రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
Breaking News
ఊహా స్వర్గాలు... విఫల నగరాలు
Published on Sun, 02/22/2026 - 04:07
సత్సంకల్పంతో ప్రారంభమైన కొన్ని నగరాలు చరిత్రలో నిలిచిపోతాయి. శతాబ్దాలు గడిచినా, తరతరాల జనావాసాలుగా కళకళలాడుతూ ఉంటాయి. సంకల్పశుద్ధి లేకుండా, భ్రమాత్మకమైన అంచనాలతో, అత్యాశతో, అనవసర స్పర్థలతో ప్రారంభించ తలపెట్టిన కొన్ని నగరాలు కార్యరూపం దాల్చకుండానే కనుమరుగైపోతాయి. అలాంటి నగరాల్లో కొన్ని అరకొర నిర్మాణాలతో కాలగతిలో అధోగతికి చేరుకుంటాయి. అవి కేవలం ఊహాస్వర్గాలుగా మాత్రమే మిగిలిపోతాయి. వనరుల వృథాకు, మానవశ్రమ వృథాకు కారణభూతమైన ఇలాంటి విఫల నగరాలు ప్రపంచంలో ఉన్నాయి. జనాలకు ఉపాధి లేకుండా, ఉత్పాదక కార్యకలాపాలు లేకుండా, కనీసం పర్యాటకుల రాకపోకలైనా లేకుండా భూతాల నిలయాల్లా కనిపించే అలాంటి కొన్ని విఫల నగరాల కథా కమామిషు తెలుసుకుందాం...
జింగోనియా- ఇటలీ
ఇటలీలోని అత్యంత పురాతన నగరాల్లో మిలాన్ ఒకటి. ప్రపంచ ఫ్యాషన్ రాజధానిగా పేరుపొందిన మిలాన్ నగరానికి ఆనుకొని, దానికి దీటైన నగరాన్ని నిర్మించాలని రోమన్ వాణిజ్యవేత్త రెంజో జింగోనె తలపెట్టాడు. జింగోనియా పేరుతో 1960లలో యాభైవేల జనాభా నివాసానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసి, నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. కార్మికుల వసతి కోసం జింగోనె ఈ నగర నిర్మాణానికి సంకల్పించాడు. వివిధ పరిశ్రమల కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు కర్మాగారాలకు చేరువలోనే ఆవాసాలను ఏర్పాటు చేస్తే, వారి రవాణా సమయం తగ్గి, ఉత్పాదకత పెరుగుతుందని ఆశించాడు.
జింగోనియా నగరంలో కార్మికులకు ఇళ్లతో పాటు వారి అవసరాలకు అనుగుణంగా షాపింగ్ మాల్, ఆస్పత్రి, భారీస్థాయి హోటల్, క్రీడా మైదానం, హెలికాప్టర్ల రాకపోకల కోసం హెలిపోర్ట్ వంటి వాటితో భారీ ప్రణాళికను సిద్ధం చేసి, మొదలుపెట్టిన జింగోనియా నగర నిర్మాణం విఫలమైంది. ఐదు పట్టణాల సరిహద్దులకు అనుబంధంగా చేపట్టిన ఈ నగర నిర్మాణం పౌర సేవలు అందించడంలో, పాలనలోను వైఫల్యం వల్ల జనాలకు ఎందుకూ పనికిరాకుండా మిగిలింది.
ప్లాన్ వాజిన్ - ఫ్రాన్స్
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ జనసమ్మర్దానికి, పారిశుద్ధ్య సమస్యలకు పరిష్కారంగా తలపెట్టిన నగరం ప్లాన్ వాజిన్. సెంట్రల్ ప్యారిస్ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మించడంతో పాటు సేన్ నది కుడివైపు ఒడ్డున ఆధునిక అవసరాలకు తగిన రీతిలో ప్రణాళికాబద్ధంగా నిర్మించ తలపెట్టిన నగరం ఇది. ఫ్రాన్స్‌లో స్థిరపడిన స్విస్ ఆర్కిటెక్ట్ ల కార్బ్యూజీర్ బహుళ అంతస్తుల భవంతులతో కూడిన ఈ అధునాతన నగర నిర్మాణం కోసం 1925లో ప్రణాళికను సిద్ధం చేశాడు. దీనికోసం సెంట్రల్ ప్యారిస్ నుంచి ప్యారిస్ శివారు ప్రాంతాలకు తరలిపోవడానికి సంపన్న ఉద్యోగ వర్గాలు సిద్ధపడినా, అదే ప్రాంతంలో తరతరాలుగా ఉంటున్న భూస్వాములు మాత్రం తమకు అలవాటైన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరించారు.
