Breaking News

వస్తున్నాయ్‌... వస్తున్నాయ్‌.. నారీశక్తి రథచక్రాలు

Published on Wed, 04/15/2026 - 00:58

నారీశక్తి రథచక్రాల్‌ వస్తున్నాయ్‌... వస్తున్నాయ్‌’... అవును... ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఈసారి చట్టరూపాన్ని తీసుకోనుంది. ‘మేముపాలిచ్చి పెంచినవాళ్లే మమ్మల్ని విభజించిపాలిస్తున్నారు’ అని గతంలో ఒక కవయిత్రి రాశారు.పాలిచ్చి పెంచగలిగే స్త్రీలకు ప్రజలనుపాలించడం తెలియదా? తెలుసు. మహిళల ప్రాతినిధ్యం పెరగడం ఎంత అవసరమో దాని వల్ల చట్టసభలలో స్త్రీ ప్రధాన, మానవీయ ప్రధాన అంశాలకు ఎంత చోటు దొరకగలదో అందరికీ తెలుసు. కాని ఆట కొనసాగింది. అయితే ఏ ఆటకైనా ముగింపు ఉండనే ఉంది.

2026 అందుకు సాక్షిగా నిలవొచ్చు. మహిళా రిజర్వేషన్‌ బిల్లులో సహేతుకమైన సవరింపులు కూడా ఉన్నాయి. స్త్రీలకు ప్రాతినిధ్యం అన్నప్పుడు స్త్రీలలో ఉన్న అన్ని శ్రేణులకూ చోటు దక్కాలనుకోవడం ఒక న్యాయమైన ప్రతిపాదనే. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ఏప్రిల్‌ 16 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక చర్చ చేయనున్న సందర్భంగా వివిధ ఆలోచనాపరుల అబీప్రాయాలను ఇక్కడ అందిస్తున్నాం.

ఓబీసీ కోటా అవసరం
భారత రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్‌ అనేది ఒక ఎడతెగని చర్చ. ఈ ముప్ఫై ఏళ్లలో ప్రతిసారీ ఒకే ప్రశ్న దగ్గర మహిళా రిజర్వేషన్‌ బిల్లుకి పీటముడి పడి ఆగిపోతోంది. మారుతున్న కాలంలో స్త్రీలకు రిజర్వేషన్లు అంగీకరించే విషయంగా భావిస్తున్నప్పటికీ దానిలో ఇతర వెనుకబడిన కులాలకు కూడా కోటా వుండాలి అనే అంశం దగ్గరే సమస్యంతా వస్తోంది. ఎస్‌.సి., ఎస్‌.టి. కులాలకు ఉప రిజర్వేషన్‌ వుంటుంది కదా ఇంకా అంతకు మించి వుండటం అనవసరం అనే భావజాలమే ప్రధానంగా పనిచేస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీలలో 33% మహిళలకు కేటాయించే రిజర్వేషన్‌లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో సూటిగా చర్చించాలి.

ఓబీసీ కోటా ఎందుకు అవసరం అంటే, ప్రజాస్వామిక రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అనేవి చాలా ముఖ్యమైన అంశం కాబట్టి! మన దేశంలో ఓబీసీ జనాభా అధికం అయినప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం తక్కువ, అందులో మహిళల శాతం మరీ తక్కువ. ఓబీసీ రిజర్వేషన్‌ కూడా ఉంటే గ్రామీణ మహిళలు కూడా రాజకీయ అవకాశాలలోకి, ప్రాతినిధ్యంలోకి రావటానికి ఊతం లభిస్తందనేది నిర్వివాదాంశం. స్త్రీలకు రాజకీయ అవకాశాలంటే అది కేవలం ఆధిపత్య కుల– వర్గ స్త్రీలకే అనే భావజాలం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకి సంబంధించి చాలా విషయాలను అధిగమించాల్సి వుంది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. 50% రిజర్వేషన్‌ పరిమితిని పరిష్కరించడంతోపాటు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, సమగ్ర కులగణన, రాజకీయ అంగీకారం వంటి అనేక సీరియస్‌ అంశాలు దీనితో ముడిపడి వున్నాయి. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వడం ద్వారా సూత్ర్రపాయంగా సమానత్వం, మహిళా సాధికారతకు అడుగు ముందుకు పడుతుంది. అయితే కార్యాచరణలో ఇది అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. – కె. సజయ, సామాజిక కార్యకర్త

