జగనన్న పథకాలన్నీ చోరీ చేసి..దొంగ నాటకాలు... నాగార్జున యాదవ్ ఫైర్
Breaking News
కొన్నది కొంతే.. ఆర్బీఐకి బంగారం చేదైందా?!
Published on Sat, 01/24/2026 - 09:17
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ పసిడి కొనుగోళ్లను పెంచుకుంటుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాత్రం తగ్గిస్తోంది. 2025లో ఆర్బీఐ తన బంగారం కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2025లో ఆర్బీఐ కేవలం 4.02 టన్నుల బంగారమే కొనుగోలు చేసింది. ఇది 2024లో కొనుగోలు చేసిన 72.6 టన్నులతో పోలిస్తే దాదాపు 94 శాతం భారీ తగ్గుదల.
ప్రపంచ కేంద్ర బ్యాంకుల ధోరణి
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ఇటీవలి సంవత్సరాల్లో బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. 2025 డిసెంబర్ నాటికి గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వద్ద మొత్తం 32,140 టన్నుల బంగారం ఉంది. ఇక కొనుగోళ్ల విషయానికి వస్తే 2022లో అన్ని కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు 1,082 టన్నులు కాగా 2023లో 1,037 టన్నులుగా ఉన్నాయి. 2024లో రికార్డు స్థాయిలో 1,180 టన్నులకు చేరాయి. 2025లోనూ 1,000 టన్నులకుపైగా ఉంటాయని అంచనా.
అయితే, కొనుగోళ్లు తగ్గినప్పటికీ ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద సుమారు 880.2 టన్నుల బంగారం ఉంది. 2025 నవంబర్ నాటికి ఈ బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది.
విదేశీ మారక నిల్వల్లో పెరిగిన బంగారం వాటా
భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా కూడా గణనీయంగా పెరిగింది. ఒక సంవత్సరంలో బంగారం వాటా 10% నుంచి 16%కి పెరిగింది. 2021 మార్చిలో ఇది కేవలం 5.87% మాత్రమే. అంటే, గత ఐదేళ్లలో ఆర్బీఐ తన నిల్వల్లో బంగారం ప్రాధాన్యతను దాదాపు మూడు రెట్లు పెంచింది.
కొనుగోళ్లు ఎందుకు తగ్గాయి?
బంగారం ధరలు అత్యధికంగా ఉండటం, అలాగే ఆర్బీఐ నిల్వల్లో ఇప్పటికే బంగారం వాటా గణనీయంగా పెరగడం వల్ల, ఇప్పుడు ఆర్బీఐ కొత్త కొనుగోళ్ల కంటే ఉన్న నిల్వల సమతుల్య నిర్వహణపై దృష్టి పెడుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.
ఆర్బీఐ బంగారం ఎక్కడ ఉంది?
ఆర్బీఐకి చెందిన బంగారం మొత్తం భారతదేశంలోనే నిల్వ ఉండదు. 2025 మార్చి నాటికి భారత్ మొత్తం బంగారం నిల్వలు 879.59 టన్నులు కాగా ఇందులో భారత్‌లో నిల్వ చేసింది సుమారు 512 టన్నులు. మిగిలిన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వద్ద భద్రపరిచింది. కొంత భాగం బంగారం నిక్షేపాల (Gold Deposits) రూపంలో కూడా ఉంది.
Tags : 1