కొంతమంది ఇళ్లు ఖాళీ చేసి తరలిపోవడంతో సేన్ నది కుడివైపు ఒడ్డున దాదాపు ఆరువందల ఎకరాల స్థలంలోని పాత కట్టడాలను పడగొట్టారు. మిగిలిన జనాలను కూడా ఇక్కడి నుంచి శివార్లకు తరలించి, ఈ ప్రదేశంలో ఒకేలాంటి అరవై అంతస్తుల ఆకాశ హర్మ్యాలను నిర్మించాలని అనుకున్నా, అది సాధ్యపడలేదు. ఖాళీ చేయడానికి మొండికేసిన భూస్వాములు నగరపాలక అధికారులపై పట్టు బిగించారు. భూస్వాముల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు– నది ఒడ్డున ఏకంగా అరవై అంతస్తుల భవంతులు నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తవచ్చంటూ కార్బ్యూజీర్ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఫలితంగా ఇది కార్యరూపం దాల్చకుండా శాశ్వతంగా మూలపడింది.
టెలోసా - అమెరికా
అగ్రరాజ్యమైన అమెరికాలో భూతలస్వర్గంలాంటి నగరాన్ని నిర్మించాలని అపరకుబేరుడు మార్క్ లోర్ తలపెట్టాడు. మార్క్ లోర్ సంకల్పం మరీ భూతకాలంలోనిది కాదు, ఇట్టిటీవలిదే! ఆయన 2021లో టెలోసా పేరుతో లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో అమరధామంలాంటి అద్భుత ఆత్మనిర్భర, సుస్థిర నగరాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించాడు. ఒక నగరాన్ని నిర్మించాలంటే దశాబ్దాలు పట్టే పరిస్థితులు ఉంటాయి కదా, అలాంటిది ఐదేళ్లలోనే దీనిని విఫల నగరంగా ఎలా జమకట్టేస్తారనే అనుమానం వస్తోందా? ఎందుకంటే, ఈ నగరం కోసం ఇప్పటి వరకు ఎక్కడా భూమి కొనుగోలు చేయలేదు. ఇప్పటి వరకు దీనిని కచ్చితంగా ఎక్కడ నిర్మించదలచుకున్నదో కూడా తేల్చుకోలేదు. నెవాడ, యూటా, అరిజోనా, టెక్సస్, అపలాషియా ప్రాంతాల్లో ఏదో ఒకచోట దీనిని నిర్మించనున్నామని, 2030 నాటికల్లా ఈ నగరాన్ని యాభైవేల మంది నివసించేలా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం కాగితాలకు, వెబ్‌సైట్‌కు మాత్రమే పరిమితమైన ఈ నగరం 2030 నాటికి ఒక ఆకారాన్ని సంతరించుకునే పరిస్థితులు కనుచూపు మేరలో లేవు కాబట్టి, ఇది కూడా విఫల నగరంగానే మిగిలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.
కాలిఫోర్నియా సిటీ - అమెరికా
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన నగరం కాలిఫోర్నియా సిటీ. కాలిఫోర్నియాలోని అతిపెద్ద నగరాలైన లాస్ ఏంజెలెస్, శాండియాగోలకు దీటైన నగరాన్ని నిర్మించాలని అమెరికన్ రియల్టర్ న్యాట్ మెండల్సన్ సంకల్పించుకున్నాడు. లాస్ ఏంజెలెస్‌కు ఈశాన్యాన సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని మోహవీ ఎడారి ప్రాంతంలో 82 వేల ఎకరాల స్థలాన్ని 1958లో కొనుగోలు చేశాడు. ఈ ఎడారి నేలలో నగర నిర్మాణాన్ని 1965లో ప్రారంభించాడు. ప్రారంభ దశలో 1.40 లక్షల జనాభా ఆవాసానికి తగిన విధంగా రహదారులు, నివాస భవనాలు, విమానాశ్రయం, గోల్ఫ్‌కోర్స్, విశాలమైన స్విమింగ్ పూల్, జైలు భవనం సహా పలు భారీ నిర్మాణాలు జరిపించాడు. నివాస భవనాల నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందే కిలోమీటర్ల కొద్ది విశాలమైన రోడ్లు నిర్మించారు.