ఈ బిల్లు అనివార్యం
ప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మొత్తానికి కొంచం ఆలస్యంగానయినా 128వ అమెండ్‌మెంట్‌ బిల్లుగా ‘మహిళా రిజర్వేషన్‌ బిల్‌’ లోక్‌సభలో పరిగణనకు రానుంది. ఈ బిల్లు ప్రతిపాదించే 33 శాతం మహిళా రిజర్వేషన్‌లో ఎస్‌.సి., ఎస్‌.టి.లకు 1/3 శాతం  సీట్లు ప్రతిపాదించారు. వాస్తవానికి  రెండుసభల్లో (లోకసభ, రాజ్యసభలో) 2/3 శాతం మెజారిటీ వస్తేనే బిల్లుపాస్‌ అవుతుంది. అన్నిపార్టీల మద్దతుతోనే అది సాధ్యం అనేది జగమెరిగిన సత్యం. అదే జరిగి బిల్‌పాస్‌ అయితే లోకసభలో 33 శాతం సీట్లు మహిళలకు దక్కుతాయి.

ఉభయసభల్లో మహిళల ప్రాధాన్యత వల్ల ఎన్నో ఉపయోగాలు లేకపోలేదు. మహిళా సమస్యలను చట్టసభల్లో గట్టిగా వినిపించడానికి ఆస్కారం ఏర్పడుతుంది.పార్లమెంట్‌లో మహిళా బిల్లు పలుమార్లు ప్రతిపాదించడం, రిజెక్ట్‌ చెయ్యడం జరిగింది. 1996, 1998, 2002, 2003లోపార్లమెంట్‌లో రిజెక్ట్‌ చెయ్యడం జరిగింది. 2008లో రాజ్యసభలో ప్రతిపాదించినప్పుడు 186 ఓట్లతో ఆమోదం  పొందింది కానీపార్లమెంట్‌లో ఆ బిల్‌ దురదృష్టవశాత్తు చర్చకు ఎప్పటికీ రానేలేదు. అంటే స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులయినా మహిళల ప్రాధాన్యతలో మార్పు పెద్దగా లేదని అర్థం.  

మన దేశంతో పోల్చినప్పుడు ఎంతో వెనకబడిన ఆఫ్రికన్‌ దేశం రువాండాలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా 61.3 శాతం ఉంది. చిన్న దేశమయినా... క్యూబాలో 53.2 శాతం, నేపాల్‌ 32.7 శాతం, ఫ్రాన్స్, కొరియ, నేపాల్‌లలో మహిళలకు 50 శాతంపార్టీ కోటాపాస్‌ చెయ్యడం జరిగింది.  ఇండియా ముందు అతి చిన్న దేశాలయినా అర్జెంటీనా, మెక్సికో, కోస్టరికా దేశాల్లో 36 శాతం మహిళా లెజిస్లేటివ్‌ మెంబర్స్‌ ఉండడం విడ్డూరం. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమయినా ఇండియాలో ప్రస్తుతం 14.4 శాతం మాత్రమే మహిళలకు ప్రాతినిధ్యం ఉండడం మనందరం సిగ్గు పడాల్సిన విషయం.  మహిళా బిల్లు మన రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉండొచ్చేమో గాని మారిన కాలానికి అనుగుణంగా అదిపాస్‌ అవడం అనివార్యమే. మహిళా బిల్లు ఉభయ సభల్లో పూర్తి మెజారిటితోపాస్‌ అయితే అదొక కొత్త చరిత్రకు నాంది పలకొచ్చు. అందుకై ఆకాంక్షిస్తూ, మంచి మార్పును స్వాగతిస్తున్నాను.  – నిశ్చల సిద్ధ రెడ్డి, హైకోర్టు న్యాయవాది

