Breaking News

శంబసాధనుడి వధ

Published on Sun, 01/04/2026 - 06:30

పూర్వం కేసరి అనే వానరుడు ఉండేవాడు. హిమాలయాల దిగువ ప్రాంతంలో రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన అరవైవేల మంది వానర యోధులకు అధినాయకుడు. పార్వతీ పరమేశ్వర భక్తుడైన కేసరి ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు ప్రసన్నుడై, ప్రత్యక్షమైన పరమేశ్వరుడి నుంచి అనేక వరాలు పొందాడు. అదేకాలంలో శంబసాధనుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మను మెప్పించి, అనేక వరాలు పొందాడు. వరగర్వంతో అతడు ముల్లోకాలలోని లోకులను పీడించడం మొదలుపెట్టాడు. దేవతలను, పన్నగులను, అప్సరకాంతలను హింసించేవాడు.

‘నేను తప్ప మణులను మీరెవరూ ధరించరాదు’ అంటూ దేవతాసర్పాల తలలపైనున్న మణులను పెరికివేసి, వాటిని కిరీటంపై ధరించేవాడు. ‘ఇక నుంచి నన్నే కొలవండి’ అంటూ అప్సరకాంతలను కొప్పు పట్టి ఈడ్చుకొచ్చి, తన కొలువులో వారిచేత ఊడిగం చేయించుకునేవాడు. ‘యజ్ఞభాగాలన్నీ ఇకపై నాకే దక్కాలి’ అంటూ దేవతల కిరీటాలను కాళ్లతో తన్నేవాడు. వారిని చిత్రహింసలు పెట్టేవాడు. శంబసాధనుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించసాగాయి. దేవతలు అతడిని నిలువరించడానికి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నారు. వారంతా బితుకు బితుకుమంటూ బతకసాగారు.

దేవతలు ఎంతగా ఒదిగి ఉంటున్నా, వారి పట్ల శంబసాధనుడి దాష్టీకాలు నానాటికీ పెరగసాగాయి. అతడి పీడ ఎలా విరగడ అవుతుందోనని దేవతలు మథనపడసాగారు. చివరకు అతడికి వరాలు ఇచ్చిన బ్రహ్మదేవుడే తరుణోపాయం చెప్పగలడని తలచి, మూకుమ్మడిగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. ‘బ్రహ్మదేవా! నీ వల్ల వరాలు పొందిన శంబసాధనుడు మా పాలిటి పీడగా మారాడు. వాడి సంహారానికి తగిన తరుణోపాయం చెప్పి, మమ్మల్ని అతడి బాధల నుంచి రక్షించు’ అని మొరపెట్టుకున్నారు.

దేవతల మొర ఆలకించిన బ్రహ్మదేవుడు, ‘దేవతలారా! దిగులు చెందకండి. శంబసాధనుడు నా వరాలను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అతడికి కాలంతీరే రోజులు ఆసన్నమయ్యాయి. అతడిని సమర్థంగా ఎదుర్కొని, అతడిని అంతమొందించగల వీరుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే వానరాధిపతి కేసరి. మీరంతా వెళ్లి అతడిని ఆశ్రయించండి. కేసరి తప్పక మీ మనోభీష్టాన్ని నెరవేర్చగలడు’ అని సెలవిచ్చాడు. బ్రహ్మదేవుడి మాటలతో దేవతలంతా కేసరి వద్దకు వెళ్లారు. ‘ఓ మహాత్మా! వానరశ్రేష్ఠా! శంబసాధనుడు మమ్మల్ని పీడిస్తున్నాడు. అతడిని ఎదిరించగల వీరాధి వీరుడవు నువ్వొక్కడివేనని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెబితే, నీ వద్దకు వచ్చాం. 

శంబసాధనుడిని సంహరించి, నువ్వే మమ్మల్ని రక్షించాలి’ అని అన్నారు. కేసరి వారికి అభయమిచ్చాడు. దేవతలు ఒకవైపు కేసరిని కలుసుకుని, అభయం పొందితే, మరోవైపు నారదుడు మహతి మీటుకుంటూ శంబసాధనుడి వద్దకు వెళ్లాడు. ‘దేవమునీ! ఎక్కడి నుంచి తమరి రాక, లోక విశేషాలేమిటి?’ అని అడిగాడు శంబసాధనుడు. ‘దైత్యశ్రేష్ఠా! నీ సంహారం కోసం దేవతలంతా వానర రాజును ప్రార్థిస్తున్నారు. ఈ సంగతి నీ వరకు రాలేదా? నీ గూఢచారులు ఏం చేస్తున్నారు? నెలగ్రాసం తీసుకుని నిద్రిస్తున్నారా?’ అన్నాడు.

