Breaking News

వాహన విక్రయాలు.. టాప్‌గేర్‌

Published on Wed, 04/08/2026 - 00:09

న్యూఢిల్లీ: వాహన రిటైల్‌ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో 13% పెరిగినట్లు ఆటో డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. ఏడాది ఆరంభంలో ఆటోమొబైల్‌ రంగంలో డిమాండ్‌ కొంత మేర తగ్గినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 అమలుతో విక్రయాలు వేగవంతమయ్యాయని ఫాడా తెలిపింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన పండుగల సీజన్‌లో నవరాత్రి, దీపావళి ఒకే కాలంలో రావడంతో అక్టోబర్‌లో నెలవారీ రిటైల్‌ విక్రయాలు 40 లక్షల యూనిట్లను దాటి ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేశాయి. ఈ ఉత్సాహం తరువాతి నెలల్లోనూ కొనసాగింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెల కూడా రెండంకెల (డబుల్‌ డిజిట్‌) వార్షిక వృద్ధి నమోదైంది. దీంతో ఈ వృద్ధి కేవలం పండుగల ప్రభావం మాత్రమే కాకుండా, నిర్మాణాత్మకంగా బలపడినట్లు స్పష్టమైంది. అన్ని విభాగాల్లో కలిపి వాహన రిటైల్‌ విక్రయాలు 2,61,87,255 (2024–25) నుంచి 13 శాతం వృద్ధితో 2,96,71,064 యూనిట్లకు చేరాయి. 

జీఎస్‌టీ 2.0 అమలుతో బూస్ట్‌: ఫాడా అధ్యక్షుడు  
భారత ఆటో రిటైల్‌ రంగం 2025–26 ఆర్థిక సంవత్సరంలో చరిత్రాత్మక ప్రదర్శన కనబర్చిందని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్‌.విఘ్నేశ్వర్‌ తెలిపారు. మొత్తం 2.96 కోట్లకు పైగా వాహనాలు విక్రయంతో ఆటో రంగం కొత్త గరిష్ట స్థాయిని చేరిందన్నారు. ఈ వృద్ధి కేవలం సంఖ్యల పరంగానే కాకుండా, పరిశ్రమ 3కోట్ల మార్క్‌కు చేరువవుతోందని సూచిస్తోందన్నారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న మొబిలిటీ అవసరం, మెరుగైన కొనుగోలు సామర్థ్యం, వివిధ ఇంధన సాంకేతికతల విస్తరణ ఈ వృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని వివరించారు.

అయితే, ఏడాది మొత్తం వృద్ధి సమానంగా కొనసాగలేదన్నారు. గత ఏడాది ఇన్వెంటరీ సమస్యలు, ఫైనాన్సింగ్‌ పరిమితులు, వినియోగదారుల ‘వెయిట్‌ అండ్‌ వాచ్‌’ ధోరణి కారణంగా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు విక్రయాలు మోస్తరుగా ఉన్నాయని తెలిపారు. అయితే, సెప్టెంబర్లో అమలైన జీఎస్‌టీ 2.0తో పరిస్థితి మారిందని, చిన్న వాహనాలు, ద్విచక్ర వాహనాలపై పన్ను తగ్గడంతో కొనుగోలు సామర్థ్యం పెరిగి డిమాండ్‌ ఊపందుకుందని వెల్లడించారు.   

అప్రమత్తతతో కూడిన ఆశావాద దృక్పథం: ఫాడా 
పశ్చిమాసియా పరిస్థితుల్లో మార్పులు భారత ఆటో రిటైల్‌ రంగంపై కీలక ప్రభావం చూపవచ్చని ఫాడా పేర్కొంది. ఇంధన ధరలు, సరఫరా లభ్యత, వినియోగదారుల విశ్వాసం ఆటో రంగం దిశను నిర్ణయించే ప్రధాన అంశాలుగా మారనున్నాయని తెలిపింది. తాజా సర్వే ప్రకారం, 53.2 శాతం డీలర్లు సరఫరా లేదా డిస్పాచ్‌లో అంతరాయాలను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. వీరిలో 17.1 శాతం డీలర్లు మూడు వారాలకుపైగా గణనీయమైన జాప్యాలు (కంపెనీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరాలో ఆలస్యం) నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా వాణిజ్య వాహనాల విభాగంలో ఎక్కువగా కనిపించింది. అలాగే ప్యాసింజర్‌ వాహనాలు (పీవీ), ద్విచక్ర వాహనాల (టూ వీలర్స్‌) డీలర్లు కూడా కొన్ని మోడళ్లలో ఆలస్యాలు ఉన్నట్లు తెలిపారు. 

