గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే
అమ్మాయిలూ... వింటున్నారా..?!
Published on Wed, 11/19/2025 - 10:54
పెళ్లికి మాత్రమే కాదు సంబంధంలోనూ ’సమానత్వం’ కోరుకునే జనరేషన్ ఇది. ఒకప్పటి రోజుల మాదిరి ‘వయసు వచ్చింది పెళ్లికి రెడీ‘ అనే రోజులు కావివి. పెద్ద అంకెల్లో సంపాదన, సొంత ఇల్లు.. ‘సెట్ అయ్యాకే‘ పెళ్లి అంటున్నారు అబ్బాయిలు. పెద్దలు చూశారు, ఓకే అనేశారు అనడానికి వీలు లేదు. భవిష్యత్తు అంచనాలతోపాటు వాస్తవాలకు చేరువగా ఉంటున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయన వరుణ్ వయసు 30. వయసు దాటిపోతోంది అని ఇంట్లో వాళ్లు ఎంత పోరుతున్నా మంచి ప్యాకేజీ, సొంత ఇల్లు, కారు కొన్నాకే పెళ్లి అని చెప్పాడు. ఇవి ఉంటేనే మంచి సంబంధాలు వస్తాయని తల్లిదండ్రీ కూడా పెద్దగా ఒత్తిడి తేవడం లేదు. వరుణ్ లాంటి వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.
‘ఇవి మంచి విషయాలే కానీ, ఇంకా చాలా విషయాలను పట్టించుకుంటూ మరీ ఆలస్యం చేయడం వల్ల మ్యాచ్‌లు కుదర్చడం చాలా కష్టంగా మారింది..’ అంటున్నారు పెళ్లిళ్లు కుదిర్చే పెద్దలు. ఇంతకీ అమ్మాయిల గురించి అబ్బాయిలకున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి, డిమాండ్స్ ఏంటి? భయాల మాటేమిటి? .. వధూవరుల ఎంపికలో సంబంధాలను చేరువ చేస్తున్న మ్యారేజీ బ్యూరోల వాళ్లు చెబుతున్న విషయాలు ఇవి..
అబ్బాయిల ‘ఎక్స్‌పెక్టేషన్స్’...
ఒకప్పుడు అమ్మాయికి వంట వచ్చా, పాటలు పాడుతుందా, కుట్లు, అల్లికల మాటేమిటి..? అని అడిగేవారు. ఇంటి పట్టున ఉంటే చాలు.. అనేవారు. ఒకప్పటితో పోల్చితే అబ్బాయిలకు ఇప్పుడు స్పష్టమైన కండిషన్స్ ఉంటున్నాయి.
ఇద్దరికి నెలలు – రోజుల తేడా ఉన్నా సరే. అమ్మాయికి మంచి చదువు, ఉద్యోగం ఉండాలి
ఫ్రెండ్లీ నేచర్ మస్ట్.
అర్ధం చేసుకునే స్వభావం ఉండాలి. కుటుంబంతో కలిసిపోయేలా మాట్లాడాలి. అవసరం అయితే అడ్జస్ట్‌మెంట్ చేసుకోగలగాలి.
మైండ్ సెట్ అవ్వాలి. ఎమోషనల్ సపోర్టర్‌గా ఉండాలి.
గౌరవించాలి. అహం ఉండకూడదు.
పెద్ద కుటుంబం నుంచి వచ్చినదై, ఆర్థికంగా స్థితిమంతులు అయి ఉండాలి.
అన్ అఫిషియల్ డిమాండ్స్
బయటకి మాత్రం ‘కట్నం గురించి పెద్దగా పట్టించుకోం’ అంటారు. లోపల పెద్దల మాటా మంతితో డబ్బు, బంగారంతోపాటు స్థిరాస్తి ఇస్తే మరీ బెటర్.
పెళ్లి ఖర్చులు అమ్మాయి వాళ్లే భరించాలి.
అమ్మాయి కుటుంబం ‘మమ్మల్ని బాగా చూసుకుంటుందా..లేదా’ అనే గమనింపు.
ఇవి చాలా రియల్ ...
ప్రస్తుత రోజులను గమనించి భయపడుతున్న సంఘటనలు అబ్బాయిలలో ఉంటున్నాయి. వాటిలో...
ఫైనాన్షియల్ ప్రెషర్ భయం వరుడిలోనే ఎక్కువ. ‘పెళ్లి తరువాత అన్ని బాధ్యతలు నాపైనే పడతాయా?‘ ఇది ప్రతీ అబ్బాయి లోపలుండే నిజమైన భయం. అందుకే, అమ్మాయి కూడా సంపాదనాపరురాలైతే మంచిదనుకుంటున్నారు.
‘హాబీలు, పర్సనల్ స్పేస్, వ్యక్తిగత స్వేచ్ఛ పోతుందేమో.. !! అందుకే, ‘నా ఇష్టాలు ఇవి.. ’ అని ముందుగానే చెప్పేస్తున్నారు..
