మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
Breaking News
మీ లాకర్ ఎంత భద్రం?
Published on Mon, 02/16/2026 - 04:34
బ్యాంకు లాకర్లో పెట్టేదే భద్రంగా ఉంటాయని. మరి అక్కడే చోరీ జరిగితే? తమకు సంబంధం లేదని బ్యాంకులు తప్పించుకోజూస్తే? పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇదే జరిగింది. 2016లో ఈ బ్యాంకు లాకర్లో ఓ కస్టమర్ ఉంచిన విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. రాష్ట్ర వినియోగ వివాదాల పరిష్కార కమిషన్ రూ.59 లక్షల పరిహారానికి ఆదేశించింది. బ్యాంకు జాతీయ కమిషన్‌కు అప్పీల్ చేసింది. తాజాగా జాతీయ కమిషన్ తీర్పునిస్తూ... లాకర్ భద్రతలో వైఫల్యం ఉన్నప్పుడు బ్యాంక్ తప్పించుకోలేదని స్పష్టంచేసింది. నష్ట పరిహారాన్ని రూ.5 లక్షలకు తగ్గించింది. మరి ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిందేంటి? అదే ఈ ‘వెల్త్’ స్టోరీ...
రెండేళ్లలో బంగారం ధర 150 శాతానికి పైనే పెరిగింది. వెండి ధర ఐదు రెట్లు ఎగిసింది. మరి ఇంతటి విలువైన వస్తువుల్ని ఇంట్లో ఉంచటం సేఫేనా? పోనీ బ్యాంకు లాకర్లో పెడితే భద్రతకు గ్యారంటీ ఉంటుందా? వాస్తవానికి ఇల్లయినా, బ్యాంకయినా పటిష్ట రక్షణ చర్యలతోనే అక్కడ పెట్టిన వస్తువులకు భద్రత. ఒకవేళ లాకర్లో విలువైన వస్తువులను కోల్పోతే పరిస్థితేంటి? అందుకు బ్యాంక్‌లు పూర్తి బాధ్యత తీసుకోవా? సేఫ్ట్ లాకర్ విషయంలో కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా? అసలు లాకర్ ఎవరికి అవసరం? ఒకసారి చూద్దాం...
లాకర్ చార్జీలు ఎంతంటే..
→ ప్రాంతం, బ్యాంక్, లాకర్ పరిమాణం ఆధారంగా చార్జీలుంటాయి
→ సాధారణంగా చిన్న లాకర్‌కు వార్షిక చార్జీ రూ.1,000–3,000
→ మధ్యస్థ లాకర్‌కు రూ.3– 6వేలు... పెద్ద లాకర్‌కు రూ.6 –12 వేలు
→ ఈ చార్జీపై జీఎస్టీని ... ఒప్పందానికి సంబంధించి స్టాంప్ డ్యూటీని చెల్లించాలి.
→ లాకర్ కోసం బ్యాంక్‌లు డిపాజిట్లు అడుగుతాయి. లాకర్‌ను క్లోజ్ చేసినప్పుడు వీటిని తిరిగి పొందొచ్చు.
→ వార్షిక చార్జీలు బకాయి పడి, కస్టమర్ స్పందించని సందర్భాల్లో లాకర్ బ్రేకింగ్‌కు అయ్యే చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తాయి.
బ్యాంకులపై బాధ్యత లేదా..?
→ లాకర్ల నిర్వహణకు సంబంధించి బ్యాంకులపై బాధ్యత ఎంత వరకు అన్నది కస్టమర్‌తో కుదుర్చుకునే ఒప్పంద పత్రాల్లో వివరంగా ఉంటుంది.
→ నిర్లక్ష్యం లేదా భద్రత వైఫల్యం కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అందుకు బ్యాంకులదే బాధ్యత.
→ చోరీ, దోపిడీ, అగ్ని ప్రమాదం, భవనం కూలిపోవడం లేదా బ్యాంక్ ఉద్యోగుల మోసం కారణంగా నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించాల్సిందే.
→ ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదల కారణంగా లాకర్లలో వాటికి నష్టం కలిగితే బ్యాంకులపై బాధ్యత ఉండదు. కానీ, బ్యాంక్ తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ సమయాల్లో నష్టం ఏర్పడితే అప్పుడు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
→ లాకర్లోని వాటికి నష్టం జరిగినప్పటికీ.. బ్యాంకుల బాధ్యత పరిమితంగానే ఉంటుంది. లాకర్ వార్షిక అద్దె చార్జీలకు గరిష్టంగా 100 రెట్ల వరకే అవి చెల్లిస్తాయి. ఉదాహరణకు లాకర్లోని రూ.20 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండాపోయాయనుకోండి. లాకర్ చార్జీ రూ.6,000 ఉంటే, అప్పుడు గరిష్టంగా రూ.6 లక్షల మొత్తాన్ని బ్యాంక్ చెల్లిస్తుంది.
→ వరుసగా మూడేళ్ల పాటు వార్షిక చార్జీలు చెల్లించకపోతే లేదా ఏడేళ్లపాటు లాకర్‌ను తెరవకపోతే నోటీసు జారీ చేసి.. మూడు నెలల తర్వాత లాకర్లను బ్యాంక్‌లు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. నోటీసులకు స్పందన రానప్పుడు.. పేపర్ ప్రకటన ఇచ్చి, ఇద్దరు సాక్షుల సమక్షంలోనే ఈ పని
చేయాలి.
ఇన్సూరెన్స్‌తో రక్షణ
→ లాకర్లను సురక్షితంగా ఉంచేందుకు దాదాపు అన్ని బ్యాంక్‌లు గట్టి చర్యలు చేపడతాయి. అయినా, కొన్ని ఘటనల్లో కస్టమర్లకు నష్టం జరుగుతుంటుంది
→ కాబట్టి లాకర్లలో విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు ఉంచే వారు వ్యక్తిగతంగా వాటికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి.
→ బ్యాంకుల మాదిరి లాకర్ చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం అన్న పరిమితి బీమాలో ఉండదు.
→ బంగారం, వెండి ఆభరణాలు, విలువైన రాళ్లు, ఇతర విలువైన వస్తువులు, పత్రాలకు సైతం బీమా రక్షణ పొందొచ్చు.
→ దోపిడీ, దొంగతనాలు, బ్యాంకు ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా మోసం, అగ్ని ప్రమాదాలు, పేలుడు, భూకంపాలు లేదా వరదలు కారణంగా లాకర్లోని వాటికి ఏర్పడే నష్టానికి బీమా పరిహారం పొందొచ్చు.
→ లాకర్లలో ఉంచిన కరెన్సీ నోట్లకు నష్టం వాటిల్లితే బీమా పరిహారం రాదు.
→ తుప్పు పట్టడం, చెద పురుగులు, వాతావరణంలో తేమ కారణంగా ఏర్పడే నష్టానికి కూడా బీమా పాలసీలో రక్షణ ఉండదు.
ఇలాంటి లాకర్లుంటేనే భరోసా...
→ బ్యాంక్‌లు లాకర్లకు సంబంధించి సీసీటీవీ కెమెరా, అలారమ్ (హెచ్చరించే) సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి.
→ లాకర్లు సురక్షితంగా ఉండేలా భవన నిర్మాణం ఉండాలి. రాత్రిళ్లు తగినంత భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి.
→ లాకర్ తెరిచిన ప్రతి సందర్భంలో ఖాతాదారుడి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్‌ను పంపించాల్సి ఉంటుంది.
→ లాకర్‌కు సంబంధించి బ్యాంక్‌లకు ఉండే బాధ్యత ఎంత మేర? అనేది ఒప్పందంలో వివరంగా ఉండాలి.
→ నామినేషన్ సదుపాయం కలి్పంచాలి. ఒప్పందంపై సంతకాలు చేయించుకుని, కాపీని కస్టమర్‌కు సైతం అందించాలి.
