కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు
Breaking News
కట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు
Published on Mon, 03/16/2026 - 11:01
వరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్.
కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’
సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.
ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయం
సిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు.
కొలాం సంస్కృతిలో లేదు
వరకట్నం అనేది కొలాం సంస్కృతిలో లేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
– దేశ్‌ముఖ్ లేతు, టెంబ్రీగూడ పటేల్
తల్లిదండ్రులకు భారం కావద్దని..
ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో వరకట్నాన్ని నిషేధించాం. ఇకపై కొలాం సమాజంలో జరిగే వివాహాలు సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాం. వరకట్న నిర్మూలనలో సమాజంలో సమానత్వం పెరిగి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది.
– కొడప సోనేరావు, కొలాం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు
కట్నమియ్యలే..
మొన్ననే నా బిడ్డ పునేశ్వరి లగ్గం చేసిన. ఉట్ను ర్ మండలం సుద్దగూడ కు ఇచ్చిన. వరకట్నం మాత్రం ఇయ్యలే. నేను కూలీ పని చేస్తుంటా. బిడ్డ పెండ్లీడుకు రావడంతో గుబులు పడ్డా. అయితే గ్రా మస్తులంతా కలిసి వరకట్నం నిషేధించడంతో పాటు లగ్గానికి రూ.20 వేలు సాయం కూడా చేశారు.
– పెందుర్ జంగుబాయి,కోసుపటేల్ గూడ
వరకట్నం నిషేధించాం..
మా గూడెంలో అంతా పేదవారే. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి చేయలంటే చాలా కష్టంగా మారింది. దీంతో మేము ఇటీవల సమావేశమయ్యాం. వరకట్నం నిషేధించాం. అలాగే అమ్మాయి కుటుంబానికి తలా కొంత జమ చేసి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
– కుమురం రావుజీ, పటేల్, కోసుపటేల్‌గూడ
పెళ్లింటికి.. ఆర్థిక చేయూత
ఇంద్రవెల్లి: ఆదివాసీ, గోండు తెగల్లోనూ చాలామంది వరకట్నాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఎవరిదైనా ఆయా గ్రామాల్లో కులస్తులు కానుకలు ఇవ్వకుండా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పెళ్లింటికి చేదోడుగా నిలుస్తున్నారు. మండలంలోని వడగామ్ గ్రామంలో కనక కోసేరావ్ పెళ్లి రెండు రోజుల క్రితం జరిగింది. ఈమేరకు గ్రామస్తులంతా కలిసి రూ.25 వేలు అందించారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురు ఆత్రం రోష్ణకు గ్రామస్తులు రూ.26 వేలు అందించారు. మండలంలోని పిప్రి గ్రామంలో ఆదివారం పెళ్లి పీటలు ఎక్కనున్న ఆత్రం సుజాతకు గ్రామస్తుల ఆధ్వర్యంలో రూ.7,100 అందించారు. ఇలా ఆదివాసీలు తలా కొంత నగదు సేకరించి పెళ్లి కుటుంబాలకు అందించి ఆర్థికంగా మద్ధతిస్తున్నారు.
Tags : 1