ఏపీలో రాక్షస పాలన నడుస్తోంది
Breaking News
ఈ వారం కథ: తిరిగొచ్చిన అహం
Published on Sun, 01/25/2026 - 09:05
కృష్ణ విసురుగా బెడ్రూమ్లోకొచ్చి కోపంగా ‘‘అసలు నువు ఆలోచించే చేస్తున్నావా?’’ అన్నాడు భార్య అరవిందతో. ఉతికిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెనుదిరగకుండానే, ‘‘అన్నీ ఆలోచించే చేశాను.’’ అన్నది ప్రశాంతంగా, ‘అన్నీ’ అన్నపదాన్ని నొక్కిచెపుతూ. రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా ఏమీచేయలేని అశక్తతతో బెడ్ పక్క కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ. కొత్తగా కొన్న త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటులో తూర్పువైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది. అయిదేళ్ల చింటూ రూమ్‌లోంచి మాత్రం టీవీ సౌండ్ వినబడుతోంది. తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరకు పోయి కాసేపు కూర్చుని సేదతీరటం కృష్ణకు అలవాటు.
ఇపుడు సమస్య తండ్రిదే! కాదు,కాదు సమస్య తనదే! కాదు, కాదు– తనే తండ్రికి సమస్య. రోజూలా మాటాడటం కాదు, ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు తన భార్య వల్ల. తాళ్లూరులో గవర్నమెంటు స్కూలులో అటెండరుగా పనిచేసి, రిటైరైన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ రెండు నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు. సాయంత్రం పది పదిహేను నిమిషాలు వాకింగ్‌కు తప్ప ఆయన పెద్దగా బయటకు వెళ్లడు. రెండు పూటలా స్నాక్స్, భోజనంలో ఏలోటూ చేయదు అరవింద. మూడు నెలలకొకసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు. అంతేకాదు, ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరుస్తుంటాడు కూడా! ఆయన తనకు వచ్చిన బెనిఫిట్స్‌తో కొడుకు ఇంటి లోన్‌లో కొంత తీరుస్తానన్నా కృష్ణ, ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు.
తర్వాత ఈ మధ్య ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ రెండునెలల పెన్షన్‌కు తమ డబ్బు కొంత కలిపి అరవింద తాళ్లూరులోని ఆయన పాత ఇల్లు రీమోడల్ చేయించింది. అందులో అన్ని ఫెసిలిటీలతో ఓ చిన్న రూమ్ వేయించింది. మామగారు అపుడపుడూ తన ఫ్రెండ్స్‌తో ఒకటిరెండు రోజులు గడిపేందుకు. ఆ పనితో కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపైంది. అపుడు రెట్టింపైన ప్రేమ, గత వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకు పడిపోతున్నది. అందులో మొదటి స్టెప్. ఈనెల నుండి అయిదువేలు అపార్ట్మెంటు లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ ఎకౌంటు నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించటం. ఆయనకొచ్చేదే పదహారువేలు. ఆయనకు దానిని ఖర్చుపెట్టే అవసరం లేకపోవచ్చు.
కాని ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవటం; అది కూడా తనకీ విషయం వేరేవారి ద్వార తెలియటం– ఇవన్నీ తలచుకుంటుంటే కృష్ణ మనసు ఉడికిపోతున్నది.. ‘తల్లి దేవత, కనబడే దైవం’ అన్నీ దొంగ మాటలు. తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత. అత్త, భార్య, కోడలు వంటి పాత్రలలో కాదు. పిల్లలు పుట్టగనే ప్రపంచాన్నంతా వాళ్లకు దోచి పెట్టాలనే ఇన్స్టింక్టు దైవత్వమెలా అవుతంది?’ గతంలో ఏదో టీవీ చర్చావేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తొచ్చాయి. అప్పుడవి ట్రాష్ అని కొట్టిపడేసినా, ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే ననిపిస్తుంది కృష్ణకు. తండ్రిని పలకరించటానికి కూడా మనస్కరించక కారు తీసుకుని నెల్లూరు బస్టాండు దగ్గర్లోని రత్నమహల్ హాలు వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీసుకు బయలుదేరాడు కృష్ణ. ఆదివారం నాడు ఆఫీసు దరిదాపులలో కనబడని తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్. దానిని పట్టించుకోకుండా తన రూమ్‌లో కెళ్లి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు.