వీరికి పెద్దగా ఉపయోగం ఉండదు..
→ కేవలం కొన్ని ఆభరణాలే ఉన్నా... వాటి విలువ తక్కువగా ఉన్నా..
→ బ్యాంక్‌కు వెళ్లి లాకర్ నుంచి తీసుకొచ్చి, మళ్లీ లాకర్లో పెట్టడం వీలు పడని వారు.
అసలు లాకర్లు ఎవరికి..?
→ అధిక విలువ కలిగిన ఆభరణాలున్నప్పుడు. ముఖ్యంగా వారసత్వంగా వచి్చన ఆభరణాలున్నవారికి అనుకూలం.
→ వ్యాపార లావాదేవీలకు సంబంధించి సున్నితమైన డాక్యుమెంట్లు ఉన్నప్పుడు.
→ ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లు, పార్టనర్íÙప్ డీడ్లు ఉన్నవారు.
→ పటిష్టమైన రక్షణ చర్యలు లేని అద్దె ఇళ్లలో నివసించే వారు.
→ ఇళ్లల్లో కేవలం వృద్ధులే ఉండే వారికి బ్యాంకు లాకర్లు ఎంతో ఉపయోగకరం.
లాకర్లో వేటికి చోటు..?
→ బంగారం, వజ్రాభరణాలు
→ ప్రాపర్టీ క్రయ, విక్రయ దస్తావేజులు
→ వీలునామాలు, చట్టబద్ధమైన పత్రాలు
→ బాండ్ సరి్టఫికెట్లు, అరుదైన కలెక్షన్లు
నమోదు చేస్తే నయం...
→ లాకర్లో ఏవేవి ఉంచుతున్నారనే విషయాన్ని ఒక రికార్డులో రాసి ఉంచుకోవటం మంచిది.
→ ఆభరణాలు, వాటి బరువు, వస్తువుల వివరాలు రాయండి. వీటి కొనుగోలు బిల్లులు, ఫొటోలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
→ లాకర్లో తీసి, పెడుతున్న ప్రతి సారీ వాటి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.
→ ఆభరణాలకు సంబంధించి విలువ నిర్ధారణ
సరి్టఫికెట్లు దగ్గర ఉంచుకోవాలి.
→ లాకర్‌కు తప్పకుండా నామినేషన్ తీసుకోవాలి. అవసరమైనప్పుడు నామినీని అప్డేట్ చేసుకోవాలి.
→ ఏడాదిలో ఒకసారి అయినా లాకర్‌ను తెరిచి, మూయడం చేయాలి.
→ డాక్యుమెంట్లు తేమ కారణంగా దెబ్బతినే రిస్క్ ఉంటుంది. కనుక దెబ్బతినని విధంగా ప్యాక్ చేసి పెట్టాలి.

వీటిని ఉంచకండి..
→ దేశ, విదేశీ కరెన్సీ నోట్లు
→ హానికారక మెటీరియల్స్
→ పాడైపోయే వస్తువులు
→ ప్రమాదకరమైన వస్తువులు
→ ఆయుధాలు, డ్రగ్స్, మందుగుండు సామగ్రి
→ చట్టవిరుద్ధమైనవి కూడా..
నష్టం జరిగితే...
→ లాకర్లో ఉంచినవి దెబ్బతిన్నట్టు గుర్తించినా లేదా కనిపించక పోయినా బ్యాంక్ మేనేజర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలి.
→ బ్యాంక్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అక్కడి వెళ్లి ఫిర్యాదు చేయాలి.
→ కస్టమర్ నిర్లక్ష్యం లేని సందర్భాల్లో జరిగిన నష్టానికి బ్యాంక్‌లు పరిహారం చెల్లించాల్సిందే.
→ బ్యాంక్‌లు పరిహారానికి నిరాకరిస్తే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించొచ్చు.
→ అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను సంప్రదించాలి.
Tags : 1