ఆమె ఫ్యాషన్ భవిత

Published on Wed, 12/10/2025 - 00:49

‘అనుకోలేదని ఆగవు కొన్ని’ అనే కవి మాట భవిత మండవ విషయంలో సరిగ్గా సరిపోతుంది. మోడల్‌ కావాలని కలలో కూడా అనుకోలేదు భవిత. అయితేనేం.. కలలో కూడా ఊహించని అవకాశం ఆమెను వెదుక్కుంటూ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో అదృష్టం అనే రైలు ఎక్కిన భవిత... స్వయం ప్రతిభతో మోడలింగ్‌ ప్రపంచంలో సరికొత్త తారగా వెలుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇరవై అయిదు సంవత్సరాల భవిత ప్రఖ్యాత ఫ్రెంచ్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘చానల్‌’ ఫ్యాషన్‌ షోలో ఓపెనింగ్‌ వాక్‌ చేసింది. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మోడల్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పదహారణాల తెలుగు అమ్మాయి భవిత గురించి...

హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేసిన భవిత ఇంటరాక్టెడ్‌ డిజైన్‌ అండ్‌ మీడియాలో మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లింది. ఒకానొక రోజు... న్యూయార్క్‌ సబ్‌ వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న భవితను ఒక వ్యక్తి చిరునవ్వుతో పలకరించాడు. ‘మోడలింగ్‌ చేస్తారా?’ అని అడిగాడు. ఆ క్షణంలో భవిత మనసులో ఏమనుకుందో తెలియదు. ‘సరదాగా అంటున్నాడా?’ ‘సీరియస్‌గానే అంటున్నాడా?’ మొత్తానికైతే ‘యస్‌’ అన్నది. అతడి పేరు... మాథ్యూ బ్లేజీ. మెన్స్‌ వేర్‌ డిజైనర్‌గా ఫ్యాషన్‌ కెరీర్‌ ప్రారంభించిన మాథ్యూ ఫ్రెంచ్‌ ఫ్యాషన్‌ లగ్జరీ బ్రాండ్‌ ‘చానల్‌’కు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.

అద్భుత దర్శనం
‘ఫ్యాషన్‌కి సంబంధించి కొన్నిసార్లు ఆధునికం కావిని కూడా అత్యాధునికం అనిపిస్తాయి’ అంటాడు మాథ్యూ. కొన్నిసార్లు... మోడల్‌ కాని వారు కూడా అద్భుతమైన మోడల్‌గా దర్శనమివ్వవచ్చు. భవిత విషయంలో అతడికి జరిగింది అదే! ‘ఇలా మాత్రమే చేయాలి’ అంటూ గంభీరమైన గురువులా ఎప్పుడూ కనిపించేవాడు కాదు మాథ్యూ. ‘ఎలాంటి టెన్షన్‌ వద్దు. సరదాగా చేసేయ్‌’ అన్నట్లుగా మాట్లాడేవాడు. ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ బటేగా వనీటా స్ప్రింగ్‌/ సమ్మర్‌–2025 ఫ్యాషన్‌ షోలో మోడల్‌గా అరంగేట్రం చేసింది భవిత. ఫస్ట్‌ షోతోనే మంచి మార్కులు తెచ్చుకుంది... ఇక అక్కడి నుంచి న్యూయార్క్, మిలాన్, పారిస్, లండన్‌లలో ఫ్యాషన్‌ దిగ్గజాలతో కలిసి షోలు చేసింది.

తాజా విషయానికి వస్తే...
ఫ్రెంచ్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ చానల్‌ ‘షనెల్‌... మేటియే డార్‌ 2026’ టైటిల్‌తో ఫ్యాషన్‌ షో నిర్వహించింది. 2018 తరువాత ‘చానల్‌’ న్యూయార్క్‌లో చేస్తున్న షో కావడంతో ఈ షో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన షోలో ఓపెనింగ్‌ వాక్‌ చేసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మోడల్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది భవిత. మాథ్యూతో కలిసి క్యాంపెయిన్‌లో కూడా పాల్గొంది.

ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ వీరేన్‌ షా మాటల్లో చెప్పాలంటే... ‘ఆర్డినరీ ప్లేస్‌లో కనిపించిన ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌. మాథ్యూ ఆమె జీవితాన్ని మార్చివేశాడు’ ఒక ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో భవితను ఇంటర్య్వూ చేసిన వ్యక్తి... ‘ఇది జస్ట్‌ ప్రారంభం మాత్రమే’ అన్నాడు. ఇంకా ఎన్నో అద్భుత విజయాలు మోడలింగ్‌ ప్రపంచంలో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు! వేయి శుభములు కలుగుగాక.

