ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు..
Published on Thu, 02/19/2026 - 10:57
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా సెగలు రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న చమురు ధరలు ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. తాజా ట్రేడింగ్ సెషన్ల ప్రకారం అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒక్కరోజే సుమారు 4.35% పెరిగి బ్యారెల్‌కు 70.35 డాలర్ల వద్దకు చేరింది. యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ 4.59% లాభపడి 65.19 డాలర్లకు వద్దకు చేరుకుంది. సెప్టెంబర్ 2025 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.
ధరల పెరుగుదలకు కారణాలు
చమురు ధరలు ఉన్నపలంగా పెరగడానికి భౌగోళిక రాజకీయ, ఆర్థిక అంశాలు కారణంగా ఉన్నాయి. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయవచ్చనే వార్తలు మార్కెట్లలో భయాందోళనలు సృష్టించాయి. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20- నుంచి 30% వాటా హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తుందన్న హెచ్చరికలు మార్కెట్ అంచనా వేస్తోంది. ఇది చమురు సరఫరా నిలిచిపోతుందనే భయాన్ని పెంచుతున్నాయి.
సరఫరాలో అంతరాయాలు
ఉత్తర అమెరికాలో కొనసాగుతున్న తీవ్రమైన చలి వాతావరణం కారణంగా చమురు ఉత్పత్తి, రిఫైనరీ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇటీవల ప్రపంచ చమురు సరఫరా రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గింది. సౌదీ అరేబియా, రష్యాతో కూడిన ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తి కోతలను పొడిగించడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది.
పెరుగుతున్న డిమాండ్
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనాల ప్రకారం, 2026లో ప్రపంచ చమురు డిమాండ్ రోజుకు 8,50,000 బ్యారెళ్లు పెరగనుంది. ముఖ్యంగా చైనా, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వస్తున్న డిమాండ్ చమురు ధరల పెరుగుదలకు మద్దతునిస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
భారతదేశం తన చమురు అవసరాలలో 85% పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర పెరిగితే దాని ప్రభావం నేరుగా కనిపిస్తుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లు వెచ్చించాల్సి రావడంతో రూపాయి విలువ ఒత్తిడికి గురవుతుంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం వద్ద తగినంత చమురు నిల్వలు ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్!
Tags : 1