అనుకున్న సంఖ్యలో నివాస భవంతుల నిర్మాణం చేపట్టడంలో మెండల్సన్ విఫలమయ్యాడు. లాస్ ఏంజెలెస్పై స్పర్థతో అతడు ప్రారంభించిన ఈ నగరం ప్రస్తుతం జనసంచారం లేక మరుభూమిలా మిగిలింది. ఎడారి ప్రాంతంలో నిర్మించిన ఈ నగరం చివరకు ఎడారిలా మారిందని జనాలు వాపోవడం తప్ప దీనివల్ల సాధించినదేమీ లేదు. దీని నిర్మాణం కోసం చేసిన భారీ వ్యయమంతా వృథాగా మారింది. మెండల్సన్ ఇక్కడ నగరాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే, చాలామంది ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేశారు. వారందరికీ కోలుకోలేని నష్టమే మిగిలింది.
అలైస్ సిటీ - జపాన్
జపాన్ రాజధాని టోక్యో నగరం జనసమ్మర్దంతో కిక్కిరిసి పోతుండటంతో దీనికి పరిష్కారంగా భూగర్భ నిర్మాణాన్ని తలపెట్టింది ఒక నిర్మాణ సంస్థ. టోక్యో నగరానికి దిగువన సమస్త సౌకర్యాలతో స్వర్గతుల్యమైన భూగర్భ నగరాన్ని నిర్మించడానికి జపానీస్ నిర్మాణ సంస్థ టాయ్సీ కార్పొరేషన్ 1989లో ప్రణాళికను కూడా రూపొందించింది. భూగర్భంలో బహుళ అంతస్తులతో నిర్మించ తలపెట్టిన ఈ నగరానికి అలైస్ సిటీ అని నామకరణం చేసింది. టౌన్ స్పేస్, ఆఫీస్ స్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అనే మూడు విభాగాలతో ఈ నగర ప్రణాళికను పకడ్బందీగా తయారు చేసింది.
టౌన్ స్పేస్‌లో నివాస భవనాలు, పార్కులు, సినిమా థియేటర్ల వంటి వినోద కేంద్రాలు; ఆఫీస్ స్పేస్‌లో కార్యాలయ భవనాలు, హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు వంటి నిర్మాణాలు; ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్‌లో నగరం అంతటికీ సౌర విద్యుత్తు సరఫరాకు అవసరమైన సోలార్ డోమ్స్, మంచినీటి సరఫరా కేంద్రం, టోక్యో నగరం నుంచి రాకపోకలు జరిపేందుకు వీలుగా భూగర్భ మెట్రో రైలు మార్గం వంటి మౌలిక వసతులను నిర్మించాలని సంకల్పించుకుంది. అలైస్ సిటీ తలపెట్టిన అనతికాలంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. మరోవైపు, భూగర్భంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టినా, అగ్నిప్రమాదాల వంటి విపత్తులు సంభవిస్తే జనాల ప్రాణాలకు భద్రత కల్పించడం సాధ్యమయ్యే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఇది ప్రతిపాదనలకు, కాగితాల మీద రూపొందించిన ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైంది.
మాడర్ఫాంటీన్ - దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాలో జోహాన్నెస్‌బర్గ్‌కు చేరువలోనే మరో అద్భుత నగరాన్ని నిర్మించే ప్రతిపాదనతో చైనీస్ రియల్ ఎస్టేట్ డెవలపర్ షాంఘై జెండాయ్ 2013లో ముందుకొచ్చాడు. ఈ ప్రతిపాదనకు జౌటెంగ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా, జోహాన్నెస్‌బర్గ్ మునిసిపల్ అధికారులు మాత్రం దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రావిన్షియల్ ప్రభుత్వం వరుస మీడియా సమావేశాలు నిర్వహించింది. జోహాన్నెస్‌బర్గ్ పక్కనే ‘దక్షిణాఫ్రికా న్యూయార్క్’ నగరం సిద్ధమవుతోందని పత్రికలు, టీవీ చానెళ్లు కథనాలతో ఊదరగొట్టాయి. దాదాపు నాలుగువేల ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ నగరం కోసం 8400 కోట్ల రాండ్లు (రూ.47 వేల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి జౌటెంగ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం సంసిద్ధత ప్రకటించింది.