వెంటనే అమలులోకి తేవాలి
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకి సరయిన ప్రాతినిధ్యం కల్పించాలంటే ఏదో రకమైన రిజర్వేషన్లు తప్పనిసరి అన్నది 20వ శతాబ్దపు ప్రజాస్వామ్య చరిత్ర స్పష్టం చేసింది. మన దేశంలో గ్రామీణ పంచాయతీల్లోనూ, పట్టణపాలనా వ్యవస్థలోనూ దాదాపు 30 ఏళ్ల నుండి అమలవుతున్న రిజర్వేషన్ల కారణంగా అనేక మంది అణగారిన వర్గాల మహిళలు, దాని అమలులో ఎన్ని సమస్యలున్నా సరే, రాజకీయ అనుభవం గడించారు. గడిస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాల పోరాటం తర్వాత 2023లో ఏకగ్రీవంగా అన్నిపార్టీలూపార్లమెంటులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని ఆలస్యం చెయ్యకుండా వెంటనే అమలులోకి తేవాలి.

ఈ మూడు దశాబ్దాల్లో ప్రపంచంలో అనేక దేశాల్లో ఏదో రూపంలో మహిళలకి రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయన్నది గుర్తు చేసుకోవాలి. దీన్ని వివాదాస్పదమయిన డీలిమిటేషన్‌తోనూ ముడిపెట్టటం అవసరమైన ప్రజాస్వామిక చర్చ లేకుండా ప్రభుత్వం తేవాలని అనుకుంటున్న మార్పులకి మహిళా రిజర్వేషన్లని వాడుకోవటం కిందే చూడాలి. జనాభా లెక్కలకి దీనికి కూడా సంబంధం లేదు. అయితే, ఈ చట్టంలో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించిన దళిత, ఆదివాసీ మహిళలతోపాటు ఇతర వెనకబడిన, అణగారిన, అంచుల్లో వున్న అన్ని సమూహాలకు కూడా చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కలిపించాల్సిన అవసరం గురించి ఈ సందర్భంలో చర్చించాలి. దీని గురించిన అన్ని సమూహాలూ పోరాటం చేస్తూనే ఉంటాయి. – ఎ. సునీత, సామాజిక వ్యాఖ్యాత

చారిత్రక స్పృహతో చర్చ జరగాలి
ఐ.కె. గుజ్రాల్, దేవెగౌడ, వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌  ప్రధాన మంత్రులుగా  పనిచేసిన కాలంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపార్లమెంట్‌లో వీగిపోయింది. మహిళల రిజర్వేషన్‌ చట్టంలో సమాంతర రిజర్వేషన్‌ (హారిజంటల్‌ రిజర్వేషన్స్‌)ల కోసం 1996లోపార్లమెంట్‌లో శరద్‌ యాదవ్, నితీష్‌ కుమార్‌లు గట్టిగా వాదనలు వినిపించారు. ఇప్పటిదాకా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలుపార్లమెంట్‌లో అడుగుపెట్టకుండా నిరోధించబడ్డారు...ఈ తప్పును సరిదిద్దాలని అంబేద్కర్‌ దృష్టి కోణం నుంచి వాదనలు జరిగాయి.

2008లో జయంతి నటరాజన్‌ కమిటీకి ముందు ట్రాన్స్‌జెండర్‌ గ్రూప్‌లకు రిజర్వేషన్‌ ఉండాలనే డిమాండ్‌ ఉండేది. ఇది ఇంకా చర్చించ లేదు.పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రశంసించే క్రమంలో ప్రధాని మోదీ ‘మాతృశక్తి’ అనే పదాన్ని ఉపయోగించారు. 2010లో రాజ్యసభలో జరిగిన చర్చలో అన్నాడీయంకె సభ్యుడు డాక్టర్‌ మైత్రేయన్‌ ఉపయోగించిన పదం ఇది. మనకు ప్రాతినిధ్యం కావాలా, లేక గ్రేడెడ్‌ సొసైటీ(అంతరాల సమాజం)కి సమానమైన  ప్రాతినిధ్యం కావాలా అనేది మన ముందు ఉన్న ప్రశ్న.  దళిత్‌ హిస్టరీ మంత్‌ (ఏప్రిల్‌)లో మనం మాట్లాడుతున్నప్పుడు, న్యాయమైన ప్రాతినిధ్యం కోసం మనం ఇంకా ఎంతకాలం వేచి చూడాలి? మహిళా బిల్లుపై చారిత్రక స్పృహతో చర్చ జరగాలి.  – కల్పన కన్నబిరాన్, స్త్రీవాద రచయిత