ఇంధన ధరల పెరుగుదల కూడా కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. సుమారు 36.5 శాతం డీలర్లు పెరుగుతున్న లేదా పెరగవచ్చని భావిస్తున్న ఇంధన ధరలు వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. దీని వల్ల కొనుగోలు నిర్ణయాలు ఆలస్యమవడంతో పాటు, కస్టమర్లు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) వైపు మళ్లే అవకాశముందని ఫాడా తెలిపింది. అయితే, ఫైనాన్సింగ్‌ పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, 72.5 శాతం డీలర్లు రుణ నిబంధనల్లో మార్పులేదని వెల్లడించారు. మొత్తంగా, సమీప కాలంలో జాగ్రత్తతో కూడిన ఆశావాద దృక్పథాన్ని ఫాడా వ్యక్తం చేసింది.  

ఈవీ రిటైల్‌ విక్రయాలు @ 24.52 లక్షలు
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) రిటైల్‌ విక్రయాలు గత (2025–26) ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. మొత్తం 24.52 లక్షల ఈవీలు అమ్ముడైనట్లు ఫాడా తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2024–25)లో విక్రయాలతో పోలిస్తే ఇవి 24.6 శాతం అధికంగా ఉన్నాయి. ప్రతి వాహన విభాగం కూడా రెండంకెల వృద్ధిని నమోదు చేయడం విశేషం. ‘‘ఎఫ్‌వై 2026 భారత ఎలక్ట్రిక్‌ మొబిలిటీ రంగానికి మైలురాయిగా నిలిచింది. ఇది ఆటోమొబైల్‌ రంగ విజయం మాత్రమే కాదు, ‘ఎనర్జీ మార్పిడి’లో భారతదేశ నాయకత్వ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. దేశ ఈవీ ప్రయాణం స్థిరమైన వేగంతో దూసుకెళ్తోంది అనేందుకు విక్రయ గణాంకాలు నిదర్శనం’’ అని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్‌. విఘ్నేశ్వర్‌ తెలిపారు. 

2025–26లో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహన (పీవీ) విక్రయాలు 1,99,923 యూనిట్లు అమ్ముడయ్యాయి. రెండు లక్షల యూనిట్ల లక్ష్యం కొద్దిలో చేజారింది. అయితే ఎఫ్‌వై25లోని 1,08,873 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 83.63% వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహనాలు 78,811 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచాయి. తరువాత జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా 53,089 యూనిట్లతో రెండో స్థానంలో, మహీంద్రా అండ్‌ మహీంద్రా 42,721 యూనిట్లతో మూడో స్థానంలో నిలిచాయి.   

 ఎలక్ట్రిక్‌ ద్వి చక్ర వాహనాల విభాగంలో 21.81% వృద్ధితో 14,01,818 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 3,41,513 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్‌ ఆటో 2,89,349 యూనిట్లతో రెండో స్థానంలో, ఏథర్‌ ఎనర్జీ 2,39,178 యూనిట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.  
 ఎలక్ట్రిక్‌ త్రి చక్ర వాహనాల విక్రయాలు 18.97 % వృద్ధితో 8,30,819 యూనిట్లకు చేరాయి. అలాగే ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహన అమ్మకాలు 120.57% పెరిగి 19,454 యూనిట్లుగా నమోదయ్యాయి.  

Videos

రావాలి మావిగన్.. కావాలి ఏపీ విన్

బూతు కిట్టు.. బ్రోకర్ కృష్ణ.. నీ తోలు వలిచి చెప్పులు కుట్టించకపోతే..

ABN రాధాకృష్ణ రాతలపై YS జగన్ ఆగ్రహం

డ్రంక్ అండ్ డ్రైవ్ బీభత్సం.. ఇద్దరు యువకులు మృతి

కాల్పుల విరమణ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

నీతిలేని కుక్క.. ఇంకోసారి అలాంటి రాతలు రాస్తే చెప్పుతో కొడతాం..

బూతు కిట్టూ నీతిలేని రాతలు.. చంద్రబాబు చెబితే దేనికైనా

అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?

బ్రోకర్ రాధాకృష్ణ నీకు కూతుర్లు లేరా.. RK రోజా వార్నింగ్

CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...

Photos

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)