అధునాతన నగర నిర్మాణం కోసం జెండాయ్ స్థలం కూడా కొనుగోలు చేశాడు. దురదృష్టవశాత్తు దక్షిణాఫ్రికా ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకుంది. మరోవైపు స్థానిక అధికారుల నుంచి జెండాయ్ని నమ్ముకుని వచ్చిన విదేశీ పెట్టుబడిదారులకు సమస్యలు మొదలయ్యాయి. అనుకున్న ప్రకారం నిర్మాణాలు మొదలు పెట్టాలనుకున్న నాటి నుంచి అధికారుల నుంచి అడుగడుగునా సహాయ నిరాకరణ ఎదురవడంతో పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. ఆరంభంలో ఎంత ఊదరగొట్టినా, ఏళ్లు గడిచినా ఇక్కడ తలపెట్టిన నిర్మాణాలేవీ మొదలు కాలేదు. క్రమంగా జనాల్లో కూడా దీనిపై ఆసక్తి సన్నగిల్లింది. చివరకు కార్యరూపం దాల్చకుండానే మాడర్ఫాంటీన్ నగర ప్రణాళిక అటకెక్కింది.
డోంగ్టాన్ - చైనా
చైనాలోని షాంఘై పరిధిలో ఉన్న చాంగ్మింగ్ దీవిలో తలపెట్టిన ‘ఎకో సిటీ’ డోంగ్టాన్. బ్రిటిష్ ఇంజినీరింగ్ సంస్థ ‘అరూప్’ షాంఘై పారిశ్రామిక పెట్టుబడుల సంస్థతో (ఎస్ఐఐసీ) కలసి 2005లో ఈ నగర నిర్మాణానికి సంకల్పించింది. ‘అరూప్’ లండన్ కార్యాలయం నుంచి ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత సివిల్ ఇంజినీర్ పీటర్ హెడ్ పర్యవేక్షిస్తూ వచ్చారు. షాంఘై కమ్యూనిస్టు పార్టీ అధినేత చెన్ లియాంగ్యు రాజకీయంగా అండగా నిలిచారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘వరల్డ్ అర్బన్ ఫోరమ్’ వేదికపై ఈ ఎకో సిటీ నమూనాను ప్రదర్శించి, ‘అరూప్’ సంస్థ ప్రశంసలు పొందింది. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సుస్థిర, పర్యావరణహిత నగరంగా ‘డోంగ్టాన్’ నగరం రూపుదిద్దుకోనున్నట్లుగా మీడియా కథనాలు వెల్లువెత్తాయి.
ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆరంభంలోనే రాజకీయ ఆటంకాలు ఎదురవలేదు. ఇన్ని సానుకూలతలు ఉన్నాక ఇప్పటికే ఈ నగర నిర్మాణం ఒక కొలిక్కి వచ్చి ఉండాలి. అయినా, ఇది నేటికీ ప్రణాళికలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టుకు ఏమాత్రం సంబంధం లేని పింఛను కుంభకోణంలో చెన్ లియాంగ్యు, కీలకమైన ఆయన మద్దతుదారులు 2008లో అరెస్టయ్యారు. అనుకోని ఈ పరిణామంతో ‘అరూప్’ సంస్థకు రాజకీయ అండ కొరవడింది. అయినా వెనక్కు తగ్గకుండా ‘అరూప్’ సంస్థ ఈ ప్రాజెక్టు నమూనాను 2010లో జరిగిన ‘షాంఘై వరల్డ్ ఎక్స్పో’లో ప్రదర్శించింది.
ఆ కార్యక్రమానికి హాజరైన నాయకులు దీనిని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. నగర నిర్మాణానికి భూకేటాయింపులు కూడా జరిగాయి. అయితే, రాజకీయ నాయకుల అంతర్గత కుమ్ములాటలు, అవినీతి వ్యవహారాల కారణంగా పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. క్రమంగా వార్తా కథనాల్లో కూడా ‘డోంగ్టాన్’ ప్రస్తావన వినిపించడం మానేసింది. తర్వాత చడీచప్పుడూ లేకుండా ఈ నగర నిర్మాణ ప్రణాళిక మూలపడింది.
Tags : 1