చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా
Breaking News
మైనర్లతో చెత్త వీడియోలు.. ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్
Published on Thu, 01/08/2026 - 18:37
మైనర్లతో ఇంటర్వ్యూలు చేసిన ఏపీ యూట్యూబర్ కంబేటి సత్యమూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 'వైరల్ హబ్ 007' పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌లో చాలారోజులుగా ఆయన పలు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అయితే, అందులో మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 అక్టోబరు 16న తన ఛానల్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం అయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో వారు సుమోటోగా కేసు నమోదు చేశారు.
ఏపీకి చెందిన కంబేటి సత్యమూర్తి రన్ చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్‌లో ఎక్కువగా అసభ్యకరమైన రీతులోనే ఇంటర్వ్యూలలో ప్రశ్నలు ఉంటాయని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 15 నుంచి 17ఏళ్ల బాలబాలికలను అసభ్య ప్రశ్నలు అడుగుతూ అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇదంతా తన ఛానల్‌లో వ్యూస్ పెంచుకోవడానికి ఆయన ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఒక ఇంటర్వ్యూలో బాలుడిని ముద్దు పెట్టుకునేలా బాలికను ప్రేరేపించడంతో నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఘటనను హైదరాబాద్ పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఇతడు బాలల రక్షణ చట్టాలతో పాటు సైబర్ చట్టాన్ని కూడా ఉల్లంఘించాడని పోలీసులు తెలిపారు. సైబర్ ఏసీపీ శివమారుతి టీమ్, ఎస్‌ఐ సురేశ్‌తో కలిసి నిందితుడు సత్యమూర్తిని వైజాగ్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. డిజిటల్ ఎవిడెన్స్‌తో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో, ఐటీ చట్టాల కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Tags : 1