జోగి రమేష్ ఇంటి వద్ద వైఎస్ జగన్ ప్రెస్ మీట్
Breaking News
నష్టాల రోడ్‌పై టాటా మోటార్స్ పీవీ
Published on Fri, 02/06/2026 - 07:19
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 3,843 కోట్ల నికర నష్టం ప్రకటించింది.
లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్‌ఆర్‌పై సైబర్ దాడి ప్రధానంగా ప్రతికూల ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 5,485 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 94,472 కోట్ల నుంచి రూ. 70,108 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 89,698 కోట్ల నుంచి రూ. 74,880 కోట్లకు తగ్గాయి.
జేఎల్‌ఆర్ ఎఫెక్ట్
జేఎల్‌ఆర్ సైబర్ దాడి కారణంగా రూ. 800 కోట్లతోపాటు.. కొత్త కార్మిక చట్టాల అమలుతో రూ. 400 కోట్లు, స్టాంప్ డ్యూటీకి రూ. 400 కోట్లు చొప్పున మొత్తం రూ. 1,600 కోట్లమేర అనుకోని నష్టాలు నమోదు చేసినట్లు టీఎంపీవీఎల్ వెల్లడించింది. ఈ కాలంలో జేఎల్‌ఆర్ 29.8 కోట్ల పౌండ్ల నష్టం ప్రకటించింది. ఆదాయం సైతం 39 శాతం బలహీనపడి 4.5 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది.
సైబర్ దాడి, యూఎస్ టారిఫ్‌లతో హోల్‌సేల్ అమ్మకాలు పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది. వీటికితోడు ప్రణాళికలకు అనుగుణంగా జేఎల్‌ఆర్ ఉత్పత్తిని సైతం కొద్ది రోజులు నిలిపివేసినట్లు సీఈవో పీబీ బాలాజీ వెల్లడించారు. కాగా.. టాటా ప్యాసింజర్ వాహనాల ఆదాయం 24 శాతం జంప్‌చేసి రూ. 15,300 కోట్లను తాకింది. పీవీ, ఈవీల టోకు అమ్మకాల పరిమాణం 22 శాతం ఎగసి 1.71 లక్షల యూనిట్లకు చేరాయి.
ఒక త్రైమాసికంలో ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, విభిన్న ప్రొడక్టుల విడుదల ఇందుకు సహకరించాయి. ఈ బాటలో తొలిసారి రిటైల్ అమ్మకాలు 2 లక్షల మార్క్‌ను దాటినట్లు కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో నామమాత్ర నష్టంతో రూ. 374 వద్ద ముగిసింది.
Tags : 1