబుడి దీర్ఘాలు తీస్తారనీ నాకు తెలుసు. అందుకే నీకు చేశాను. నువ్వేం చెప్పినా డాడీ వింటారు. బాగా చదువుకున్న దానివి, లాజిక్‌తో మాట్లాడతావని నువ్వంటే ఎంతో గౌరవం!’’‘‘సరి సరే. ఆఫీసుకు టైమయ్యింది. త్వరగా చెప్పు రమా’’‘‘నీ తమ్ముడి గురించి తెలుసుగా వదినా. మంచి ఉద్యోగం చేస్తున్నారని నన్నిచ్చి పెళ్లి చేశారు.
అయిదేళ్ళు గడవకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసి మిత్రుడితో కలిసి వ్యాపారం మొదలెట్టారు. అందులో ఎంత నష్టపోయామో నీకు తెలుసుగా. తర్వాత రియల్ ఎస్టేట్ అన్నారు. లక్షలొచ్చి పడతాయన్నారు. కొన్న భూమి కోర్టు గొడవల్లో ఇరుక్కుంది. ఈలోగా రొయ్యల చెరువుల్లో కోట్లు మిగుల్తాయని అందులోకి దూకారు. రొయ్యల సాగు గురించి చెప్పేదేముంది. ఎప్పుడే వైరస్ వచ్చి అవి తేలి, మమ్మల్ని ముంచేస్తాయో తెలీదు. కంటి నిండా నిద్రపోలేకుండా ఉన్నామంటే నమ్ము!’’ ‘‘ఇవన్నీ మీ నాన్నతోనో అన్నయ్యతోనో చెబితే లాభం వుంటుంది. నాతో ఏమవుతుంది చెప్పు!’’ ‘‘నీ వల్ల కానిది వుండదు వదినా. చెప్పేనుగా నువ్వన్నా నీ మాటలన్నా మా డాడీకెంతో గురి!’’‘‘సరే. ఆయన నీకు అన్యాయం చేసినట్టు అనిపిస్తే అప్పుడు కల్పించుకుంటాన్లే’’‘‘నువ్వు మాటిస్తే నా పని అయిపోయినట్టే’’ పొంగిపోయింది. కార్లో ఆఫీసుకు వెళుతూ, ‘‘రమ నాకు ఫోన్ చేసింది’’ చెప్పాను.
‘‘ఏవిటో అనవసరంగా డాడీ తేనెతుట్టె కదిలిస్తున్నారు!’’‘‘మామయ్యగారికి ఇవన్నీ తెలీవనుకోను . ఈపాటికి ఏదో ఒక నిర్ణయానికొచ్చేసే వుంటారు. మనం వెళ్ళి శంఖంలో పోయడమే!’’ ‘‘చూద్దాం. నువ్వు సెలవు పెట్టడం మర్చిపోకు సుమా...’’ ఒకరోజు ముందే అత్తవారి వూరుకెళ్ళాం. అప్పటికే మిగతా మూడు కుటుంబాలూ వచ్చేశాయి. ‘‘పెద్ద పండుగ మళ్ళీ వచ్చినట్టుగా వుంది’’ అత్తయ్య ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ‘‘వంటా వడ్డనా మాకు అప్పగించి మీరు హాయిగా రెస్టు తీసుకోండి అత్తయ్యా’’ అన్నారు శేషు భార్య ప్రియదర్శిని, రఘు భార్య లలితకుమారి. ‘‘మేమిక్కడ వున్నంతకాలం మేమే వంటింటి మహారాణులం అత్తయ్యా !’’ అంటూ జత కలిశాను. మురిసిపోయిందావిడ. ‘‘ఆ మాటన్నారు అదే పదివేలు. నా బిడ్డలకు నేను వండిపెడితేనే నాకు తృప్తిగా వుంటుంది. మీరెళ్ళి కబుర్లు చెప్పుకోండి’’‘‘మీ బిడ్డలకే గాని మాకు వండిపెట్టరా!’’ నవ్వుతూ చురక వేశాను.
