ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
Breaking News
రూ.530 కోట్లతో అల్యూమినియం క్యాన్ల తయారీ ప్లాంట్ విస్తరణ
Published on Mon, 11/17/2025 - 16:45
సస్టైనబుల్ అల్యూమినియం ప్యాకేజింగ్‌లో సర్వీసులు అందిస్తున్న బాల్ కార్పొరేషన్ భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముంబై సమీపంలోని తలోజా తయారీ కేంద్రానికి 2024లో చేసిన దాదాపు 55 మిలియన్ డాలర్ల(సుమారు రూ.480 కోట్లు) పెట్టుబడికి కొనసాగింపుగా బాల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సదుపాయంలో సుమారు 60 మిలియన్ డాలర్లు(సుమారు రూ.530 కోట్లు) ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు తెలిపింది. దాంతో మొత్తంగా ఇండియాలో 115 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లవుతుంది.
పానీయాలకు సంబంధించి అల్యూమినియం ప్యాకేజింగ్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి బాల్ కార్పొరేషన్ ప్రాంతీయ సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో ఈ చర్యలు కీలకంగా ఉంటాయని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీ వృద్ధికి భారతదేశం కీలకం. ఈ పెట్టుబడి ఇండియాలో కార్యకలాపాలను మరింత పెంచడానికి, ప్రత్యర్థులతో దీర్ఘకాలిక పోటీ ప్రయోజనాన్ని పొందటానికి వీలు కల్పిస్తుంది’ అని బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ ఆసియా ప్రెసిడెంట్ మాండీ గ్లూ అన్నారు.
రాబోయే ఐదేళ్లలో భారతదేశపు పానీయాల మార్కెట్ వార్షికంగా 10% పైగా విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్యాకేజింగ్‌లో సుస్థిరత, వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ పానీయాల బ్రాండ్లు అల్యూమినియం ప్యాకేజింగ్ వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా రెడీ టు డ్రింక్ (RTD), పాల ఆధారిత పానీయాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంది. ఈ విభాగంలో మన్నిక, షెల్ఫ్ లైఫ్ పొడిగింపు కారణంగా అల్యూమినియం ప్యాకేజింగ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. పాల విభాగంలో ప్యాకేజింగ్‌కు సంబంధించి కంపెనీ రిటార్ట్ ఇన్నోవేషన్ టెక్నాలజీని వాడుతున్నట్లు అధికారులు చెప్పారు.
ఈ సందర్భంగా బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ ఇండియా ఆసియా రీజినల్ కమర్షియల్ డైరెక్టర్ మనీష్ జోషి మాట్లాడుతూ..‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మార్కెట్లో కస్టమర్లకు విశ్వసనీయతతో సేవలందించాలని కంపెనీ నిబద్ధతతో పని చేస్తోంది’ అన్నారు. బాల్ 2016లో భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి తలోజా, శ్రీసిటీల్లో తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇది ప్రస్తుతం 185 మి.లీ నుంచి 500 మి.లీ వరకు విస్తృత శ్రేణి క్యాన్ ఫార్మాట్లను తయారు చేస్తోంది.
ఇదీ చదవండి: ‘మా మేనేజర్ కరుణామయుడు’
Tags : 1