సబ్‌ వే టు రన్‌ వే
సంవత్సరం క్రితం నేను మోడలింగ్‌ మొదలుపెట్టాను. మోడలింగ్‌లో నాకు ఎలాంటి ముందస్తు అనుభవం లేదు. మోడలింగ్‌కు సంబంధించి మొదటిసారిగా కలిసి పనిచేసిన వ్యక్తి మాథ్యూ బ్లేజీ. మాథ్యూ నన్ను పూర్తిగా నమ్మాడు. నా మొదటి రన్‌వే నుండి నా మొదటి క్యాంపెయిన్‌ వరకు, నేను ఊహించని జీవితాన్ని సృష్టించి ఇచ్చాడు. అతని ‘చానల్‌’ను అనుసరించడం, అతనితో కలిసి ప్రయాణాన్ని కొనసాగించడం గౌరవం గా భావిస్తున్నాను.

నిజాయితీగా చెప్పాలంటే మొదట్లో నేను భయపడ్డాను. నేను పని చేసిన బ్రాండ్‌ల గురించి నాకు పెద్దగా తెలియదు. ఫ్యాషన్‌ ప్రపంచంలో అవి ప్రముఖ బ్రాండ్లు అయినప్పటికీ నేను మధ్యతరగతి కుటుంబంలో పెరగడం వల్ల అవి నాకు పూర్తిగా కొత్త.

ఒకసారి వెనక్కి వెళితే...‘సవాళ్లు నాకు కొత్తేమీ కాదు కదా’ అన్నట్లుగా నాకు నేను ధైర్యం చెప్పుకొని ప్రశాంతంగా ఉండగలిగాను. అయితే ‘చానల్‌’ అనేది భిన్నమైన అనుభవం. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే ఆ బ్రాండ్‌ గురించి తెలుసు. ఆ ప్రసిద్ధ బ్రాండ్‌కు సంబంధించిన షోలో నడవడం(ఓపెనింగ్‌ వాక్‌) అనేది మరపురాని విషయం. మ్యాజికల్‌ ఎక్స్‌పీరియెన్స్‌. షో తరువాత వేదిక వెనక ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా నన్ను హగ్‌ చేసుకున్నారు. కన్నీళ్లతో భావోద్వేగాలను పంచుకున్నారు.

ఈ సీజన్‌లో నాకు సంతోషకరమైన విషయం ఏమిటంటే..?
ఇతర మోడల్స్, టీమ్‌తో ఏర్పర్చుకున్న బంధం. ఈ టీమ్‌లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. అలా అందరినీ కలుపుకొని పోయే క్రియేటివ్‌ డైరెక్టర్‌ ఉంటే ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మాథ్యుపై ఎంతో ప్రేమ ఉంది.

‘షోలో లేని వ్యక్తులు ఏమి చూడాలనుకోవాలనుకుంటారు?’ అనే ప్రశ్నకు నా జవాబు ఇది.... మాథ్యూ బ్లేజీ, ‘చానల్‌’ బ్రాండ్‌ టీమ్‌ ఎంత అద్భుతమైనవారో ప్రజలు చూడాలని నేను కోరుకుంటున్నాను. వారిలోని ఆ΄్యాయత, దయాగుణం నా హృదయాన్ని తాకింది. వారిలోని అసాధారణ ప్రతిభ, వృతిపట్ల అంకితభావం పనిలోని ప్రతి అంశలోనూ కనిపిస్తుంది. వారితో కలిసి ప్రయాణం చేయడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

అమ్మానాన్నల కంట్లో ఆనందం!
తన తల్లిదండ్రులకు సంబంధించి ఒక  వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది భవిత. ఈ వీడియో క్లిప్‌లో ఆమె తల్లిదండ్రుల భావోద్వేగాలు కనిపిస్తాయి. న్యూయార్క్‌లోని బోవరీ స్టేషన్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో కూతురు పాల్గొన్న ఫ్యాషన్‌ షోను చూస్తూ  ఆనంద బాష్పాలతో భవిత పేరును పదే పదే ఉచ్చరిస్తుంటుంది ఆమె తల్లి. తండ్రి ఒకింత గర్వంతో చూస్తుంటారు. ‘ఇది నాకు ఎంత అద్భుతమో చెప్పడానికి మాటలు చాలవు. థ్యాంక్యూ’ అని కాప్షన్‌లో రాసింది భవిత.

‘అద్భుత విజయాల వెనుక తల్లిదండ్రుల త్యాగాలు ఉంటాయి. వారి చల్లని ఆశీర్వచనాలు ఉంటాయి’ అని చెప్పకనే చెప్పిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
ఏమీ తెలియని మోడలింగ్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టడం అంటే ఆ సమయంలో రిస్క్‌గానే భావించాలి. ఒకవేళ రిస్క్‌ అనుకుంటే ఆమె ఈ కొత్త ప్రపంచంలోకి వచ్చేది కాదేమో! తల్లిదండ్రులు ఆమె భుజం తట్టి ప్రోత్సహించారు. ఉత్సాహాన్ని ఇచ్చారు.
మోడలింగ్‌లోకి వచ్చినప్పటికీ చదువుకు దూరం కాలేదు భవిత. ఒకవైపు చదువుకుంటూనే, క్యాంపస్‌ జాబ్‌ చేస్తూనే మోడలింగ్‌ చేసింది.

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)