పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
Breaking News
ప్రపంచంలోనే అధికంగా వంటగ్యాస్ ఉత్పత్తి చేసే దేశం
Published on Sun, 03/15/2026 - 16:22
భారతదేశంలో సగటు సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేసే ప్రధాన అంశాల్లో గ్యాస్ ధర ఒకటి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు నేరుగా భారతీయులపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న ఈ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారులు అని భావిస్తారు. కానీ అసలు వాస్తవం ఏమిటో.. ప్రపంచంలో ఏ దేశం ఎక్కువగా వంటగ్యాస్ ఉత్పత్తి చేస్తుందో కింద చూద్దాం.
గ్యాస్ సరఫరాకు కీలకంగా హార్మూజ్ జలసంధి
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ సరఫరాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఈ షిప్పింగ్ కారిడార్‌లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు అధికం కావడంతో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో సిలిండర్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.
అమెరికానే నంబర్ వన్
చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద ఉత్పత్తిదారులు అని భావిస్తారు, కానీ వాస్తవం వేరు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అగ్రగామి ఎల్‌పీజీ ఉత్పత్తిదారుగా అవతరించింది. అమెరికా ఏటా సుమారు 84 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని ఉత్పత్తి చేస్తోంది. అంటే ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 26% వాటా ఒక్క అమెరికాదే.
చైనా 32 మిలియన్ టన్నులు, సౌదీ అరేబియా 26 మిలియన్ టన్నులతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రష్యా నాలుగో స్థానంలో ఉంది. కెనడా, ఇరాన్, ఖతార్, యూఏఈలు కూడా ఈ జాబితాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
ఎల్‌పీజీ అసలు ఎలా తయారవుతుంది?
ఎల్‌పీజీ అంటే ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇది ప్రధానంగా రెండు మార్గాల్లో లభిస్తుంది. భూమి లోపలి నుంచి సహజ వాయువును వెలికితీసేటప్పుడు ప్రొపేన్, బ్యూటేన్‌లను వేరు చేస్తారు. ఇతర మార్గాల్లో రిఫైనరీల్లో ముడి చమురును పెట్రోల్, డీజిల్‌గా మార్చే ప్రక్రియలో ఎల్‌పీజీ ఒక ఉప ఉత్పత్తిగా వస్తుంది.
భారత్ పరిస్థితి ఏమిటి?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌పీజీ వినియోగదారుల్లో ఒకటి. ఉజ్వల యోజన వంటి పథకాలతో గ్యాస్ వినియోగం పెరిగినప్పటికీ మన దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు సరిపోవడం లేదు. భారత్ తన అవసరాల కోసం ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు లేదా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పుడు దాని ప్రభావం నేరుగా దేశీయ సిలిండర్ ధరలపై పడుతోంది.
ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
Tags : 1