ప్రభావ వంతమైన అడుగు
నేను నా జీవితమంతా పరుగులతోనే గడిపాను. మొదట కేరళలోని మట్టిదారులలో, ఆ తరువాత ప్రపంచ వేదికపై. ఇప్పుడు ప్రజాజీవనదారుల్లో అడుగులు వేస్తున్నాను. మహిళలకు రాజకీయాలలో స్థానం లేదని చెప్పే అడ్డంకులను ఎదుర్కొన్నాను. వాటిలో కొన్ని కంటికి కనిపించేవి. మరికొన్ని మాటల్లో చెప్పలేనివి. అడ్డంకులు తొలగితే వచ్చే ఫలితం ఏమిటో చూశాను. అవకాశం ఫలితాన్ని మారుస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే నారీ శక్తి వందన అధినియమ్‌ అనేది కేవలం ఒక శాసనపరమైన మైలురాయి మాత్రమే కాదు. నామమాత్రపు పని కూడా కాదు. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే  ఒక ప్రభావవంతమైన అడుగు.
– పి.టి.ఉష, క్రీడాకారిణి

∙అంతర్జాతీయంగా
జెండర్‌ కోటా లేకుండానే...
జాతీయపార్లమెంట్‌లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి క్యూబా రెండో స్థానంలో నిలిచింది. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఎన్నో దేశాలు కోటాలను ఉపయోగిస్తుండగా, క్యూబా అవి లేకుండానే చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అగ్రస్థానంలో ఉంది.

కీలకపాత్ర
మహిళల రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో లాటిన్‌ అమెరికా దేశాలు అగ్రగామిగా ఉన్నాయి. చట్టసభల ద్వారా లింగ సమానత్వాన్ని పెంచడానికి, బాలికలు, మహిళలపై హింసను నిరోధించడానికి చట్టసభలలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు.

అగ్రస్థానంలో రువాండా
చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలలో రువాండా మొదటి స్థానంలో ఉంది. అక్కడి చట్టసభలలో 63.9 శాతం మహిళలు ఉండడం విశేషం. రువాండాలో 2003లో కొత్త రాజ్యాంగం ఏర్పాటు కావడం మహిళలకు సంబంధించి విప్లవాత్మకమైన సామాజిక మార్పుకు దారి తీసింది. ఈ కొత్త రాజ్యాంగం మహిళలకు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించింది.

జెండర్‌ కోటా... ఎంతో ఉపయోగం
’యూఎన్‌ ఉమెన్‌ డేటా ప్రకారం 1 జనవరి 2026 నాటికి... క్యాబినెట్‌ మంత్రి పదవులలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువగా మహిళలు కలిగిన ఉన్న దేశాలు 14 మాత్రమే.
ఐరోపా, ఉత్తర అమెరికాపార్లమెంట్‌లలో మహిళల ప్రాతినిధ్యం 33 శాతం ఉంది. ∙జెండర్‌ కోటాలు మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి గణనీయంగా తోడ్పడ్డాయి. కోటా లేని దేశాలతో పోల్చితే, ఉన్న దేశాలలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏడు శాతం ఎక్కువగా ఉంది.

మదర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌లో...
‘మదర్‌ ఆఫ్‌పార్లమెంట్‌’గా యూకేపార్లమెంట్‌కు పేరు. యూకే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మహిళల ప్రాతినిధ్యం 40.6 శాతం ఉంది. యూకే రాజకీయాలలో లింగ సమానత్వం దిశగా జరుగుతున్న పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని గణంకాలు సూచిస్తున్నాయి.

ఒక్కరూ లేరు!
2026 సంవత్సరం ఆరంభం నాటికి చైనా ఉన్నత స్థాయి రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. చైనా అత్యున్నతపాలక మండలి అయిన ఏడుగురు సభ్యుల  పొలిటికల్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీలో ఒక్కరు కూడా మహిళా లేరు. 

Videos

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి

మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..

సీఎం రేసులో కీలక నేతలు

ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్

చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

Photos

+5

సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్స్ (ఫోటోలు)

+5

తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)

+5

రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)