ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
Published on Wed, 04/01/2026 - 11:17
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీమియం ఇంధనాలతో పాటు వాణిజ్య ఎల్‌పీజీ, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ షాక్ ఇచ్చింది.
ప్రీమియం ఇంధనాలకు ధరల సెగ
లగ్జరీ కార్లు, సూపర్ బైక్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్‌పీ100 (100-ఆక్టేన్ పెట్రోల్) ధర ఢిల్లీలో లీటరుకు ఏకంగా రూ.11 పెరిగింది. దాంతో రూ.149 నుంచి రూ.160 కు చేరింది. ఎక్స్‌ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) రూ.91.49 నుంచి రూ.92.99 కు పెంచింది. రెండు వారాల క్రితమే హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను రూ.101.89 కు సవరించగా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా అదే బాటలో పయనించింది.
రూ.2,000 దాటిన వాణిజ్య సిలిండర్ ధర
వ్యాపారస్తులు, హోటళ్లు, క్యాటరింగ్ రంగంపై కమర్షియల్ ఎల్‌పీజీ భారం పడింది. జనవరి 1, 2026 నుంచి ఇది ఇటీవలి పెంపుతో ఐదోసార్లు ధరలు పెంచినట్లయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర (ఏప్రిల్ 1) రూ.2,078.50 (19 కిలోల సిలిండర్)గా ఉంది. మార్చి 1 నాటి ధర రూ.1,768.50. గత నెల రోజుల్లోనే రూ.310 మేర భారం పడింది.
ఏటీఎఫ్ రూ.2 లక్షలు
విమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ధర రూ.2,07,341.22 (కిలోలీటరుకు). గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో గరిష్టంగా రూ.1.1 లక్షలు ఉన్న ధర, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని రికార్డులను తుడిచివేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ భారాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఊరట
ప్రీమియం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సాధారణ వాహనదారులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సాధారణ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ధరల సెగ తగలకుండా చూసేందుకు మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల చమురు కంపెనీలకు కలిగే భారీ నష్టాలను భర్తీ చేయడంతో పాటు రిటైల్ మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది.
ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!
Tags : 1