బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
Breaking News
Mahashivratri 2026: శివపూజకు దినుసులు
Published on Sat, 02/14/2026 - 18:33
ఆయన సామాన్యుడా! ఆయనను విశ్వేశ్వరుడనీ, మహాదేవుడనీ, త్య్రంబకుడనీ, త్రిపురాంతకు డనీ, నీలకంఠుడనీ, మృత్యుంజయుడనీ, సదాశివుడనీ వేదం వేనోళ్ళ స్తుతించింది. మహాదేవుడి మహత్త్వాన్ని సంపూర్ణంగా చెప్పేందుకు మాటలు చాలవని మహాకవులైన వారే మనవి చేసుకొన్నారు. ఆయన గొప్పతనం ఆసాంతం చెప్పాలంటే, అది సాక్షాత్తూ చదువుల తల్లికయితే సాధ్యం కావచ్చు నన్నారు. నిజానికి, విశ్వేశ్వరుడి విశిష్టతలన్నీ వివరంగా చెప్పాలంటే సరస్వతీ దేవికి కూడా ఎన్నో సన్నాహాలు అవసరమవు తాయట.
ముందు కల్పవృక్షం కొమ్మ విరిచి, దాన్ని అరిగిపోని కలం పుల్లగా అమర్చుకోవాలి. సముద్ర మంత జలపాత్ర సంపాదించాలి. ఆ నీటిలో కాటుక కొండను కరిగించి, సిరాను సిద్ధం చేయాలి. ఆ పైన విరామం లేకుండా అహర్నిశలూ రాస్తూనే వెళ్ళాలి. లేకపోతే, కైలాసనాథుడి ఘనతల జాబితాను సమగ్రంగా సమ కూర్చటం ఆమెకయినా అసంభవమే అంటుంది ‘శివ మహిమ్నస్త్రోత్రం’.

అయితే, భక్తుల అదృష్టం వల్ల, మహాదేవుడు ఎంతటి మహిమాన్వితుడో అంతటి కరుణామయుడు. ఎంత సర్వ సమర్థుడో, అంత ఆడంబర విరహితుడు. అల్ప సంతోషి. ఆయన అనుగ్రహం పొందేందుకు పాండిత్య పాటవాలతో, పటాటోపాలతో పనిలేదు. విస్తృతమైన పూజావిధులూ, విలువైన సామగ్రీ అక్కర్లేదు. కావలసినవేమిటో ‘కాళహస్తీశ్వర శతకం’లో ధూర్జటి కవి చెప్పాడు: సలిలమ్ముల్ చులుక ప్రమాణ(ము), ఒక పుష్పమ్మున్ భవన్మౌళి, ని/ శ్చల భక్తి ప్రతిపత్తి చే నరుడు పూజల్ సేయగా ధన్యుడౌ,/... తుదిన్ కాంచు నీ/ చెలువంబంతయు, నీ మహత్త్వ మిదిగా, శ్రీ కాళహస్తీశ్వరా! శివపూజకు మూడు దినుసులు చాలు. పుడిసెడు (‘చులుక ప్రమాణము’) నీళ్ళు, ఒక్క పుష్పం, నిశ్చలమైన భక్తి భావం– ఈ మూడింటితో పూజ చేసిన భక్తుడు ధన్యుడై చివరకు శివ సాక్షాత్కారం ప్రాప్తింపజేసుకొంటాడు. భోలా శంకరుడే గదా, చేరెడు నీళ్ళతో అభిషేకించి, చిన్న మారేడు దళం అప్పగిస్తే చాలు, పొంగి పోయి బోలెడు వరాలిచ్చేస్తాడు అని గడసరి భక్తులు అనే మాట అర్ధ సత్యమే. నిశ్చల భక్తి అనే నిప్పు లేకుండా, భక్తుడి పప్పు ఉడకదు అనే షరతు వర్తిస్తుంది!
- ఎం. మారుతి శాస్త్రి (ఫిబ్రవరి 15న శివరాత్రి)
Tags : 1