అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం
Breaking News
Margasira Masam 2025: సర్వం పర్వదినాలే..
Published on Thu, 11/20/2025 - 11:47
పరమ పవిత్రమైన కార్తిక మాసం నేటితో ముగుస్తోంది. రేపటినుంచి విష్ణుప్రీతికరమైన మార్గశిర మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ సందర్భంగా మార్గశిర మాస విశిష్టతను తెలుసుకుందాం.
మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ దేవికి చేసే పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయన్నది పెద్దల మాట. మార్గశిర మాసం మాసాలలోకెల్లా ’శీర్షం’ అంటే’ శిరసు’ వంటిదని అర్ధం. ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రం మృగశిర కాబట్టి ఈ మాసానికే మార్గశిరమని పేరు.
రోజుకో పర్వం...
మార్గశిర మాసంలో ప్రతిరోజూ ఒక పర్వదినమే. అసలు ఈ నెలలోని మొదటిరోజైన శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమిగా జరుపుకోవడంతో ఈ మాసంంలోని పర్వదినాల పరంపర ప్రారంభం కానుంది. ఈ రోజు గంగాస్నానం చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుందని చెబుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, మిత్ర సప్తమి, గీతా జయంతి, దత్త జయంతి వంటి విశేష పర్వదినాలు వచ్చేది ఈ మాసంలోనే.
మార్గశిర గురువార వ్రతం
కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. ఐదువారాల అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువార లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.
మార్గశిర గురువారం వ్రతం
సాధారణంగా గురువారంను లక్ష్మీవారమని కూడా అంటారు. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలలో చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాలలోనూ, పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడూ ఈ పూజను ఆచరించడం సర్వ శ్రేష్టం. మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద. ఆరోగ్య భాగ్యం చేకూరతాయని విశ్వాసం.
ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసం. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళాలతో పూజించడం పుణ్యప్రదం.
ద్వాదశినాడు పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించడం విశిష్ట ఫలప్రదం. శ్రీ విష్ణుతోపాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయ నమః, ఓ నమో నారాయణాయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం. ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని వృత్తికతో, తులసి ఆకులను తీసికొని ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించడం వల్ల సర్వ విపత్తులూ తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పెద్దలు చెబుతారు.
– డి.వి.ఆర్.
Tags : 1