‘‘అయ్యో, ఎంత మాట శ్రీవల్లీ. మీ ముగ్గురూ ఈ ఇంటి మహాలక్షు్మలు!’’ ‘‘నగలు అలంకరించుకుని కూర్చోడానికే గాని, మీ వంటింటి సామ్రాజ్యంలో అడుగు పెట్టకూడదన్నమాట!’’ నిష్ఠూరంగా అంది ప్రియదర్శిని. ‘‘అంతేనా లేక మేం మీలాగా వండలేమని వద్దంటున్నారా!’’ లలిత కుమారి ఆరా తీసింది. ‘‘అదేం కాదర్రా. మీరు మా బంగారాలు. రోజూ మీ వంటే తింటున్నారుగా. ఈ మూడు నాలుగు రోజులూ నా చేతి వంట తిననివ్వండి’’ ‘‘అయితే ఒక షరతు. మాకూ కొన్ని పనులు పురమాయించాలి. మా సాయమూ తీసుకోవాలి’’ మరి కాదన్లేక పోయారు. అవాళంతా కబుర్లతో ఛలోక్తులతో ప్రశంసలతో సరదాగా గడిచింది. ‘‘మీరెప్పుడూ ఇలాగే కలిసిమెలిసి వుండాలి. సంతోషంగా వుండాలి. ఒకరికొకరు సాయసంపదలు అందించుకోవాలి...’’ చెమ్మగిల్లిన కళ్ళతో అన్నారు మామయ్య. వెంటనే కొడుకులూ కూతురూ, ‘‘ఓ అలాగే డాడీ’’ అనేశారు.
మర్నాడు ఎలాంటి తుపాను వస్తుందోనని వారి గుండెల్లో గుబులుగానే వుందన్న సంగతి వారి ముఖాలే చెబుతున్నాయి! పదకొండింటికి మామయ్యగారు అందర్నీ హాల్లోకి పిలిచారు. అందరం వెళ్ళి ఆయన వంక ఆసక్తిగా చూశాం. మామయ్యగారు కొన్ని పేపర్లు బయటికి తీశారు. ‘‘ఈమధ్య నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. రేపు లేనిపోని తేడాలు, గొడవలు రాకుండా ఇప్పుడే మీతో ఒక మాట చెప్పి వీలునామా రాసేయాలనుకున్నాను’’ ఆగి అందరి వంకా చూశారు. అంతా మౌనంగా ఉండిపోయేసరికి తిరిగి తనే అన్నారు ‘‘మేం ఒకర్ని ఎక్కువగా ఒకర్ని తక్కువగా చూడలేదు. అందర్నీ సమానంగా చూశాం, పెంచాం, చదివించాం. మీమీ శక్తియుక్తుల్ని బట్టి చదువుకున్నారు. ఉద్యోగాలో, వ్యాపారమో చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నారు. సంతోషం.
మనకిప్పుడు పదెకరాల పొలం, రెండెకరాల మామిడితోట, టౌన్లో ఇళ్ళ స్థలాలు, ఇక్కడో ఇల్లు ఉన్నాయి. వీటన్నిట్నీ ఇవాళ్టి విలువని బట్టి లెక్కగట్టి ఆరు వాటాలు వేశాను...’’ఉలిక్కిపడ్డామంతా. ‘‘మేం నలుగురమే కదా డాడీ’’ వెంటనే శేషు అడిగాడు. ‘‘నాకూ మీ అమ్మకూ విడిగా వాటాలు వేశాను. ఇవాళ రేపు ఆసుపత్రులకు ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసుగా. ఏమంటావమ్మా శ్రీవల్లీ’’ నన్నడిగారు. ఆసరికే నా ముఖం ఎర్రబడింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. లోలోపల మండుతూ మౌనంగా వుండిపోయాను. ‘‘మీ ఆస్తి ఎలా పంచుతారో మీ ఇష్టం. మధ్యలో ఎవరి పెత్తనం అక్కర్లేదు’’ విసురుగా అన్నాడు వాసు. ‘‘అక్కకి పెళ్లిలోనే ఇంత మూట ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు వాటా పంచడమంటే డబుల్ షేర్ ఇవ్వడమే!’’ రఘు ముఖాన గంటు పెట్టుకున్నాడు.
