తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎన్నికల హడావిడి
Breaking News
కేంద్ర బడ్జెట్ 2026: బియ్యం ఎగుమతులను ప్రోత్సహించండి
Published on Thu, 01/08/2026 - 11:55
పన్ను ప్రోత్సాహకాలు, రుణాలపై వడ్డీ రాయితీలు, రవాణా పరమైన మద్దతు చర్యలను 2026–27 బడ్జెట్‌లో ప్రకటించాలని భారత బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య (ఐఆర్‌ఈఎఫ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా ఈ రంగం పోటీతత్వం బలపడుతుందని పేర్కొంది. ఎగుమతుల కోసం తీసుకునే రుణాలపై 4 శాతం మేర వడ్డీలో రాయితీ కల్పించాలని.. అలాగే, రోడ్డు, రైలు రవాణాపై వ్యయాలపైనా 3 శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది.
ఎగుమతులపై సుంకాలు, పన్నుల మినహాయింపులను సకాలంలో అందించాలని పేర్కొంది. ఈ చర్యలతో వ్యయాలు తగ్గుతాయని, ఎగుమతులు పెరుగుతాయని సూచించింది. అంతర్జాతీయంగా బియ్యం వాణిజ్యంలో భారత్ వాటా 40 శాతంగా ఉంటుందని, 2024–25లో 170కు పైగా దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు జరిగినట్టు ఐఆర్‌ఈఎఫ్ ప్రెసిడెంట్ ప్రేమ్ గార్గ్ తెలిపారు.
రైతుల ఆదాయానికి, గ్రామీణ ఉపాధికి బియ్యం ఎగుమతులు ఎంతో కీలకమన్న విషయాన్ని గుర్తు చేశారు. విలువైన వరి రకాలకు (ప్రీమియం బాస్మతి, ఆర్గానిక్/నాన్ బాస్మతి రకాలు) మళ్లేందుకు ప్రోత్సాహకాలను బడ్జెట్‌లో ప్రకటించాలని ఈ సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది.
Tags : 1