ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..
Breaking News
వీధి చివరి పానీపూరీ వాలా కనిపించట్లేదని..
Published on Sat, 04/25/2026 - 11:55
మనం రోజూ ఆగే పానీపూరీ బండి ఒక వారం రోజులు కనిపించకపోతే ఏమనుకుంటాం? బహుశా ఆ పానీపూరీ వాలా ఊరెళ్లాడనో లేక తనకు ఆరోగ్య సమస్యనో అనుకుని మరో బండి వద్దకు వెళ్తాం. కానీ ఒక కస్టమర్ మాత్రం తాను రెగ్యులర్‌గా వెళ్లే పానీపూరీ బండి వ్యక్తి ఎందుకు రావట్లేదో ఆరా తీశాడు. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో కింద చూద్దాం.
ఎక్స్ (ట్విట్టర్) యూజర్ అంకిత్ పాండే నిత్యం ఒకే బండి దగ్గర పానీపూరీ తినేవాడు. వరుసగా పది రోజుల పాటు ఆ బండి కనిపించకపోవడంతో అంకిత్ అనుమానం వచ్చి పాత గూగుల్‌పే లావాదేవీల ద్వారా సదరు బండి నిర్వాహకుడి ఫోన్ నంబర్ తీసుకొని కాల్ చేశాడు. అవతలి నుంచి వచ్చిన సమాధానం అంకిత్‌ను కలిచివేసింది.
తన భార్య తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆ వైద్య ఖర్చుల కోసం తన జీవనోపాధి అయిన పానీపూరీ బండిని అమ్మేసుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేయడానికి పని లేదు. ‘సార్, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి’ అని అతను అడిగిన ఆ ఒక్క మాట అంకిత్ ఆలోచనను మార్చేసింది.
సహాయం కాదు.. భాగస్వామ్యం!
కేవలం కొంత ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకోవడం కంటే అతనికి మళ్లీ ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని అంకిత్ నిర్ణయించుకున్నాడు. రోడ్డు పక్కన బండి పెట్టే స్థాయి నుంచి అతడిని ఒక గౌరవప్రదమైన షాపు యజమానిని చేసేలా మాస్టర్ ప్లాన్ వేశాడు.
కొత్త బిజినెస్ మోడల్ ఇలా
అంకిత్ పాండే రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ప్రధాన కూడలిలో నెలకు రూ.15,000 అద్దెతో ఒక షాపు లీజుకు తీసుకున్నాడు. పానీపూరీ బండి వ్యక్తితో నెలకు రూ.20,000 వేతన ఒప్పందం చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షాపు ఓపెన్ ఉండేలా ప్లాన్ చేశాడు.
నమ్మకమే పెట్టుబడిగా..
‘ఈ షాపు ద్వారా రోజుకు కనీసం రూ.5 వేల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంటే నెలకు రూ.1.5 లక్షల ఆదాయం. ఖర్చులన్నీ పోను మీరు రూ.60 నుంచి 70 వేల వరకు లాభం పొందవచ్చు’ అని ఆ బండి వ్యక్తి గణాంకాలతో సహా వివరించడం అంకిత్‌ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నీ కోల్పోయిన వ్యక్తిలో ఇంకా ఎదగాలనే తపన కనిపిస్తోంది. ఇది సానుభూతితో చేస్తున్న సాయం కాదు, ఒక వ్యక్తి మనస్తత్వానికి నేను పెడుతున్న పెట్టుబడి’ అని అంకిత్ పేర్కొన్నారు.
My panipuri wala disappeared 10 days ago. No cart, no sign. I used to go there almost daily, so it felt strange.
Today I found his number from old GPay payments and called him.
He said he sold his entire cart because his wife was admitted to the hospital.
Everything gone. No…— Ankit Pandey (@iamankitpande) April 23, 2026
నెటిజన్ల రియాక్షన్
ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఒకరిలో ఉన్న ఎదుగుదలను గుర్తించి భాగస్వామిగా చేర్చుకోవడం గొప్ప విషయం’ అని ఒక యూజర్ కొనియాడారు. ‘వ్యాపారం పుంజుకున్నాక సదరు వ్యక్తి నిజాయితీగా ఉంటాడా లేదా అనేది గమనించాలి. డబ్బు మనుషులను మారుస్తుంది’ అని మరొకరు హెచ్చరించారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనివ్వడం గొప్ప విషయమే, కానీ ఆ వ్యక్తిలోని నైపుణ్యాన్ని గుర్తించి అతడిని తిరిగి ఒక వ్యాపారస్థుడిగా మార్చడం నిజమైన సామాజిక బాధ్యత అని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
Tags : 1