మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
Breaking News
ఎంఎస్‌ఎంఈ రుణాలకు తోడుగా ‘జన్‌సమర్థ్’
Published on Fri, 01/16/2026 - 14:12
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రుణ వితరణ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అన్నీ కలిసి ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ కోసం ఒకే విధమైన, ప్రమాణీకరించిన (Standardized) డిజిటల్ విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఆదేశించింది.
జన్‌సమర్థ్ పోర్టల్‌తో వేగంగా రుణాలు
కేంద్ర క్యాబినెట్ సూచనల ప్రకారం, రూ.1 కోటి వరకు ఎంఎస్‌ఎంఈ రుణాలన్నింటినీ ఇకపై ‘జన్‌సమర్థ్’ (JanSamarth) పోర్టల్ ద్వారానే ప్రాసెస్ చేయనున్నారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులు ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను వాడటం వల్ల రుణ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని నమ్ముతున్నారు. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్లు, ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్), జీఎస్టీ డేటా, బ్యాంక్ స్టేట్‌మెంట్లను బ్యాంకులు ఆటోమేటిక్‌గా పరిశీలిస్తాయి. వ్యక్తిగతంగా పరిశీలన తగ్గడం వల్ల రుణ అప్లికేషన్ల తిరస్కరణ రేటు తగ్గి వేగంగా నిధులు మంజూరవుతాయి.
క్రెడిట్ వృద్ధి
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి బ్యాంకులు అందించిన మద్దతు గణనీయంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో సుమారు రూ.26.43 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు పంపిణీ చేశాయి. దాదాపు 13 మిలియన్ల (1.3 కోట్లు) ఖాతాల్లోకి ఈ రుణాలు చేరాయి. 2024 జనవరి-అక్టోబర్ కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించిన క్రెడిట్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 32.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్
ఈ నూతన డిజిటల్ ప్రణాళిక వల్ల చిన్న వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంతో అర్హులైన ప్రతి చిన్న వ్యాపారికి సకాలంలో పెట్టుబడి అందుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!
Tags : 1