చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
Breaking News
వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు ఇవేనా..
Published on Thu, 02/05/2026 - 09:43
దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రిజిస్ట్రేషన్, ఆడిట్, రిఫండ్ ప్రక్రియలను భారీగా సరళీకరించేందుకు సిద్ధమవుతోంది. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
గత ఏడాది సెప్టెంబర్ 3న జరిగిన సమావేశం తర్వాత, ప్రస్తుత బడ్జెట్ ఆమోద ప్రక్రియ ముగిశాక ఈ కీలక భేటీ జరగనుంది. వచ్చే నెలలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారుల స్థాయిలో రెండు విడతలుగా చర్చలు పూర్తికాగా ప్రాథమిక అజెండా సిద్ధమైంది.
రిఫండ్లలో ఇబ్బందుల తొలగింపు
ప్రస్తుతం వస్తువులు, సర్వీసులకు మధ్య ఉన్న విభజన కారణంగా సేవల రంగంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) రిఫండ్లు పొందడంలో వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ నిలిచిపోతోంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్లు అంటే.. ఒక వ్యాపారి తన బిజినెస్ కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన పన్నును, తిరిగి ప్రభుత్వం నుంచి వెనక్కి పొందడం లేదా తదుపరి పన్ను చెల్లింపుల్లో తగ్గించుకోవడం.
ఈ నేపథ్యంలో సర్వీసులపై పేరుకుపోయిన ఐటీసీ రిఫండ్‌లను సులభతరం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వ్యాపారాల్లో నగదు లభ్యత పెరిగి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి.
ప్రభుత్వ విధానం ఇదే..
బడ్జెట్, ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించిన కొత్త నిబంధనలు ‘పన్ను చెల్లింపుదారులపై నమ్మకం’ అనే సూత్రంపై ఆధారపడి ఉన్నాయని సదరు అధికారి తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే సవరించిన రిటర్న్‌ల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. వీటి ప్రకారం..
సెక్షన్ 148 కింద నోటీసు వచ్చినా వివాదాస్పద పన్ను, వడ్డీ చెల్లించి రిటర్న్‌లను అప్‌డేట్ చేస్తే ఆ ప్రక్రియను అక్కడితోనే ముగించే అవకాశం ఉంది.
ఆడిట్ పరిధిలోకి రానివారు ఏడాదిలోపు సవరించిన రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే డిసెంబర్ 31 తర్వాత దాఖలు చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
గతంలో రిటర్న్‌లు దాఖలు చేయకపోయినా సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసిన నాలుగేళ్ల వరకు అప్‌డేటెడ్ రిటర్న్‌లను దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు.
జరిమానాల నుంచి మినహాయింపు
ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 440 కింద రక్షణ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయాన్ని తప్పుగా నివేదించిన సందర్భాల్లో నిర్దేశిత అదనపు పన్ను చెల్లిస్తే భారీ జరిమానాల నుంచి మినహాయింపు పొందే అవకాశం పన్ను చెల్లింపుదారులకు లభించనుంది. ‘నిబంధనలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని అమలు చేయడమే తదుపరి అంశం. అధికారులపై పనిభారం పెరిగినప్పటికీ పన్ను చెల్లింపుదారులకు మేలు చేయడమే మా ప్రాధాన్యత’ అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తెలిపారు.
ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం
Tags : 1