మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !
పాత కాలనీలకు కొత్త సొబగులు!
Published on Sat, 01/03/2026 - 13:26
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న పాత కాలనీలు కొత్త సొబగులు అద్దుకోనున్నాయి. పాత, శిథిలావస్థలో ఉన్న తక్కువ ఆదాయ సమూహం(ఎల్‌ఐజీ), మధ్యతరగతి ఆదాయ సమూహం(ఎంఐజీ) గృహ నిర్మాణాల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఐజీ యూనిట్ల యజమానులతో చర్చలు ప్రారంభించింది. దీంతో పాత కాలనీలు నివాస, వాణిజ్య హైరైజ్ భవనాలతో అభివృద్ధి చెందనున్నాయి. ఇప్పటికే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‌బీ), సైదాబాద్‌లోని ఓ కాలనీలోని ఫ్లాట్ల యజమానులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే ఆయా అపార్ట్‌మెంట్లు 20-40 అంతస్తుల ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలుగా రూపుదిద్దుకోనున్నాయి.
పీపీపీ విధానంలో..
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశాబ్దాల క్రితం నగరంలో నిర్మించిన అన్ని ఎల్‌ఐజీ, ఎంఐజీ బ్లాక్‌లను తిరిగి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం ఒకే చోట భారీ భూమిని పొందడంతో పాటు బహుళ అంతస్తుల ప్రాజెక్ట్ నిర్మాణాలకు వీలు కలుగతుంది. ఈ ప్రాజెక్ట్‌లతో పర్యావరణ సమస్యలను తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం, పాత స్థలాలను తిరిగి ఉపయోగించడం ద్వారా పట్టణ విస్తరణను తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రధాన నగరంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఆర్థికంగా బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్) కాలనీలు ఎకరం కంటే తక్కువ ఉన్న భూములు బ్రౌన్‌ఫీల్డ్ పునరాభివృద్ధి చెందనున్నాయి.
ఈడబ్ల్యూఎస్ కాలనీల పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లకు తెలంగాణ హౌసింగ్ బోర్డ్, హౌసింగ్ కార్పొరేషన్లు నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి. క్యూర్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ అమలుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ బ్రౌన్‌ఫీల్డ్ పునరాభివృద్ధి హైరైజ్ ప్రాజెక్ట్‌లను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానంలో చేపడతారు.
ఇదీ చదవండి: నిర్మాణం పూర్తయిందా.. బిల్డర్ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే!
మెరుగైన మౌలిక సదుపాయాలు
బ్రౌన్‌ఫీల్డ్ పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లతో ఎల్‌ఐజీ, ఎంఐజీ ఫ్లాట్ యజమానులకు మరింత నిర్మాణ ప్రాంతం, మెరుగైన రోడ్లు, పౌర, రవాణా మౌలిక సదుపాయాలు, పార్క్‌లతో కొత్త ఫ్లాట్లు ఇస్తారు. కాలనీల పునరాభివృద్ధి పూర్తయ్యే వరకూ ఫ్లాట్ యజమానులను వేరే చోట ఉంచుతారు. ఇప్పటికే ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ వెలుపల నాలుగు ప్రాంతాలలో సరసమైన గృహ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. ఒక్కో ప్రాంతంలో దాదాపు 10 వేల యూనిట్లను నిర్మించనున్నారు.
Tags : 1