‘‘అది కట్నం. ఇచ్చింది నాకు కాదు మా అత్తవారికి! ఇది నా హక్కు. నా వాటా నాకివ్వాల్సిందే!’’ రమ గొంతు పెంచింది. ‘‘ఆడబడచుకు ఒక రూపాయి పెట్టాలిగాని దానికి పెట్టిన దాని గురించి లెక్కలేయకూడదురా చిన్నోడా!’’ అన్నారు అత్తయ్య. ‘‘ఏం అన్నయ్యా మాట్లాడవేం!’’‘‘డాడీ ఆస్తి. తన ఇష్టానుసారం పంచే హక్కు అధికారం డాడీకి వున్నాయి. కాదనడానికి మనమెవరంరా!’’ అన్నాడు వాసు. తను ఎప్పుడూ అంతే. అందరితో మంచివాడు అనిపించుకోవాలని చూస్తారు తప్ప ఎటూ తేల్చి చెప్పరు! ‘‘డాడీ సంపాదించిందే కాదు, ఆ తాత, ఈ తాత ఇచ్చిందీ వుంది. వాటి మీద మనవలుగా మనకే పూర్తి హక్కు వుంటుందని ప్లీడరు చెప్పాడు’’ అన్నాడు శేషు. అంతా అదిరిపడి చూశారు.‘‘ఇది మన కుటుంబ వ్యవహారం. మనలో మనం తెముల్చుకోవాలి. కిందా మీదా పడినా ఫరవాలేదు గాని గొడవలు పడకూడదు.
రేపు ఎవరూ కోర్టు గడప తొక్కకూడదనేగా ఇప్పుడు వీలునామా తలపెట్టింది!’’ అన్నారు మామయ్య. ‘’ఆస్తి పంచుతున్నప్పుడు ఇంకా వీలునామా ఎందుకు అంకుల్, ఏకంగా వాటాలు పంచి ఇచ్చేయండి. ఎవరి వాటా వాళ్ళు ఇప్పట్నుంచే అనుభవిస్తారు’’ ప్రియదర్శిని కల్పించుకుంది. ‘‘ప్రియదర్శిని చెప్పింది సబబుగా వుంది. ఆలోచించండి మామయ్యా!’’ అన్నాను. ‘‘శ్రీవల్లి బలపరుస్తోంది గనుక అందరికీ సమ్మతమైతే అలాగే చేద్దాం. ఏమంటారు’’‘‘పంచడమే కాదు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఎవరి కాగితాలు వారికి ఇచ్చేయ్యండి అంకుల్’’ అన్నాడు ఇంటల్లుడు అనిల్.‘‘అలాగే చెయ్యండి గాని సమాన వాటాలంటే మాత్రం నేనొప్పుకోను. అన్ని చేతి వేళ్ళూ ఒకేలా వుండవు. అందరి బరువు బాధ్యతలూ ఒకే రకంగా లేవు. అన్నయ్యలకు ఖర్చు పెట్టినంత నాకు ఖర్చు పెట్టలేదు..!’’రఘు మాటలకు, ‘‘వాళ్ళుపై చదువులకు వెళ్ళారు. నువ్వెళ్ళలేదు. అది నీ తప్పు. దాని పర్యవసానాలకు నువ్వే బాధ్యుడివి గాని, నేను కాదు కదురా!’’ అన్నారు మామయ్య.
