జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్
కొత్త తరం ఉగాది స్వరం
Published on Thu, 03/19/2026 - 00:37
ఉగాదంటే వాకిట్లో పూల రుతువు
చిగుర్లేసే తీవెల నుండి... విప్పారే పూవుల నుండి... కోయిలమ్మల గొంతుల నుండీ... చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి... కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి. ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసే రోజు. కోయిల గొంతులో సంబరం వంటి ఈ తెలుగువారి పండుగపై కవయిత్రి మానస చామర్తి ఏమంటున్నారో తెలుసుకుందాం...
ఉగాది చాలా నెమ్మదైన పండుగనిపిస్తుంది నాకు. సంక్రాంతికి ఉన్నట్టు పెద్ద ఆర్భాటముండదు. దసరా దీపావళులకున్నట్టు సందడీ, సెలవులూ ఉండవు. పైపెచ్చు పిల్లల పరీక్షల కాలం. ఒక్కటంటే ఒక్కటే రోజుకు సెలవు. అయినా అది కాదు లెక్క. విరబూసే పూల ఋతువు వాకిట్లో కనపడుతున్నప్పుడు, గుప్పెడు గుప్పెడు ప్రాణాలు గొంతు విప్పి ఉదయాలను మేల్కొల్పుతున్నప్పుడు, క్యాలెండర్ కన్నా ముందు హృదయానికే తెలుస్తుంది, ఈ కాలమేదో ప్రత్యేకమని. ఏడాది మొత్తానికీ ఇది పండుగకాలమని. అందుకే గీతలో కృష్ణుడు కూడా, తాను ఋతువులలో వసంతాన్నని చెప్పుకున్నాడు (ఋతూనాం కుసుమాకరః). ఆ వసంత ఋతువు, చైత్ర మాసపు తొలిరోజునే మనం ఉగాదిగా పిలుస్తున్నాం.
చిగుర్లేసే తీవెల నుండి, విప్పారే పూవుల నుండి, కోయిలమ్మల గొంతుల నుండీ చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి, కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి! ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసుకునే సందర్భం. రేగిపళ్ళు, పసిడితోరాలు, పానకం వడపప్పులు, పుస్తకాల మీద పసుపు ఓంకారాలు, బొమ్మల కొలువులు, గోంగూరకాడలు...ఒక్కో పండక్కీ జతపడే ఆనవాయితీ ఒకటుంది మనకి. ఉగాది అంటే అట్లా గుర్తొచ్చేవి మరీ ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.
ఏడాది పొడుగునా అన్నీ దొరికే ఈ కాలంలో కూడా ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజునే దొరుకుతుంది.
నచ్చి, ఇంకోసారి చెయ్యమని మారాం చేస్తే, ఇది ఈ ఒక్కరోజే తినాలని ఆ పసి్రపాణాన్ని బుజ్జగించిన అమ్మ గొంతు చెవుల్లో ఇంకా అట్లానే వినపడుతోంది. వేపకొమ్మల నుండి వేప పూవులను సాధించుకుని, తెల్లటి పల్చటి రేకులను మాత్రం జాగ్రత్తగా వొలిచి ఆ పచ్చడి గిన్నెలో కలపడం నా పని. చిన్నప్పుడంతా ఉగాది రోజు ఉదయాన్నే ఎవరో పుణ్యాత్ములు ఇంటింటికీ తిరిగి గుమ్మాల దగ్గర వేపకొమ్మలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇంటికొకరు చొప్పున చెట్లెక్కి వేపకొమ్మలు విరిచే శ్రమను తప్పించడమన్నమాట. కావాలా? అని అడగడం కూడా ఉండేది కాదు. వేప పూరేకులు వొలిచి, పొట్లాలు చుట్టి, రేటు కట్టి అమ్ముతున్న ఈ రోజుల్లో నిలబడి చూస్తే, నా చిన్నప్పటి ఊరికీ, ఆ వేపగాలికీ చాలా దూరం వచ్చేశాననిపిస్తోంది.