కొత్తగా పెళ్లయ్యి దంపతుల మధ్య తలెత్తుతున్న వివాదాలు, ఒకటి రెండు చేదు సంఘటనలను దృష్టిలో పెట్టుకొని.. తమ భావి జీవితం వారిలాగే దెబ్బతింటుందేమో అనే భయం ఈ తరం అబ్బాయిలలో పెరిగింది. అందుకే, పాస్ట్ రిలేషన్స్ ఏమైనా ఉంటే సంకోచం లేకుండా ఇప్పుడే చెప్పచ్చు అని నిక్కచ్చిగా చెప్పేవాళ్లూ ఉన్నారు.
‘నేను గుడ్ హజ్బండ్ కాలేకపోతే?‘,‘ఆమె హ్యాపీగా ఉండకపోతే?’ ఇవి బయటకు చెప్పని ఆందోళనలు. అందుకే, ‘నాకే చెడు అలవాట్లు లేవు..’ అని ముందే కమిట్ అవుతున్నవాళ్లూ ఉన్నారు.
‘పెళ్లి తరువాత ఇరువైపుల కుటుంబాల మనోభావాలు కలవకపోతే... మధ్యలో నేను నలిగిపోతానా?!’ అని ఆలోచిస్తున్నవారూ ఉన్నారు.
ఇప్పటి అబ్బాయిలు అమ్మాయిల మాదిరిగానే భావోద్వేగాలున్నవారే. రియలిస్టిక్ అంచనాలు పెట్టుకునే వాళ్లు. రిలేషన్‌షిప్‌లో సురక్షితమైన వైబ్‌ను కోరుకుంటున్నారు.
సోషల్ మీడియా కంపారిజన్స్..
ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, కపుల్ గోల్స్... సోషల్‌మీడియా హైప్స్ చూసి చాలామంది అబ్బాయిలు–అమ్మాయిలు కూడా ఫెయిరీటేల్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ‘ఫలానా కపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు’ అనే మాటలు రావడంతో ఈ కంపారిజన్ తమపైన పడుతుందేమో!.. అని భయపడుతున్నవారూ ఉన్నారు.
ఒకప్పుడు అబ్బాయి జీతం ఎంత అనే విషయం అడగకూడదు అనేవారు. కానీ, ఇప్పుడు ముందు ‘ఇయర్లీ ప్యాకేజీ’ ఓకే అయితేనే సంబంధం గురించి ఆలోచిస్తున్నారు. అబ్బాయిలు కూడా తమ ఆర్థిక ప్రణాళిక గురించి ముందే చెబుతున్నారు. ఖర్చులు ఎవరు, ఎలా పెట్టాలి, భవిష్యత్తు కోసం చేసే పొదుపు గురించిన ఆలోచనలూ పెరిగాయి.
– నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి
ఆలస్యం ఎందుకు అవుతుందంటే...
పెళ్లిలో కుటుంబాల ప్రభావం చాలా ఎక్కువ. ఇరువైపుల కుటుంబాలు కాబోయే వధూవరుల చదువు, ఇయర్లీ సం΄ాదన, కులం, గోత్రం, ప్రాంతం, లుక్, వివాహ జాతకం, కంపాటబిలిటీ నెంబర్ల స్కోర్.. ఇవన్నీ బాగుంటేనే రెండువైపుల వాళ్లు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇందులో .. ఇచ్చి పుచ్చుకోవడాలు, బడ్జెట్ డిమాండ్లు, పర్సనాలిటీ, కమ్యూనికేషన్, మైండ్‌సెట్ .. ఇవన్నీ ఒక పెళ్లిని సెట్ చేయడంలో ప్రధానంగా కనిపిస్తున్నాయి.
అబ్బాయి–అమ్మాయి సమానత్వం అనుకున్నా వరులు మాత్రం ‘అబ్బాయి అంటే అబ్బాయే!‘ అనే అటిట్యూడ్ చూపిస్తున్నవాళ్లూ ఉన్నారు. దీంతో పెళ్లి సెట్ అయ్యే టైమ్‌కి అబ్బాయికి–అమ్మాయికి 30–35 ఏళ్లు దాటుతున్నాయి.
– కవిత, కె.ఆర్ మ్యారేజీ బ్యూరో, హైదరాబాద్
జాతకాల ప్రభావం పెరిగింది..
పరిచయస్తులు, బంధువర్గంలోనే వివాహ సంబంధాలను కుదుర్చుతున్నాను. రెండువైపులా చదువు, మంచి కుటుంబం, ఆర్థిక విషయాల్లో స్థిరత్వానికి బాగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. వీటి తర్వాత జాతకాలదే ప్రాముఖ్యత. ఇద్దరూ అందానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు. కెరియర్ విషయంలో అమ్మాయి సాఫ్ట్‌వేర్ అయితే సాఫ్ట్‌వేర్ సంబంధాన్నే ఎక్కువ కోరుకుంటున్నారు. అబ్బాయిలు మాత్రం ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇతర ప్రొఫెషన్స్ వైపు చూస్తున్నారు. వీటికి తోడు అమ్మాయివైపు ఆర్థిక స్థితిగతులను అంచనావేసే ముందడుగువేస్తున్నారు.
– కొత్తపల్లి రమేష్‌రెడ్డి, రిటైర్డ్ ఏఆర్‌సిఐ, హైదరాబాద్
Tags : 1