క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..
Breaking News
ఎయిర్ ఇండియా సీఈవోను తప్పిస్తున్నారా?
Published on Mon, 01/05/2026 - 12:04
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్ బెల్ విల్సన్‌ను తప్పించే యోచనలో టాటా గ్రూప్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్ తమ విమానయాన వ్యాపారంలో నాయకత్వ మార్పులను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు త్వరలో కొత్త సీఈఓ నియమితులయ్యే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
టాటా గ్రూప్ తన టాప్ లెవల్ మేజేజ్‌మెంట్ నిర్మాణాన్ని సమీక్షిస్తున్న క్రమంలో ఇప్పటికే ప్రధాన అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన సీనియర్ నాయకులతో చర్చలు జరిపిందని నివేదిక తెలిపింది. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ యూకే, యూఎస్ కేంద్రంగా ఉన్న కనీసం రెండు పెద్ద విమానయాన సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడినట్లుగా పేర్కొంది.
ఎయిర్ ఇండియా చైర్మన్‌గా ఉన్న చంద్రశేఖరన్ ఎయిర్ లైన్స్‌లో కార్యాచరణ వేగం, క్షేత్ర స్థాయి మార్పుల పురోగతిపై పూర్తి సంతృప్తిగా లేరని, అందుకే నాయకత్వ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని ఈ విషయం గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. విల్సన్ ప్రస్తుత పదవీకాలం జూన్ 2027 వరకు ఉన్నప్పటికీ, విమానయాన సంస్థ అంతకు ముందే నాయకత్వ మార్పును చూడవచ్చని నివేదిక తెలిపింది.
న్యూజిలాండ్‌కు చెందిన విల్సన్ 2022 జూలైలో ఎయిర్ ఇండియాలో చేరారు. ఎయిర్ లైన్స్ పునర్నిర్మాణం, ఆర్థిక మెరుగుదలకు ఐదేళ్ల పరివర్తన ప్రణాళికను ప్రకటించారు. ఈయన హయాంలో కొన్ని కీలక మార్పులు సజావుగా పూర్తయ్యాయి. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం పెద్దగా అంతరాయాల్లేకుండా ముందుకు సాగింది. విమానయాన సంస్థ తన విమానాలు, సామర్థ్యాన్ని విస్తరించింది. అయితే గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా కుప్పకూలి 260 మంది మరణించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ..
మరోవైపు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇలాంటి సమీక్షలే జరుగుతున్నట్లు సమాచారం. దాని సీఈవో అలోక్ సింగ్ పదవీకాలం కూడా 2027లో ముగియనుంది. టాటా సన్స్ తమ అన్ని విమానయాన వ్యాపారాలలో నాయకత్వ అవసరాలను అంచనా వేస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
Tags : 1