చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
Breaking News
వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!
Published on Thu, 02/05/2026 - 21:01
సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
నిస్సాన్ టెక్టెన్: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్‌ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్‌పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్‌లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్‌డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్‌లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.
మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్‌ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.
ఫోక్స్‌వ్యాగన్ టైరోన్: ఫోక్స్‌వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్‌పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.
టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.
Tags : 1