పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
Breaking News
యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
Published on Sun, 03/15/2026 - 12:58
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ, శాంతి మంత్రం కన్నా శతఘ్నుల మోతకే ప్రాధాన్యత పెరుగుతోంది. దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, అంతర్యుద్ధ భయాలు సామాన్యుడిని భయపెడుతుంటే.. ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలకు మాత్రం ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా 2021-2025 మధ్య కాలానికి సంబంధించి ఎస్‌ఐపీఆర్‌ఐ(స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) తాజాగా వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచ ఆయుధ మార్కెట్ ఏ విధంగా అగ్రరాజ్యాల గుప్పిట్లోకి వెళ్తోందో స్పష్టమవుతోంది.
అమెరికా ఏకఛత్రాధిపత్యం
ప్రపంచ ఆయుధ విక్రయాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం ఎగుమతుల్లో 42% వాటాను సొంతం చేసుకోవడం ద్వారా తన సమీప ప్రత్యర్థి కంటే నాలుగు రెట్లు అధికంగా ఆయుధాల వ్యాపారం చేస్తోంది. అమెరికా ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కొన్ని కారణాలున్నాయి.
అత్యాధునిక యుద్ధ విమానాలు (ఎఫ్-35 వంటివి), క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా సాంకేతికతలో అమెరికాకు సాటిలేదు.
నాటో దేశాలతో పాటు ఆసియా, మిడిల్‌ఈస్ట్ దేశాలతో ఉన్న రక్షణ ఒప్పందాలు అమెరికా ఆయుధాలకు నిరంతర డిమాండ్‌ను కల్పిస్తున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికా వైపు మొగ్గు చూపడం వల్ల ఈ వ్యాపారంలో మరింత వృద్ధి నమోదైంది.
ఎస్‌ఐపీఆర్‌ఐ నివేదిక ప్రకారం.. ప్రపంచ దేశాల ఆయుధ ఎగుమతుల వాటా (2021–25)
| దేశం | ఎగుమతుల వాటా (%) |
|---|---|
| యూఎస్ | 42 |
| ఫ్రాన్స్ | 10 |
| రష్యా | 7 |
| జర్మనీ | 6 |
| చైనా | 6 |
| ఇటలీ | 5 |
| ఇజ్రాయెల్ | 4 |
| యూకే | 3 |
| దక్షిణ కొరియా | 3 |
| స్పెయిన్ | 2 |
| ఇతర దేశాలు | 12 |
చైనాను వెనక్కి నెట్టిన జర్మనీ.. యూరప్ జోరు
ఆయుధ ఎగుమతుల్లో జర్మనీ చాలా పురోగతి సాధిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. మొత్తంగా 6% వాటాతో జర్మనీ ఇప్పుడు చైనాను అధిగమించి నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్‌లో భద్రతా ఆందోళనలు పెరగడం, నాటో దేశాలు స్వదేశీ (యూరోపియన్) పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం జర్మనీకి కలిసొచ్చింది. మరోవైపు, చైనా తన ఎగుమతులను ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్ దేశాలకే పరిమితం చేస్తోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల పాశ్చాత్య దేశాలు చైనా ఆయుధాల పట్ల విముఖత చూపడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
దక్షిణ కొరియా
ప్రస్తుతం ఆయుధ మార్కెట్లో దక్షిణ కొరియా చాలా దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తంగా కేవలం 3% వాటా ఉన్నప్పటికీ అది వేగంగా వృద్ధి చెందుతోంది. ఇతర దేశాల కంటే తక్కువ సమయంలో ఆయుధాలను డెలివరీ చేయగల సామర్థ్యాన్ని ఇది సొంతం చేసుకుంటోంది. అత్యాధునిక ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలను తక్కువ ధరకు అందిస్తోంది. తూర్పు యూరప్, ఆగ్నేయాసియా దేశాలు దక్షిణ కొరియా ఆయుధాల కోసం ఆర్టర్లు పెడుతున్నాయి.
ఆయుధాల ఎగుమతి కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక దేశం భౌగోళిక రాజకీయ ప్రాబల్యానికి నిదర్శనం. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటుండగా, దక్షిణ కొరియా వంటి కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. శాంతి చర్చల కంటే ఆయుధ ఒప్పందాలే వేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ‘మారణాయుధాల వ్యాపారం’ ప్రపంచాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!
Tags : 1