Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు
Breaking News
మీరు బిజినెస్‌లో కింగ్ అవ్వాలంటే..
Published on Mon, 12/29/2025 - 13:29
వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి, అమ్మకాలు మాత్రమే అనుకుంటే పొరపాటే! ప్రస్తుత కాలంలో మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో బిజినెస్ రూపురేఖలే మారిపోయాయి. చాలా మంది పాత పద్ధతులతో నష్టపోతుంటే, కొందరు మాత్రం టెక్నాలజీని వాడుకుంటూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నారు. ఇంతకీ ఆ సక్సెస్ మంత్ర ఏమిటో తెలుసుకోవాలని అందరికీ కుతూహలంగా ఉంటుంది. వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఐదు వ్యూహాలను కింద తెలియజేశాం.
ఆర్థిక నిర్వహణ
వ్యాపారానికి క్యాష్ ఫ్లో, ఆర్థిక నిర్వహణ చాలా కీలకం. 2025లో గ్లోబల్ ఇన్ఫ్లేషన్ 3% వద్ద స్థిరపడినప్పటికీ అంతర్జాతీయ టారిఫ్‌లు, సప్లై చైన్ సమస్యల వల్ల ముడిసరుకుల ధరలలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం సేల్స్ పెంచుకోవడం మీద కాకుండా, ప్రాఫిట్ మార్జిన్లపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ‘ప్రాఫిట్ ఫస్ట్’ పద్ధతిని అనుసరించడం ద్వారా ఆదాయం రాగానే లాభం, పన్నులు, వేతనాలను పక్కన పెట్టి, మిగిలిన మొత్తంతోనే ఖర్చులను నిర్వహించాలి. మార్కెట్లోని కొన్ని సాఫ్ట్వేర్లు ఇప్పుడు ఏఐ ఆధారిత అనలిటిక్స్‌ను అందిస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో రాబోయే ఖర్చులను ముందే అంచనా వేసి, ఖర్చులను 20-30% తగ్గించడంలో సహాయపడుతున్నాయి.
కస్టమర్ ఫోకస్
కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ (కొత్త కస్టమర్‌ను ఆకర్షించే ఖర్చు) భారీగా పెరిగింది. అందుకే ఉన్న కస్టమర్లను నిలబెట్టుకోవడమే అత్యంత లాభదాయకమైన మార్గం. 80 శాతానికిపైగా చిన్న వ్యాపారాలు ఇప్పుడు జనరేటివ్ ఏఐను వాడుతూ కస్టమర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నాయి. వ్యాపారులు కస్టమర్ డేటాను విశ్లేషించి, వారి అవసరాలకు తగినట్లుగా లాయల్టీ ప్రోగ్రామ్‌లు రూపొందించడం వల్ల రిపీట్ సేల్స్ పెరుగుతాయి. తాజా సర్వేల ప్రకారం, కస్టమర్ రిటెన్షన్ రేటు(అధిక మార్జిన్లు వచ్చే వస్తువులను కొనేలా చేయడం) 5% పెరిగితే, ప్రాఫిట్ మార్జిన్లు 25% నుంచి 29% వరకు మెరుగుపడే అవకాశం ఉంది.
ఖర్చుల నియంత్రణ
ఖర్చు తగ్గించడం అంటే నాణ్యతను తగ్గించడం కాదు, వనరులను సమర్థవంతంగా వాడటం అని గుర్తుంచుకోవాలి. ఇంధన ధరలు, కార్మిక వ్యయాలు పెరిగిన తరుణంలో ఆటోమేషన్ ఒక వరంగా మారింది. క్లౌడ్ ఆధారిత టూల్స్, ఎనర్జీ-ఎఫిషియంట్ పరికరాలను వాడటం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చు. టెక్నాలజీ సాయంతో తక్కువ సిబ్బందితో ఎక్కువ అవుట్‌పుట్ సాధించేలా ఆపరేషన్లను ఆప్టిమైజ్ చేయాలి. దీనివల్ల ఇన్ఫ్లేషన్, టారిఫ్‌ల ప్రభావం వ్యాపారంపై తక్కువగా ఉంటుంది.
డిజిటల్ పరివర్తన
‘ఏఐ వ్యాపారాలను భర్తీ చేయదు కానీ, ఏఐని వాడే వ్యాపారస్తులు దాన్ని వాడని వారిని వెనక్కి నెట్టేస్తారు’ అనేది నిజం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మౌలిక సదుపాయలపై 400 బిలియన్ డాలర్ల పెట్టుబడులు జరుగుతున్న తరుణంలో దీన్ని విస్మరించడం అసాధ్యం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్(వస్తు నిర్వహణ)లో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వాడటం ద్వారా స్టాక్ వృధాను అరికట్టవచ్చు. ఆటోమేటెడ్ ఇన్వాయిసింగ్(ఆటోమేటెడ్ బిల్లింగ్ విధానం) ద్వారా పేమెంట్స్ త్వరగా వచ్చేలా చూడవచ్చు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సైతం ఏఐ బాట్లను వాడి 24/7 కస్టమర్ సపోర్ట్ అందించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో పోటీ పడుతున్నాయి.
మార్కెట్ ట్రెండ్స్
మార్కెట్ మారుతున్న వేగానికి అనుగుణంగా వ్యాపార సరళి మారకపోతే ఎంతటి పెద్ద బిజినెస్ అయినా కుప్పకూలుతుంది. పర్యావరణ హితమైన పద్ధతులు పాటిస్తున్న బిజినెస్‌ల పట్ల కస్టమర్లు మక్కువ చూపుతున్నారు. ఇది బ్రాండ్ విలువను పెంచడమే కాకుండా దీర్ఘకాలంలో పన్ను రాయితీలకు కూడా దోహదపడుతుంది. డేటా అనలిటిక్స్ ద్వారా మార్కెట్ మూడ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైతే బిజినెస్ మోడల్‌ను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
ఇదీ చదవండి: మార్కెట్లో లిస్ట్ కాకముందే కోటీశ్వరులు కావొచ్చా?
Tags : 1