ఏదో కొత్త సినిమా వస్తున్నది ఓటీటీలో. లడ్డూ బ్యాచ్‌ను పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్టులో ఇద్దరు హత్యచేయబడ్డారని తెలుసుకుని వచ్చిన íసీఐ తలుపులు బాది చివరకు కాలితో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు ఇరుక్కుపోతుంది. దానిని అతి కష్టంమీద బయటకు లాక్కుంటూ అవస్థలు పడుతుండగా, పక్కనున్న కానిస్టేబులు తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళతాడు. కృష్ణ చూస్తున్నది దానిని కాదు. తర్వాత షాట్లో తెరుచుకుంటున్నపుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవటం గూర్చి. తన తండ్రికి సినిమాలంటే ప్రాణం. ఆ అలవాటే తనకొచ్చింది. సినిమా విశ్లేషణలు, విమర్శలు, ఆస్వాదనలు– మనసు బాలేనపుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి. ఇప్పుడవే నరకంగా అనిపించటంతో టీవీ ఆఫ్ చేసి కణతలు రుద్దుకున్నాడు. పోయిన వారం వాకింగ్ తర్వాత వీథి చివరలోఉన్న కిరాణాషాపు దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాపతను, ‘‘ఆ తెల్లగా ఒడ్డూ పొడుగుండే పంచెకట్టాయన మీ మామగారా?’’ అన్నాడు ఆసక్తిగా.
ఇతను మా నాన్నను ఎపుడు చూశాడా అనుకుంటూ, ‘‘దేనికి?’’ అన్నాడు అనుమానంగా. ‘‘మేడంగారు ఏవో సరుకులు కొనుక్కుని, డబ్బులు మర్చిపోయానని నాతో అంటే నేను ఫర్లేదమ్మా తర్వాత ఈయండి అన్నాను. వెంటనే ఆ పెద్దాయన అయిదు వందల నోటు తీసి ఇచ్చాడు’’కృష్ణ కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ, ‘‘ఆయన మా నాన్నగారు’’ అన్నాడు. అతను పట్టించుకోకుండా ‘‘అవునా! చిల్లర ఇస్తుంటే అంతటి ఆఫీసర్ మేడమ్ ‘నాకు పెద్ద డైరీమిల్క్ కావాలి అనటం’ ఆయన కూడ భళ్లున నవ్వేసి ‘నీకన్నానా తల్లీ!’ అనటం చూస్తుంటే, తండ్రీ కూతుళ్లు అనుకుంటారు ఎవరైనా’’ అన్నాడు మురిపెంగా. ఆ షాపతని మాటలు గుర్తు కొస్తుంటే కృష్ణకు పుండు మీద కారం చల్లినట్టవుతున్నది. డబ్బు... డబ్బు... డబ్బు... నలభైయేళ్లు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా? మనుషుల మరోకోణం పెద్దపెద్ద మేధావులకే అర్థంకాదు.
అరవింద దోపిడీ కిరాణాషాపు వాడికేం అర్థమవుతుంది? పోనుపోను భార్యమీద ద్వేషం రెట్టింపవుతున్నది. సెల్ మోగటంతో చూశాడు. ఫాదర్ అని డిస్ప్లే అవుతున్నది. సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి. ‘భార్యకు తండ్రికి మధ్య కచ్చితంగా వాగ్వివాదం జరిగి ఉంటుంది.’ ఏంచేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు. ‘‘చింటూగాడి బర్త్‌డే ప్రెజంటేషన్ కొందామని డీమార్ట్ కొచ్చాం. ఆ బ్యాట్లు బాల్‌లు ఏరకం కొనాలో తెలీటం లేదురా!’’ తండ్రి గొంతులో కంగారు. బిత్తరపోయాడు కృష్ణ. అర్థమైంది. వారం క్రితం పడ్డ మూడోనెల పెన్షన్ ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాను. అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది. కృష్ణలో టెన్షన్, ఆవేదన క్రమంక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతున్నది.
