ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి
Breaking News
Kuttram Purindhavan Review: ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!
Published on Sun, 12/14/2025 - 08:50
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ సిరీస్ కుట్రమ్ పురిందవన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.
ఒక సినిమా ఊహకందని సన్నివేశాలతో నడిస్తే అది దర్శకుడి ప్రతిభగా చెప్పొచ్చు. దానినే సినీ పరిభాషలో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే అంటారు. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో, తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేని విధంగా ఇటీవల సోనీలివ్ ఓటీటీ వేదికగా విడుదలైన ఓ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అదే ‘కుట్రమ్ పురిందవన్’(Kuttram Purindhavan Review ). ఈ సిరీస్‌కి సెల్వమణి ముని యప్పన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఆఖరి రెండు ఎపిసోడ్ల ట్విస్టులు చూస్తే మతి పోవడం ఖాయం. అంతలా ఈ సిరీస్‌లో ఏముందో, కథాంశం ఏంటో చూద్దాం.
తమిళనాడులోని ఓ కుగ్రామంలో జరిగే జాతర నుండి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఉద్యోగ రీత్యా ఫార్మసిస్ట్ అయిన భాస్కర్ తన మనవణ్ణి జాతర మధ్యలోనే ఇంటికి తీసుకువెళుతుంటాడు. దారి మధ్యలో తన ఇంటి పక్కన ఉన్న స్టీఫెన్ తాగి రోడ్డుకు అడ్డదిడ్డంగా నడుస్తూ కనబడతాడు. ఇంటికి వచ్చిన కాసేపటికి భాస్కర్ ఇంటి తలుపులు ఎవరో బాదుతుంటారు. తలుపు తీస్తే... ఇందాక కనిపించిన స్టీఫెన్ స్పృహ తప్పిపోయిన అతని కూతురు మెర్సీని తీసుకువచ్చి కాపాడమని భాస్కర్‌ని అడుగుతాడు. తనకి అంత పెద్ద వైద్యం తెలీదన్నా భాస్కర్ చేతుల్లో మెర్సీని పెట్టి బయటకు వెళతాడు స్టీఫెన్.
మెర్సీని చూసి భాస్కర్ కంగారుపడుతుండగా స్టీఫెన్ ఆ అంతస్తు నుంచి కిందపడి చనిపోతాడు. ఇవతల మెర్సీ కూడా చనిపోయి ఉంటుంది. ఇక్కడ మెర్సీ, అక్కడ స్టీఫెన్ ఎలా చనిపోయారో తెలియక భాస్కర్ కంగారు పడుతుంటాడు. ఈలోపల మెర్సీ బాడీని మాత్రం తన ఫ్రిజ్‌లో దాస్తాడు భాస్కర్.
మరోవైపు తన మనవడి సర్జరీ కోసం తన పెన్షన్ డబ్బుల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు భాస్కర్. మర్డర్ కేస్ తన మీదకు వస్తే ఆ డబ్బులు ఆగిపోతాయన్న భయంతో మెర్సీ బాడీని దాస్తాడు భాస్కర్. ఆ తరువాత ఆ మిస్టరీ ఎలా వీడుతుంది? అన్నది మాత్రం సిరీస్‌లో చూడవలసిందే. ముఖ్యంగా ఈ సిరీస్ ఆఖర్లో వచ్చే ట్విస్టులను ఎవ్వరూ ఊహించలేరు. పిల్లలు తప్ప పెద్ద వాళ్ళకి ఇదో అద్భుతమైన వీకెండ్ సిరీస్... మస్ట్ వాచ్.
– హరికృష్ణ ఇంటూరు
Tags : 1