మెక్సికోలో మాఫియా గ్యాంగ్ బీభత్సం..
Breaking News
సహజయోగం బ్రహ్మచైతన్యమైన వేళ...
Published on Mon, 02/23/2026 - 05:51
భారతదేశం పుణ్యభూమి, ధర్మభూమి, యోగభూమి. ఈ గడ్డపైన ఎందరో ఋషులు, మహా ఋషులు, అవతార మూర్తులు, ఆధ్యాత్మిక గురువులు జన్మించారు. అలాంటి ఆధ్యాత్మిక గురువులలో అంతర్జాతీయంగా గుర్తింపు, మన్ననలను పొందిన పరమపూజ్య శ్రీ మాతాజీగా పిలువబడే శ్రీమతి నిర్మలా దేవి శ్రీ వాత్సవ ఒకరు. ఆమె కారణ జన్మురాలని ఆమెను గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.
పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి కేవలం ఒక ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత, సర్వధర్మ సంస్థాపనకోసం ఊరూరా తిరిగి, విదేశాలలో పర్యటించి తాను నమ్మిన సత్యాన్ని, ధర్మాన్ని స్వయంగా ఆచరించి చూపించిన ఆత్మసాక్షాత్కార గురువు. ప్రవక్తలందరూ చెప్పిన ధర్మాలన్నీ ఒకేచెట్టుకు పూసిన పువ్వులే అయినప్పటికీ, ఎవరికి తోచిన పువ్వును వారు కోసుకుని వివిధ మతాలను స్థాపించుకుని, వాటి ప్రవక్తలు ప్రవచించిన మూల సూత్రాలను పక్కదారి పట్టిస్తున్న సమయంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి అటువంటి వాటినుండి వాస్తవాన్ని, అసలు సత్యాన్ని సహజయోగం ద్వారా బహిర్గత పరచారు.
పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1970 మే 5 వ తేదీన తన స్వీయ తపోశక్తి ద్వారా ‘సహజయోగ’ ని ఆవిష్కరించారు. తనలో నిద్రాణ స్థితిలో వున్న కుండలినీ శక్తిని జాగృతి చేసి సహస్రార చక్రం తెరిచి తద్వారా తన లోని ఆ భగవత్ శక్తి అయిన కుండలినీ శక్తిని బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమైక శక్తి అయిన పరమ చైతన్యంతో అనుసంధానం చేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కార స్వీయ అనుభూతిని సాధించారు. ‘సహ’ అంటే మనతో ‘జ’ అంటే జన్మించిన శక్తి, యోగ అంటే బాహ్య పరంగా వున్న శక్తితో కలయిక అని అర్థం. ఆ విధంగా మనలోని కుండలినీ శక్తి బాహ్యపరంగా విశ్వవ్యాపిత భగవత్ శక్తితో ఏకీకరణ పొందినప్పుడు మనం కూడా ఆ పరమాత్మ దివ్య శక్తిలో ఓ భాగమైపోతాము.
పరమచైతన్యం లేక బ్రహ్మ చైతన్యం అంటే విశ్వవ్యాపితమైన పరమాత్మ ప్రేమ శక్తి మాత్రమే. విశ్వాన్నంతటిని, సకల చరాచర జీవులను, నడిపించే భగవత్ శక్తి. మానవ మేధస్సుకు అతీతమైనది.
ఆత్మ సాక్షాత్కారం పొంది ప్రతినిత్యం సహజయోగ సాధన చేస్తున్నవారి సహస్రార చక్రం పూర్తిగా వికసించి, మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఉన్న 7 చక్రాలు తెరుచుకుని బ్రహ్మ చైతన్యంలో అంతర్భాగాలైన అధిష్టాన దేవతలు మేల్కొనబడి మనకు తమ ఆశీర్వచనాలు అందచేస్తారు. సదాశివుని అర్ధాంగి అయిన ఆదిశక్తి ఆయన చుట్టూ పరివేష్టించి ఓ చల్లటి మేఘం లాగా ఆవృతమై వుంటుంది. అదే బ్రహ్మ చైతన్యం. పరమచైతన్య శక్తిగా పిలువబడుతున్న ఆ శక్తియే పరమాత్మ అయిన సదాశివుని ఇచ్చాశక్తి. ఆ శక్తియే విశ్వాన్ని సృష్టించింది. భూమి మీద వున్న జీవజాలం మీద,మానవుల మీద తన పరమ చైతన్య శక్తిని వెదజల్లుతుంది. మనల్ని అంతర్గతంగా బలోపేతం చేస్తుంది, పోషిస్తుంది. మనలో ప్రేమ శక్తిగా అంకురిస్తుంది.
అందుకే ఆత్మసాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారందరూ ఈ భగవంతుని ప్రేమ శక్తిని తన చుట్టూ ఉన్న పదిమందికీ పంచడానికి కృషి చేస్తారు. కుల, మత, జాతి, ప్రాంత, వయసు, లింగ భేదాలు లేకుండా ఎవరైనా, ఎప్పుడైనా అతి సునాయాసంగా ఆచరించగలిగే ఈ సహజయోగం దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే శారీరిక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం. మనిషి ఎన్నో ఏళ్లనుండి, ఎన్నో జన్మలనుండి అన్వేషిస్తున్న ‘సత్యాన్ని’ సహజయోగ ధ్యానం ద్వారా ఆవిష్కరించి ఎటువంటి స్వార్థచింతన లేకుండా మానవాళికి శ్రీ మాతాజీ నిర్మలా దేవి అందించారు.
సహజయోగం ద్వారా వారిని భగవంతుని శక్తితో అనుసంధానపరచి తమ కష్టాలను, సమస్యలను ధ్యానం ద్వారా తమను తాము ఎలా సమతుల్యంలో ఉంచుకోవాలో, ఎలా తమ సమస్యలను తమంతట తాము పరిష్కరించుకోవాలో తెలుసుకుని ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఇలా కోరుకున్న ప్రతి ఒక్కరిలో సరైన పరివర్తన తీసుకురాగలిగే ‘నవ సమాజ నిర్మాణం’, ‘వసుధైక కుటుంబం’, ‘సర్వమానవ సౌభాతృత్వం’ ‘ద్వేష రహిత, ప్రేమ పూరిత సమాజం’ ఏర్పడటం సుసాధ్యమే అని తాను స్థాపించిన సహజయోగం ద్వారా శ్రీ మాతాజీ నిర్మలా దేవి ఆచరించి నిరూపించారు. శ్రీమతి నిర్మలాదేవి తన జన్మ సార్ధకం చేసుకుని 2011 వ సంవత్సరం, ఫిబ్రవరి 23వ తేదీన తన సాకార రూపాన్ని చాలించుకుని నిరాకారం లోనికి వెళ్ళిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా సహజయోగ ధ్యానకేంద్రాలలో ప్రతిఏటా ఫిబ్రవరి 23వ తేదీన ‘బ్రహ్మ చైతన్య దినోత్సవం’ గా జరుపుకుంటున్నారు.
– డా. పి. రాకేష్, సహజ యోగ సాధకులు
(నేడు అంతర్జాతీయ బ్రహ్మచైతన్య దినోత్సవం)
Tags : 1