Breaking News

విదేశాల్లో విశ్వనాథుడు

Published on Sun, 02/15/2026 - 00:08

త్రిమూర్తులలో ఒకడైన శివుడు త్రినేత్రుడు. శంకరుడైన శివుడు భక్తవశంకరుడు. అతడే విశ్వనాథుడు. శివారాధన భారత భూభాగానికి మాత్రమే పరిమితం కాదు. పురాతన కాలం నుంచి కొన్ని ఇతర దేశాల్లోనూ శివారాధన ఉండేది. అందుకు నిదర్శనంగా ఇప్పటికీ ఆ దేశాల్లో 
ఆనాటి శివాలయాలు ఉన్నాయి.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విదేశాల్లో ఉన్న కొన్ని పురాతన శివాలయాల గురించి తెలుసుకుందాం.

పశుపతినాథ్‌ ఆలయం
మన పొరుగు దేశమైన నేపాల్‌ రాజధాని కఠ్మాండు శివార్లలో బాగ్‌మతి నదీతీరంలో ఈ ఆలయం ఉంది. పురాతన శైవక్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం గురించిన ప్రస్తావన పలు పురాణ, చరిత్ర గ్రంథాలలో కూడా ఉంది. ‘గోపాలరాజ వంశావళి’ ప్రకారం దీనిని ప్రచండ దేవ కట్టించాడు. పురాణ గ్రంథాల్లోని ఆధారాల ప్రకారం క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికే ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. వనవాస కాలంలో పాండవులు ఇక్కడ వెలసిన పశుపతినాథుడిని దర్శించుకున్నట్లు ‘కోటి రుద్రసంహిత’ కథనం. నేవారీ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి.

ప్రాంబనన్‌ ఆలయ సముదాయం
పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఇండోనేసియా రాజధాని యోగ్యకర్తా ప్రత్యేక ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంగణంలో త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి. వీటిలో అతి ఎత్తయిన గోపురం ఉన్నది శివాలయం. ఈ ప్రాంగణంలో శివాలయమే ప్రధానమైనది. ఈ ఆలయాలు క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటివి. ఇప్పటి జావా ద్వీపం కేంద్రంగా ఏర్పడిన మాతరం రాజ్యాన్ని ఏలిన రాజులు ఈ ఆలయాలను నిర్మించారు. రాజు రాకాయి పికాతన్‌ క్రీస్తుశకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు దీనిని విస్తరించారు. ఇందులోని శివాలయాన్ని 856లో ప్రారంభించినట్లు శాసనాధారాలు ఉన్నాయి.

మై సన్‌ సాంక్చుయరీ
ఇది వియత్నాంలో ఉంది. పురాతన చంపా నాగరికతకు చెందిన చామ్‌ రాజవంశీకులు శివారాధకులు. వారు క్వాన్‌ నామ్‌ ప్రావిన్స్‌లో దాదాపు డెబ్బయి శివాలయాలను నిర్మించారు. ఈ ఆలయాలు క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నుంచి పదమూడో శతాబ్ది మధ్యకాలంలో నిర్మించినవి. వీటిలో చంపా రాజు భద్ర వర్మ నిర్మించిన భద్రేశ్వర ఆలయం ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఆనాటి చంపా రాజ్య రాజధాని ట్రా కీయు నుంచి దక్షిణాన హోయి అన్‌ వరకు దాదాపు ముప్పయ్యారు కిలోమీటర్ల మార్గంలో ఈ పురాతన ఆలయాలను నిర్మించారు. వీటిని ఇటుకలతో నిర్మించడం విశేషం. ఈ ఆలయాలను చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.

మున్నేశ్వరం ఆలయం
పురాతనమైన ఈ శివాలయం శ్రీలంకలోని పుట్టాళం జిల్లా మున్నేశ్వరం గ్రామంలో ఉంది. వెయ్యేళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే గాథలు స్థలపురాణాలుగా ప్రచారంలో ఉన్నాయి. శ్రీలంకలోని ఐదు పురాతన శైవక్షేత్రాలైన ‘పంచ ఈశ్వరం’ క్షేత్రాలలో మున్నేశ్వరం ఒకటి. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై సరైన ఆధారాలు లేవు. అయితే, క్రీస్తుశకం 1412లో కొట్టె రాజ్యాన్ని పాలించిన పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని తొలిసారి పునరుద్ధరించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. పదహారో శతాబ్దిలో పోర్చుగీసు సేనల దాడిలో ఈ ఆలయం దెబ్బతింది. ఆ తర్వాత కాండ్యన్‌ రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ పద్దెనిమిదో శతాబ్దిలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.

ప్రీహ విహార్‌
పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం కాంబోడియాలో ఉంది. కాంబోడియా– థాయ్‌లండ్‌ సరిహద్దుల్లోని డాంగ్రేక్‌ పర్వతశ్రేణులలోని నిటారుగా ఉన్న కొండ మీద దాదాపు ఎనిమిది వందల మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రీహ విహార్‌ ఆలయ సముదాయం క్రీస్తుశకం పదకొండో శతాబ్ది నాటిది. ‘ప్రీహ విహార్‌’ అంటే దేవతల విహార స్థలం అని అర్థం. ఖ్మేర్‌ రాజులు మొదటి సూర్యవర్మ, రెండో సూర్యవర్మ ఇక్కడ శిఖరేశ్వర, భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారు. వీటి చుట్టూ అనేక ఉపాలయాలను కూడా నిర్మించారు. నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తయిన మెట్లతో కూడిన మార్గం ఒక్కటే శరణ్యం. పర్యాటకులు పెద్దసంఖ్యలో ఈ ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు.

Videos

బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?

ఇది రాష్ట్రం కోసం పెట్టిన బడ్జెట్ కాదు జగన్ కోసం పెట్టిన బడ్జెట్..

చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది.. మీకేంటి నొప్పి?

అనిత ఓవరాక్షన్ కు అంబటి కూతురు ఊర మాస్ వార్నింగ్

కాపుతో పెట్టుకున్నారు.. వంగవీటి నరేంద్ర మాస్ వార్నింగ్

పవన్ వారసుడు అకీరా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

చంద్రబాబు లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి అసలు కారణం ఇదే..

నీకు అంత దమ్ముంటే హెరిటేజ్ నాది కాదు అని చెప్పు

ఛత్తీస్ గఢ్ లోని దాంతరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పంచారామ క్షేత్రంలో అపచారం

Photos

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)

+5

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ! (ఫొటోలు)

+5

డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ హల్దీ వేడుక (ఫొటోలు)

+5

క్రిస్టల్‌ ఐవరీ లెహంగాలో పాలరాతి శిల్పంలా రాధికా స్టన్నింగ్‌ లుక్స్‌ ..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)

+5

బ్యూటీ విత్‌ బ్రెయిన్‌.. MBBS మధ్యలోనే ఆపేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? (ఫోటోలు )