‘‘మేం కాదనటం లేదు. అన్నయ్య పిల్లలు త్వరగా ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. మా ఇద్దరి పిల్లలు ఆ స్థాయికి రావడానికి చాలా టైము పడుతుంది..’’ అని రఘు అంటే, ‘‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే. నేను అందరి కన్నా ఎక్కువ బరువులు మోయాలి. దాన్ని లెక్కలోకి తీసుకోరా?!’’ సూటిగా బాధగా ప్రశ్నించాడు శేషు.‘‘ఆగండాగండి. మీ వదిన కరెక్టుగా చెబుతుంది. ఏమమ్మా, శ్రీవల్లీ, నీ అభిప్రాయం ఏమిటి?’’ నన్ను అడిగారు మామయ్య.నోరు తెరవక తప్పలేదు. ‘‘మాకు ఈ వ్యవహారంలో సంబంధం వుందా మామయ్యా!’’ సూటిగా అడిగాను.దెబ్బతిన్నట్టు చూశారు. ‘‘అలా మాట్లాడతావేంటమ్మా. ఇది మన కుటుంబ వ్యవహారం. పెద్ద కోడలిగా నీకెక్కువ బాధ్యత వుందమ్మా!’’‘‘మేం బరువు బాధ్యతలు మోయటానికే నన్నమాట!’’‘‘చిత్రంగా మాట్లాడతావేంటి వల్లీ.
అసలు నీకివాళేమైంది’’ వాసు ముఖం చిట్లించాడు.‘‘జ్ఞానోదయం అయింది!’’‘‘ఇప్పుడు జరక్కూడనిదేం జరగిందమ్మా. నీ మాటెవరూ కాదన్లేదుగా!’’ అత్తయ్య అన్నారు.‘‘ఆస్తి పంపకాల్లో కోడళ్ళనీ సంప్రదించాలన్న ఆలోచనే మీకు రాకపోవడం చాలా దారుణం మామయ్యా!’’‘‘లోకతీరుని బట్టే చేస్తారు తప్ప నీకేదో స్పెషల్ సింహాసనం వెయ్యరు’’ కోప్పడ్డాడు వాసు.‘‘ఇంకా పంపకాలవ్వలేదు శ్రీవల్లీ. నీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పు ’’ అన్నారు మామయ్య.‘‘ఎన్ని వాటాలు వేస్తున్నారో ముందే చెప్పేశారుగా!’’‘‘కొడుకులకూ, కూతురికీ వాటాలేశాను. మా తనువులు వెళ్ళాలి గనుక మా ఇద్దరికీ చెరో వాటా వేసుకున్నాం. అది తప్పంటావా?’’‘‘అనను. కాని ఆ కుటుంబ సభ్యుల్లోకి కోడళ్ళు ఎందుకు రాలేదన్నది నా ప్రశ్న!’’‘‘కొడుకులకే కాదు కోడళ్ళకూ వాటా ఇమ్మంటోంది డాడీ!’’ రమ హేళనగా నవ్వింది.‘‘అప్పుడింక మా చేతికొచ్చేది ఆస్తి కాదు, ఖాళీ చిప్ప!’’ శ్రుతి కలిపాడు రఘు.‘‘కొడుకులకిస్తే మీకిచ్చినట్టు కాదా?’’ మామయ్య ప్రశ్నించారు.
‘‘కానే కాదు. ఎవరిది వారిదే!’’‘‘ఆ మాట బాగోలేదమ్మా శ్రీవల్లీ. మొగుడూ పెళ్ళాలు ఎప్పుడూ ఒకటే’’ నొచ్చుకున్నారు అత్తయ్య.‘‘నీ ఉద్దేశమేంటి అక్కయ్యా’’ ప్రియదర్శిని అడిగింది.‘‘పెళ్ళవుతూనే ఈ ఇంటికొచ్చాం. ఈ ఇంటి సభ్యులం అయ్యాం. పెళ్లితో వీరి గోత్రమే మనదైంది. ఈ ఇంటి పేరే మనదైంది!...’’‘‘ ఇప్పుడు కాదని ఎవరన్నారు?’’ మామయ్య అడిగారు.‘‘ మా పెళ్లి అవుతూనే ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరే మన్నారో గుర్తుందా మామయ్యా. ‘నువ్వు ఇంటి పెద్ద కోడలివి గనుక కుటుంబ పరువు ప్రతిష్ఠలు, మర్యాదలు, సంప్రదాయాలు అన్నీ నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అన్నారు. వదిన అంటే తల్లే. అంచేత మరుదుల్ని, ఆడపడుచుని చక్కగా చూసే బాధ్యత కూడా నీదే!’ అన్నారు’’‘‘అవును. అవే మాటలన్నాను.
