పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
Breaking News
ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చిన 'రాజ్-కోటి' ఎలా విడిపోయారు..?
Published on Sat, 11/22/2025 - 10:32
మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం 35 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయింది. కౌబాయ్ పాత్రలో చిరు దుమ్మురేపితే.. సంగీతంతో రాజ్- కోటి అదరగొట్టేశారు. కొదమసింహం కోసం ఈ జోడీ ఇచ్చిన పాటలు 'జపం జపం జపం, కొంగ జపం', 'చక్కిలిగింతల రాగం', 'గుం గుమాయించు కొంచెం' ఇప్పటికీ పాపులర్‌గానే ఉన్నాయి. 1990 నాటి సినిమాల్లో రాజ్ - కోటి (Raj - Koti) ద్వయం పేరు పోస్టర్‌పై పడిందంటే.. ఆ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యేది. టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న వీరిద్దరూ అనుకోని కారణాలతో సుమారు పదేళ్లకు పైగా దూరంగానే ఉన్నారు. అయితే, కొంత కాలం తర్వాత మళ్లీ కలిసిపోయినప్పటికీ వర్క్ పరంగా ఒక్కప్రాజెక్ట్ కూడా చేయలేదు. ఇంతకూ వీరిద్దరూ ఎందుకు విడిపోయారు.
మంచి స్నేహితులుగా గుర్తింపు
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద రాజ్, కోటి అసిస్టెంట్స్‌గా పనిచేశారు. వారి స్నేహానికి తొలి అడుగు అక్కడే పడింది. అయితే, ‘ప్రళయగర్జన’ (1982) చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజ్‌కు మొదట ఛాన్స్ దక్కింది. కానీ, తన స్నేహితుడు కోటితో పాటు ఎంట్రీ ఇవ్వాలని ఆయన అనుకున్నారు. వారి స్నేహబంధం బలంగా ఉండటం వల్ల ఆ సినిమాతో పరిశ్రమలోకి ఒకేసారి అడుగుపెట్టారు. అయితే, ఆ సినిమా భారీ విజయం దక్కడంతో ఈ జోడీ వెనుతిరిగి చూడలేదు. ఆ సమయంలో ఉన్న స్టార్ హీరోల సినిమాలకు రాజ్- కోటి సంగీతం ఉండాల్సిందే అనేంతలా ఇమేజ్ పెంచుకున్నారు.
యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, కర్తవ్యం, పెద్దరికం, మెకానిక్ అల్లుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. సుమారు 200 సినిమాలకు వీళ్లు కలిసే పనిచేశారు. ఏఆర్ రెహమాన్, తమన్, యువన్ శంకర్ రాజా వంటి టాప్ సంగీత దర్శకులు కూడా రాజ్- కోటి దగ్గర వర్క్ చేసినవారే కావడం విశేషం.
విడిపోయాక రాజ్ ఒక్కడే..
కొన్ని కారణాలతో రాజ్- కోటి విడిపోయారు. ఆ తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో "సిసింద్రీ" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే కొన్ని టీవి షోలకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవితో హిట్లర్, బాలకృష్ణతో పెద్దన్నయ్య, వెంకటేశ్ తో నువ్వు నాకు నచ్చావ్, ఆరుంధతి,రిక్షావోడు మొదలైనవి ఉన్నాయి.
ఎందుకు విడిపోయారంటే..
రాజ్‌తో ఎందుకు విడిపోయారో ఓ ఇంటర్వ్యూలో కోటి ఇలా చెప్పారు. కాలమే మమ్మల్ని కలిపింది.. కాల ప్రభావం వల్లనే మేము విడిపోయాం. మంచి స్నేహితులుగా మొదలైన మా ప్రయాణంలో ఎక్కువగా సంగీతం గురించే మాట్లాడుకునేవాళ్లం. ఈ క్రమంలో రాజ్‌కు మొదటిసారి సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చింది. అప్పుడు కలిసి చేద్దామని అడగడంతో నేను సరే అని మ్యూజిక్ కంపోజింగ్ చేయడం మొదలుపెట్టాం. మా జోడీ సుమారు పదేళ్ల పాటు ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీలో మాకు మంచి పేరుతో పాటు గౌరవం వచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల కాలమే మమ్మల్ని విడదీసింది.
మా మ్యూజిక్ టీమ్‌లో ఆర్కెస్ట్రాకు సంబంధించిన ట్యూనింగ్ వర్క్‌ను రాజ్ చూసేవారు. చిత్ర యూనిట్‌తో అనుసందానంగా నేను ఉండేవాడిని. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు మా స్నేహంలోకి ఎంట్రీ ఇచ్చారు. వారు చెప్పిన మాటలు విన్న రాజ్ ఓసారి నా వద్దకు వచ్చి విడిపోదామని కోరారు. ఆ సమయంలో నేను వద్దని చెప్పాను. మన మధ్యలో ఎవరో చిచ్చు పెట్టేందుకే ఇలా చెప్పారని సూచించాను. కలిసి పనిచేద్దామని చాలా ప్రయత్నించాను. కానీ, రాజ్ వినకపోవడంతో విడిపోయాం. మేము విడిపోయినప్పటికీ స్నేహితులగానే కొనసాగాము.
ఆ సమయంలో బాల సుబ్రహ్మణ్యం చాలా బాధపడ్డారు. మళ్లీ కలిసి వర్క్ చేయమని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఫైనల్‌గా ఆయనే మమ్మల్ని కలిపారు. కలిసి వర్క్ చేద్దామని అనుకున్నాం. కానీ, మాకు ప్రాజెక్ట్ రాకపోవడంతో కుదరలేదు.' అని కోటి పంచుకున్నారు. 68 ఏళ్ల వయసులో రాజ్ (తోటకూర సోమరాజు) గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో 2023 మే 21న తుదిశ్వాస విడిచారు.
Tags : 1