ఏంచేయమంటావురా!’’ అన్న సెల్లో తండ్రి మాటకు ఉలిక్కిపడి ‘‘వాడికి తెలుసులే నాన్నా!’’ అన్నాడు కోపాన్ని కంట్రోలు చేసుకుంటూ. కాని అతని వల్లకాలేదు. భార్యమీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు. వంటయింట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బపట్టుకుని ఎవరో లాగటంతో అదిరిపడింది. గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోలు చేసుకుని ఆగి తలతిప్పి చూచింది. ఎదురుగా నిప్పులు కక్కే కళ్లతో కృష్ణ. భర్తను భయంభయంగా చూస్తూ, ‘‘ఏమైంది?’’ అన్నది. భార్యను తీవ్రంగా చూస్తూ, ‘‘మా నాన్నను డీమార్టుకు ఎందుకు పంపావు? ఒక్క రూపాయి కూడా డబ్బులివ్వకుండా’’ పెద్దగా అరుస్తునట్లు అన్నాడు కృష్ణ.
అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ, ‘‘అదా! ఇంకేమో అనుకుని భయపడ్డాను. ముందు వాటర్ తాగు. కూల్ అవుతావు’’ అని ఫ్రిజ్ నుంచి బాటిల్ ఇస్తుండగా, కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు.అరవింద కృష్ణ భుజాల మీద రెండు చేతులు వేస్తూ, ‘‘ముందు నింపాదిగా కూర్చో ’’ అన్నది.కృష్ణ చేతులు విదిలించుకుంటూ, ‘‘నీ నటనలు ఆవు. మా నాన్నకు పడేదే పదహారు వేలు. దానికీ ఎసరు పెట్టావా?’’ అన్నాడు రౌద్రంగా.అరవింద కాసేపు మాట్లాడలేదు. తర్వాత నిదానంగా తలెత్తి, ‘‘నీకు ఆయన నాన్న. నాకు మామయ్య. స్వయానా మేనమామ. నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే, ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ. నాన్నకన్నా ఎక్కువ’’ అన్నది ‘‘అందుకేనా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు, చింటూగాడు అక్కడ కనబడ్డవన్నీ కొంటాడు.
ఆ కాస్త బాలెన్స్ అయిపోయి, డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వులు పాలు అయితేగాని నీ కసి తీరదా?’’భార్య నవ్వటంతో కృష్ణ కోపం రెట్టింపై, ‘‘మాట్టాడవేం?’’ అని గద్దించాడు.అరవింద చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చో బెడుతూ, ‘‘ప్రతి దీపావళికి అమ్మా నేను మీ ఇంటికి వచ్చేవాళ్లం. గుర్తుందా! మామయ్య పట్టులంగాతో ఉన్న ఐదారేళ్ల నన్ను ఎత్తుకుని కిరాణాషాపుకు తీసుకెళ్లేవాడు. దారిలో కనబడ్డవారందరికీ నా మేనగోడలు అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్లు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు. మామయ్యను డబ్బులడిగి ఇబ్బంది పెట్టొద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి, నేను గుప్పిట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగిస్తూ. ‘మామయ్యా! టపాసులకు నువ్వు ఇవ్వొద్దు. నా డబ్బులతోనే కొనుక్కుంటా’ అనేదాన్ని’’ బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అన్నది.కృష్ణ ఏం మాట్టాడలేదు.
అరవింద కొనసాగించింది.‘‘కావల్సినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను, ‘ఎంతైంది తాతా?’ అని నేను అడిగితే. పక్కనుంచి మామయ్య, ‘సరిగ్గా రూపాయే విందా’ అనేవాడు తాతకు కన్నుకొడుతూ. నడుం మీద చేయి వేసి అడుగుతున్న నా బుగ్గలు పుణికి పుచ్చుకుంటూ తాత కూడా, ‘అంతే అంతే! రూపాయికి ఒక్కపైసా తక్కువా లేదు ఎక్కువా లేదు’ అనేవాడు. ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా గర్వాన్ని, ధీమాను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేం ఇవ్వగలం? అవి తిరిగి ఇవ్వటం తప్ప’’ అన్నది కళ్లు తుడుచుకుంటూ. జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం, రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి. అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో ఆనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ, ‘‘నీ డౌట్ అర్థమైంది. ఆ డీమార్ట్ మా కజిన్ పల్లవిది. చింటూగాడు ఎంత షాపింగ్ చేసినా, బిల్లు పదివేలకు ఒక్క రూపాయి తక్కువా ఉండదు, ఎక్కువా ఉండదు’’ అన్నది చిన్నప్పటి మామయ్య మాటలు అనుకరిస్తూ.