నువ్వు, నీ తోడికోడళ్లు అవి చక్కగా పాటించిన మాటా నిజమే. అయితే ఇప్పుడు ఏంటి!’’‘‘పూర్వం పెద్దకొడుకు అంటే పెద్ద పాలేరు అని అదనంగా ఏదో ముట్టచెప్పేవారు. ఇప్పుడు అన్నయ్యకి కాకపోయినా వదినకి ఇవ్వమనేమో!’’ వంకరగా నవ్వాడు శేషు .నా వంక కొరకొరా చూశాడు వాసు.‘‘మేము ఈ ఇంటి సభ్యులుగా కుటుంబ పరువు మర్యాద కాపాడాలి. కుటుంబ బరువు బాధ్యతలు పంచుకోవాలి. మేం ఈ కుటుంబ సభ్యులమే అయినప్పటికీ మాకు బాధ్యతలు తప్ప ఇంటి మీద గాని, కుటుంబ ఆస్తి మీద గాని ఎలాంటి హక్కూ అధికారం ఎందుకు లేవన్నది నా ప్రశ్న! ఈ ఇంట్లో కోడళ్ళు ఉత్త సభ్యులే అంటే మాత్రం నేను అంగీకరించను!’’‘‘అలా ఆలోచిస్తే అక్క అన్నది సమంజసమే’’ ప్రియదర్శిని అంది.‘‘ఇదేమీ వ్యాపార భాగస్వామ్యం కాదు, కుటుంబస్వామ్యం!’’ వాసు కసురుకున్నాడు.‘‘తెలుసు.
నేనడిగేది కుటుంబ ఆస్తిలోని భాగమే!’’‘‘వదిన అతి తెలివిగా మాట్లాడుతోంది. అప్పుడు తను పుట్టింటి నుంచి తెచ్చుకున్నదీ ఉమ్మడి ఆస్తే అవుతుందిగా!’’ రఘు అన్నాడు.‘‘అవ్వదు. అది నాది. కూతురు గనుక రమకీ వాటా ఇస్తున్నాంగా. అలాగే మేమూ పుట్టిళ్ళ నుంచి తెచ్చుకున్నాం. మరి మాకు అత్తింటి నుంచి ఎందుకని ఏమీ ఇవ్వరు ?’’‘‘నువ్విలా అడ్డంగా మాట్లాడటం నాకు నచ్చలేదు’’ ముఖం మాడ్చుకున్నారు మామయ్య.‘‘పితృస్వామ్య ఆలోచనా దృక్పథంలోంచి బయటికొచ్చి చూస్తే నా మాటలెంత న్యాయమో అర్థమవుతాయి మామయ్యా. అత్తయ్యగారు తెచ్చుకున్నది రమకి కట్నంగా ఇచ్చారు. ఆవిడకేం మిగల్లేదు గనుకే వాటా ఇస్తున్నారు. రఘూ వాళ్ళది లవ్ మ్యారేజ్. లలిత ఏమీ తెచ్చుకోలేదు. ఇలాగే ఒక్కో కోడలి ఆర్థిక స్థితి ఒక్కో రకంగా వుంటుంది.