రాజపూజ్యమూ– అవమానమూ, ఆదాయమూ వ్యయమూ, పుట్టి బుద్ధెరిగాక ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ఇవి జంటగా నాకు బాగున్న దాఖల్లాల్లేవు. అయినా పంచాంగ శ్రవణమంటే చెవులప్పజెప్పి కూర్చోవడమే తెలుసు. మానవ సహజమైన ఆశ ఒకటి, ఎవరేమి చెప్పినా అంతా మంచే జరగనుందని నమ్మబలికేది. ఆ అద్భుతాల కోసం ఏడాది పొడుగునా ఎదురుచూడటమే జీవితమనిపించేది. కొత్త సంవత్సరం, కొత్త ఋతువు, కొత్త మాసం...మట్టి పలక మీద నీళ్ళు జల్లి, శ్రద్ధగా తుడిచి మళ్ళీ నచ్చినవేవో రాసుకోమన్నట్టు– కొత్త ఉగాది. జనవరి ఒకటికి రాసుకుని మర్చిపోయిన కలలకి మళ్ళీ కాస్త కదలిక వచ్చే రోజు. మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త నియమాలతో కొత్త జాబితాలు తయారు. మళ్ళీ నిండు వాగ్దానమై చేతుల్లో పడ్డట్టుండే జీవితం.
ఆరోగ్యంగా మేలుకునే ప్రతిరోజూ మనిషికి దొరికే కొత్త అవకాశమే కానీ, ఉగాది మాత్రం వాగ్దానమనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే చాలు. అడుగు బయటపెడితే చాలు పూలు, సీతాకోకల రంగుల తేజస్సు, విరిసే మల్లెల పరిమళం, కోయిల గొంతులోని సంబరం – అయాచితంగా మనిషికి బట్వాడా అయిపోతాయని నాకనిపిస్తుంది. ఆ కాస్త వ్యవధి, ఆ కాస్త ప్రయత్నం ఆశించగలమా ఈ హడావుడి జీవితాల నుండీ, అన్నది ప్రశ్న. ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాదంతా అదే చేస్తామన్న అమాయకపు నమ్మిక ఒకటి ఉండేది. అందుకని మంచి మాటలే మాట్లాడటం, మంచిపనులే చెయ్యడం, ఇష్టమైన వాళ్ళని కలవడం, కలిసి, ఏడాదంతా మనదేనని చెప్పుకోవడం... ఎదిగే క్రమంలో ఎక్కడో పారేసుకున్నాను ఈ అందమైన విశ్వాసాన్ని.
సాయంకాలపు నడకల్లో మామిడిచెట్లు కనపడితే ఇప్పుడు చూపు ఆగిపోతోంది. ఆ పూతవేసిన లేతమావి శోభ కాళ్ళను కట్టిపడేస్తోంది. పక్క వీధిలో ఉండే స్నేహితురాలొకరు, ఈ ఏడాదికి మొదటగా పూశాయంటూ దోసెడు మల్లెలు చూపించారు. ఎగబీల్చిన పరిమళం నా ఊపిర్లో కలిసిపోయింది. గుత్తులు గుత్తులుగా వాకిట్లో ఏవేవో పూవులు. ఆ పూల మధువు కోసం పూటా కొందరు కొత్త అతిథులు.
‘ఎవరు వారు వచ్చేరు? పూవుల తేరుపై; చైత్ర రథంలోన శ్యామపత్రపథంపైన, ఎవరా వచ్చేది?’ అని ప్రశ్నించి, అది ఉగాది అది ఉగాది అంటారు కృష్ణశాస్త్రి. ఉగాదితో పాటు వచ్చే ఈ అతిథులను చూస్తే నాకైతే ‘రొద సేయకే తుమ్మెదా...‘ అని పాడాలనిపిస్తుంది. నెలల తరబడి నీళ్ళు పోస్తూ ఆశగా చూసినన్నాళ్ళూ పూలు రాల్చని మొక్కల మీదకి, మొగ్గలు మొదలవుతూనే తుమ్మెదల తాకిడి. ఆ పూల మెత్తదనాన్ని తాకి చూసే వీలైనా లేకుండా మత్తుగా ఆ పూరెమ్మల మీదే తూగుతూ కనపడతాయ్. ‘ఈ పూల ఋతువంతా ఈ తేటిదో... ఈ తోటమాలిదో...’ అన్న సినీకవి సందేహం ఇప్పుడు నాది కూడా.
Tags : 1