ట్రంప్ పై దాడి Live వీడియో.. ఇలా వచ్చాడు.. అలా కాల్చాడు
Breaking News
‘ఆఫీస్ పిక్నిక్’ వేళ.. అందరూ ఒక్కటే!
Published on Fri, 05/01/2026 - 10:54
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో డెడ్‌లైన్లు, క్లయింట్ కాల్స్, మీటింగ్‌లు.. అంటూ ఉద్యోగులు నిరంతరం ఒత్తిడిలో గడుపుతుంటారు. కనీసం ప్రశాంతంగా భోజనం చేసే సమయం కూడా దొరకని ఈ రోజుల్లో ఒక సంస్థ మాత్రం వినూత్న సంస్కృతికి తెరలేపింది. పని వేళల్లో రోజూ తప్పనిసరిగా ఒక గంట పాటు పనులకు బ్రేక్ ఇచ్చి ఉద్యోగులందరూ కలిసి భోజనం చేయాలనే నియమాన్ని ‘కేకే క్రియేట్’(KK Create) వ్యవస్థాపకురాలు కావ్య అమలు చేస్తున్నారు. ఈ ‘ఆఫీస్ పిక్నిక్’ విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వర్క్ కల్చర్‌పై చర్చకు దారితీసింది.
ఎవరూ ఒంటరిగా తినరు
కేకే క్రియేట్ సంస్థలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వివిధ విభాగాల్లో కఠినమైన టార్గెట్లతో పని చేసే ఈ బృందం మధ్యాహ్నం 2 గంటలయ్యిందంటే చాలు పని ఒత్తిడిని పక్కనపెట్టాల్సిందే. ఓ గంటపాటు ఎటువంటి మినహాయింపులు ఉండవు. మేనేజర్ నుంచి ఫ్రెషర్ వరకు అందరూ ఒకే చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటా భోజనం చేస్తారు.
ఈ సంస్కృతిపై కావ్య కర్ణాటక లింక్డ్ఇన్‌లో రాస్తూ ‘మా కార్యాలయంలో ప్రతిరోజూ ఒక గంట పిక్నిక్ జరుగుతుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. ఆ సమయంలో ఆఫీసులో హైరార్కీ ఉండదు. అందరం కలిసి కూర్చుంటాం. జోకులు వేసుకుంటాం. ఆటలు ఆడుకుంటాం. దీనివల్ల పని పట్ల భారం తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.
పని తర్వాత చూద్దాం.. ముందు భోజనం చేద్దాం
సాధారణంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ఇక్కడ సీనియర్ సభ్యులే ముందుండి ‘ఆజావో లంచ్ కర్నే, కామ్ బాద్ మే కర్నా’ (రండి భోజనం చేద్దాం, పని తర్వాత చూద్దాం) అని ప్రోత్సహిస్తుంటారు. ఈ సమయం కేవలం భోజనానికే పరిమితం కాకుండా ఉద్యోగుల మధ్య బలమైన బంధాలను పెంచే సామాజిక సమయంగా మారుతోందని కావ్య వివరించారు.
నెటిజన్ల ప్రశంసల వెల్లువ
ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. పని సంస్కృతి అంటే కేవలం సమావేశాలు, విధానాలు మాత్రమే కాదని ఇలాంటి చిన్న వ్యవహారాలే అసలైన బంధాలను నిర్మిస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రొడక్టివిటీ పెంచమని చెప్పే క్రమంలో చాలా కంపెనీలు మానవ సంబంధాలను మర్చిపోతున్నాయి. కానీ, ఇలాంటి విధానం ఉద్యోగులను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు, అత్యవసరమైన క్లయింట్ కాల్స్ లేదా డెడ్‌లైన్ల సమయాల్లో ఈ ఒక గంట విరామాన్ని ఎలా నిర్వహిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి కావ్య స్పందిస్తూ, ‘ఆ సమయంలో మాకు ఏదీ ముఖ్యం కాదు. ఒక గంట పాటు పని నుంచి పూర్తిగా దూరమవ్వడం వల్ల తిరిగి పనిలో చేరినప్పుడు మరింత సామర్థ్యంతో పనిచేయగలుగుతున్నాం’ అని బదులిచ్చారు.
ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్!
Tags : 1