వారికి కుటుంబ ఆస్తిలో భాగం ఇవ్వకపోవడమంటే తోటి కుటుంబ సభ్యులకు ముమ్మాటికీ అన్యాయం చేస్తున్నట్టే!’’ నా స్వరం మరింత పెరిగింది.‘‘మొగుడూ పెళ్లాల్ని వేరు వేరుగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు’’ బాధగా అన్నారు మామయ్య.‘‘ఒకటే ఎలా అవుతారు? నిజంగా మీరా సంగతి మనస్ఫూర్తిగా నమ్మితే, ఆస్తి కొడుకులకు కాక కోడళ్లకు రాయండి. రాయగలరా? కచ్చితంగా రాయలేరు! ఆయన ఆస్తే నా ఆస్తి, ఆయన ఇల్లే నా ఇల్లు, ఆయన సంపాదనే నా సంపాదన అనుకోమంటారు? నాకు విడిగా ఎలాంటి గుర్తింపూ లేదంటారు? ఆయన నీడలా ఉంటూ ఆయన దయాదాక్షిణ్యాల మీద ఎప్పటికీ ఆధారపడే ఉండాలంటారు? ఇదేనా కుటుంబ వ్యవస్థ ఇంటి కోడళ్లకు ఇచ్చే గౌరవం? నేను ఉద్యోగం చేస్తున్నాను గనుక ఓకే, లేకపోతే నా పరిస్థితి ఏమిటి? ప్రతిదానికీ మొగుడి మీద ఆధారపడాలి. అంటే గాలిలో వేలాడాలి !’’‘వేరు వేరు అనుకుంటే తేడాగానే ఉంటుంది. అంతా ఒకటే అనుకుంటే ఏమీ ఉండదు!’’ అన్నారు అత్తయ్య.‘‘రేపేం జరుగుతుందో ఎవరు ఊహించగలరు అత్తయ్యా? ఏమైనా జరగొచ్చు.
మేం విడిపోవచ్చు. వేరే మోజులోపడి నాకూ పిల్లలకూ అన్యాయం చేయొచ్చు. వ్యసనాలకు తగలేయొచ్చు. ‘ఇది నా ఇల్లు’ అంటూ ఇంట్లోంచి తన్ని తరిమేయొచ్చు. అటువంటప్పుడు కుటుంబం ఆయా సభ్యులకు అండగా నిలబడాలిగా! మరప్పుడు విడిగా ఆస్తిహక్కు ఎందుకివ్వరు? మిమ్మల్నొక్కర్నే కాదు, మొత్తం ఈ పితృస్వామ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను!’’ఎవరూ మాట్లాడలేదు. మధ్యలో శవం వున్నట్టు మౌనంగా వుండిపోయారు.‘‘అవసరం రానంతవరకూ ఉమ్మడిగానే వుంటుంది. అవసరమైనప్పుడు ఎవరిది వారికే అవుతుంది’’ గొణుక్కున్నారు మామయ్య.‘‘అది నా ప్రశ్నకు సమాధానం కాదు మామాయ్యా!’’‘‘నీ ప్రశ్న చాలా చిత్రంగా ఉంది. ఏ ఇంట్లోనూ లేనిది మన ఇంట్లోనే ఎందుకు?’’‘‘దానర్థం నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని స్థితిలో కుటుంబం వుంది.
అంటే నేనీ ఇంట్లో ఒక డమ్మీని! అది తెలిసి కూడా నేనిక్కడ బొమ్మలా కూర్చుని మీ రేడియో సంభాషణ వినడంలో అర్థం లేదు!’’ విసురుగా లేచి వచ్చేశాను.నా వెనుకే ప్రియదర్శిని, కాస్సేపటికి లలిత కుమారి వచ్చేశారు. ‘‘మీ నిర్ణయానికి నిరసనగా మీ కోడళ్ళు వాకౌట్ చేశారు డాడీ!’’ మా వెనుక ఎవరో అన్నారు.అవును, మాది వాకౌటే. కుటుంబంలోంచి వాకౌటే! ‘‘శ్రీవల్లీ!’’ పిలుస్తూ అత్తయ్య వచ్చారు. ‘‘ఇంట్లో మీకు లేని హక్కులు నాకూ ఉండవు గాని లోపలికి పదండి’’‘‘అది కాదు అత్తయ్యా!’’‘‘లోపలికి రండి. నేనున్నాగా!’’ మౌనంగా అనుసరించాం. ‘‘వీళ్లు నాలాగానే ఈ కుటుంబంలోకి వచ్చారు. కుటుంబ సభ్యులయ్యారు. కోడళ్ళకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీదా వుంది. ఉమ్మడి ఆస్తిలో వారికీ వాటా వేయాల్సిందే!’’మేం చప్పట్లు కొట్టాం!
-సింహప్రసాద్
Tags : 1