ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..
Breaking News
1.70 లక్షల ల్యాండ్ రోవర్ కార్లు రీకాల్
Published on Sat, 04/25/2026 - 17:01
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాలో సుమారు 1.70 లక్షల హైబ్రిడ్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కారులోని విద్యుత్ వ్యవస్థలో తలెత్తిన క్లిష్టమైన లోపం వల్ల వాహనం అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ గుర్తించింది.
సమస్య ఏమిటంటే?
ఈ వాహనాల్లోని DC-DC కన్వర్టర్‌లోని బూస్ట్ కంట్రోల్ మైక్రోచిప్‌లో అంతర్గత లోపం ఉన్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ భాగం 12-వోల్ట్ బ్యాటరీ సిస్టమ్ ఛార్జింగ్‌ను నియంత్రిస్తుంది. ఇది విఫలమైతే, వాహనానికి అందే విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోతుంది. దీనివల్ల కారు ప్రొపల్షన్ (ముందుకు కదిలే శక్తి), బాహ్య లైట్లు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.
హెచ్చరిక సంకేతాలు
సిస్టమ్ పూర్తిగా విఫలమవ్వడానికి ముందు, డ్యాష్‌బోర్డ్ పై "Stop Safely Electric Fault Detected" అనే హెచ్చరిక కనిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్ దీనిని గమనించకుండా డ్రైవింగ్ కొనసాగిస్తే గేర్‌బాక్స్ సరిగ్గా పనిచేయదు. కారు 'న్యూట్రల్' మోడ్‌లోకి వెళ్తుంది.సెంట్రల్ డిస్‌ప్లే, ఎయిర్ కండిషనింగ్ ఆగిపోతాయి. చివరగా ఇంజిన్, బాహ్య లైట్లు పనిచేయడం నిలిచిపోయి వాహనం ఆగిపోతుంది.
ప్రభావితమైన మోడళ్లు
మొత్తం 1,70,169 ఎస్‌యూవీలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. వీటిలో రేంజ్ రోవర్ ఎవోక్ (2020-2023), స్పోర్ట్ (2019-2024), వెలార్ (2021-2024), రేంజ్ రోవర్ స్టాండర్డ్ (2020-2024) మోడళ్లు ఉన్నాయి. అలాగే ల్యాండ్ రోవర్ డిస్కవరీ(2021-2024), డిస్కవరీ స్పోర్ట్(2020), డిఫెండర్ (2020-2024), జాగ్వార్ ఇ-పేస్ (2021-2022), ఎఫ్-పేస్ (2021-2024) వాహనాలకూ రీకాల్ వర్తిస్తుంది.
పరిష్కారం ఇంకా సిద్ధం కాలేదు
రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ సమస్యకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ వద్ద ప్రస్తుతానికి శాశ్వత పరిష్కారం సిద్ధంగా లేదు. సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ అప్‌డేట్ కోసం కంపెనీ కసరత్తు చేస్తోంది. వాహన యజమానులకు ప్రమాదం గురించి హెచ్చరిస్తూ జూన్ 12, 2026 నాటికి నోటీసులు అందుతాయి. పరిష్కారం సిద్ధమైన తర్వాత తుది మరమ్మతు లేఖలు కంపెనీ పంపుతుంది.
భారత్‌పై ప్రభావం?
ప్రస్తుతానికి ఈ రీకాల్ కేవలం అమెరికా మార్కెట్‌కే పరిమితం చేసింది కంపెనీ. అయితే, భారతీయ యజమానులు (ముఖ్యంగా దిగుమతి చేసుకున్న మోడళ్లు వాడుతున్న వారు) గ్లోబల్ VIN (వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్) తనిఖీల ద్వారా తమ కారు సురక్షితంగా ఉందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: కియోసాకి కొత్త వార్నింగ్.. ఈవీలపై కీలక కామెంట్స్
Tags : 1