ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
చిరునవ్వుతో స్ఫూర్తిదాయక విజయం!
Published on Thu, 04/30/2026 - 14:31
వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించింది శ్రీనగర్‌కు చెందిన జైనబ్ బిలాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాల్లో ఈ దృష్టి లోపం ఉన్న విద్యార్థిని ఏకంగా 95 శాతం మార్కులతో సత్తా చాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 500 మార్కులకు గాను జైనబ్ 475 మార్కులు సాధించింది. మరీ ముఖ్యంగా, ఆమెకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్ అయిన కంప్యూటర్ సైన్స్‌లో 100కు 100 మార్కులు సాధించడం విశేషం.
శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, లెర్నింగ్ రిసోర్స్ సెంటర్ విద్యార్థిని అయిన జైనబ్, ఈ విజయం ద్వారా ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. సాధారణంగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులు పరీక్షలు రాయడానికి సహాయకునిపై ఆధారపడతారు. కానీ జైనబ్ ఎవరి సహాయం తీసుకోలేదు. నేరుగా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి పరీక్షలు రాసిన మొదటి అంధ విద్యార్థినిగా సరికొత్త చరిత్ర సృష్టించిందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
అంతేకాదు జైనబ్ బిలాల్ (zainab bilal) ఇతర రంగాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తన 12వ ఏటనే రేడియో డీపీఎస్ కోసం మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వంటి ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నేను సాధించగలిగినప్పుడు, ఎవరైనా సాధించగలరు. దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలపై నమ్మకం ఉంచి, వారికి అండగా నిలబడితే చాలు’ అంటూ తన ఉత్తీర్ణత సందర్భంగా జైనబ్ ఇచ్చిన సందేశం ఎందరికో స్ఫూర్తిదాయకం.
మాటలు రావడం లేదు
తనకు చిన్నప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి వెళ్లాలని ఉందని జైనబ్ బిలాల్ తెలిపింది. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకుంటున్నట్టు ఆమె పీటీఐతో చెప్పింది. కాగా, చదువు పూర్తయ్యేంత వరకు అండగా నిలిచినందుకు తన పాఠశాలకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది. అడుగడుగునా తోడుగా నిలిచిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు రావడం లేదని పేర్కొంది.
చదవండి: సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే
Tags : 1