కృష్ణ మనసు నిండా భార్యపట్ల కృతజ్ఞత చోటుచేసుకుంది. ఏదో సైకాలజీ బుక్‌లో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి.నేనొక్కడినే కుటుంబాన్ని నడుపుగలుగుతున్నాననే మగవాడి అహం, మేల్ ఇగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది. విజయాలు సాధించటంలేదనో, విశ్రాంతి కావాలనో భార్యాపిల్లలు అతని మేల్ ఇగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసమూ ఊడిపడుతుంది. అది అతనిని వ్యర్థుడిగా మార్చివేసి, తనను తాను వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది. తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్ధానాన్ని తిరిగి ఇవ్వటం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్స్‌కు ఊపిరిలూదింది ఏ సైకాలజీ చదవని అరవింద’భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకోబోతుండగా చప్పుడు వినిపించి వాకిలివైపు తలతిప్పి చూచాడు.
చింటూ ఒక్క అంగలో అరవింద దగ్గరకు దూకి చేతులో బ్యాట్, బాల్ చూపిస్తూ, గొప్పగా ‘‘ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు. నా బర్త్‌డే ప్రజంటేషన్గా. డీమార్ట్‌లో తాతయ్యతో సెల్ఫీ తీసుకుని, మా ఫ్రెండ్స్‌కు పంపించాను కూడా’’ అన్నాడు గర్వంగా.వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగ్‌తో వస్తూ, ‘‘అల్లాడిచ్చాడురా నీకొడుకు! మొత్తం పదివేలు మించలేదనుకో. లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకున్నా’’ అంటూ ఈ మధ్య కొత్తగా కొన్న చిన్న లాప్టాప్తో తన గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంటబెట్టుకుని తన రూమ్‌లోకి వెళ్లాడు.నాన్న చేయి మీసం మీదికి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ. ఆయన మాటలలో సంతోషం, గాంభీర్యం, హుందాతనం తొణికిసలాడుతున్నాయి.
‘‘లెఫ్ట్ హాండ్ ధంబ్, మిడిల్ఫింగర్లతో లాప్టాప్ మధ్యలో పైభాగాన్ని అదేవిధంగా రైట్హాండ్ తో కింది భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి. సైడ్ భాగాలతో కాదు. స్ప్రే డైరక్ట్‌గా చల్లకూడదు. క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి. అంతేకాదు చార్జింగ్‌లో ఉన్నపుడు యూజ్ చేయకూడదు’’ శ్రద్ధగా వింటున్న మనవడికి వాడిభాషలో వాడికి అర్థమయ్యేట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ.‘‘ ఏరా! ఏం కావాలి?’’ కృష్ణ ఏం మాట్లాడలేదు.ఒళ్లోని లాప్టాప్ పక్కన పెడుతూ, ‘‘నా దగ్గర మొహమాటమేందిరా! డబ్బులేమైనా కావాలా?’’ అన్నాడు అనుమానంగా. కృష్ణ చిన్నగొంతుతో, ‘‘ఓ అయిదు వందలు’’ ససుగుతుంటే ఆయన భళ్లున నవ్వేసి, ‘‘ఈ మాత్రం దానికేనా ఇంత బిల్డప్. తీసుకో’’ అని రెండు అయిదువందల నోట్లు ఇచ్చాడు.
వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు, ‘‘చూశావా విందా! లక్షలు సంపాదించే పెద్ద ఆడిటర్. ఆఫ్ట్రాల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు’’ అన్నాడు మీసం దువ్వుతూ. అరవింద ముందుకు వచ్చి, ‘‘ఇదంతా అప్పుగానే మామయ్యా! జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయిగారికి చెప్పండి’’ అన్నది పెద్దగా అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది.
∙ఆర్ వి రాఘవరావు
Tags : 1