విజయు ఎఫైర్ ఉంది.. విడాకులు కోరిన దళపతి భార్య
Breaking News
ఏఐతో మరిన్ని అవకాశాలు
Published on Fri, 02/27/2026 - 06:35
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు.
2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు.
Tags : 1