నారదుడు ఈ మాట చెప్పడంతోనే శంబసాధనుడు మండిపడ్డాడు. ‘పోనీ జ్ఞాతులే కదా అని ప్రాణాలతో విడిచిపెడితే, దేవతలంతా నా ప్రాణాలకే ఎసరుపెడతారా? కోతిమూకకు రాజైన వాడితో నన్ను అంతం చేయాలనుకుంటారా? వాళ్ల అంతుచూస్తాను’ అంటూ ఆయుధాలు ధరించి, దేవతల మీదకు దండెత్తాడు. శంబసాధనుడిని చూసి, దేవతలు కాలికి బుద్ధి చెప్పారు. కొందరు కొండగుహల్లో తలదాచుకున్నారు. కొందరు కేసరి వద్దకు వెళ్లి, శంబసాధనుడు దండెత్తి వస్తున్న సంగతి చెప్పారు. కేసరి దేవతలకు అండగా, శంబసాధనుడి ఎదుటకు వచ్చి నిలిచాడు.

‘ఓరీ! రాక్షసాధమా! లోకకంటకుడవైన నిన్ను అంతం చేయడానికి వచ్చాను’ అన్నాడు. ‘ఓరీ! కోతీ! నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. నాతో పోరుకు నిటలాక్షుడే తటపటాయిస్తాడు. నువ్వెంత? చిటికెలలో నిన్ను యమపురికి పంపిస్తాను’ అన్నాడు శంబసాధనుడు. ఇద్దరూ ఒకరితో ఒకరు కలపడ్డారు. శంబసాధనుడి మీదకు కేసరి ఒక బండరాయి విసిరాడు. అతడు తన గదతో బండరాయిని తుత్తునియలు చేశాడు. కేసరి వెంటనే మరో బండరాయి విసిరాడు. అది నేరుగా శంబసాధనుడి రొమ్మును తాకింది. ఆ దెబ్బకు అతడు తూలిపడ్డాడు.

‘ఓరీ! వానరా! నువ్వు బలశాలివే, తగినవాడివే! ఈసారి చూడు’ అంటూ తన గదను కేసరి మీదకు విసిరాడు. ఆ గద కేసరిని తాకి పిండి పిండిగా నేల రాలింది. ఈసారి శంబసాధనుడు శూలం విసిరాడు. కేసరి దానిని ఒడిసి పట్టుకుని, ముక్కలుగా విరిచి అవతల పడేశాడు. ఆయుధాల పని అయిపోవడంతో శంబసాధనుడు కేసరితో బాహాబాహీకి తలపడ్డాడు. ఒకరినొకరు కొట్టుకుంటూ కలబడ్డారు. చివరకు కేసరి పిడికిలి బిగించి, శంబసాధనుడి ఛాతీపై ఒక్కపోటు పొడిచాడు. అతడు నెత్తురు కక్కుకుంటూ అక్కడికక్కడే చచ్చాడు. అది చూసి దేవతలంతా హర్షధ్వానాలు చేశారు.

సాంఖ్యాయన

 

Videos

'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు

Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు

NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు

TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Tirumala: చిరంజీవి సతీమణి సురేఖకు అవమానం...పవన్ రియాక్షన్!

Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం

Konasema: బయటపడుతున్న సంచలన విషయాలు..

ఏపీ-తెలంగాణ జల వివాదంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..

తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే.. ఒక్క మాటతో బాబు చాప్టర్ క్లోజ్

Photos

+5

గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)

+5

జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)

+5

ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్‌, హర్మన్‌

+5

Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)

+5

కోనసీమ గుండెల్లో బ్లో అవుట్‌ మంటలు (ఫోటోలు)

+5

సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)

+5

'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)

+5

దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్‌.. వైరల్‌ ఫోటోలు ఇవే