Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
Breaking News
అద్దంతో అల్లుకుంటూ!
Published on Sun, 11/16/2025 - 07:57
‘దర్యాప్తు అధికారికి సునిశిత దృష్టి, ప్రతి విషయాన్నీ అధ్యయనం చేసి, బేరీజు వేసే తత్త్వం ఉన్నట్లయితే; నేరస్థలిలోని లభించే, కనిపించే ప్రతి అంశమూ ఒక ఆధారం అవుతుంది’– ఇది ప్రపంచ వ్యాప్తంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు నమ్మే అంశం. సాధారణంగా సంచలనాత్మక ఉదంతాల్లో మాత్రమే పోలీసులు దీన్ని కచ్చితంగా పాటిస్తుంటారు. అయితే, హైదరాబాద్‌లోని బొల్లారం పోలీసులు మాత్రం సాధారణ నేరంగా పరిగణించే గుర్తుతెలియని వాహనాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం (హిట్ అండ్ రన్) కేసునూ సంచలనాత్మక నేరం స్థాయిలో దర్యాప్తు చేశారు. ఘటనాస్థలిలో దొరికిన ఓ అద్దం (కుడివైపు సైడ్ మిర్రర్) ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.
అది 2013లో తొలిరోజైన జనవరి 1, సమయం ఉదయం 6.15 గంటలు. చలితో పాటు పొగమంచూ దట్టంగా ఉంది. బొల్లారం ప్రధాన రహదారిలోని సెయింట్ ఆన్స్ హోమ్‌లో ఉన్నవాళ్లు అప్పుడే నిద్రలేస్తున్నారు. అదే సమయంలో ప్రహరీగోడ పైనుంచి హోమ్ ఆవరణలోకి ఓ ఆకారం పడటం గమనించారు. పరుగున వెళ్లి చూసి మహిళ (65)గా గుర్తించారు. ప్రహరీకి ఆవలి వైపున్న రోడ్డు మీద ఓ యువతి (30) తీవ్రగాయాలతో పడినట్లు కలకలం మొదలైంది. అదే సమయంలో వాకింగ్ చేస్తున్న కొందరు ప్రత్యక్ష సాక్షులు గమనించిన దాని ప్రకారం 6037 నెంబర్ కలిగిన తెల్లరంగు స్విఫ్ట్ కారు శామీర్‌పేట వైపు నుంచి వేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టింది. ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధమహిళ అప్పటికే మరణించిందని, యువతికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు నిర్ధారించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసుస్టేషన్లో సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న షేక్ సాదిక్ ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధితులు నివసించేది స్నేహ ఎన్‌క్లేవ్‌లో అని, మృతి చెందిన వృద్ధురాలు ఆశాదేవిగా, క్షతగాత్రురాలు ఆమె కుమార్తె శ్వేత సింగ్‌గా గుర్తించారు. సంఘటన జరిగిన ప్రధాన రహదారికి క్షుణ్ణంగా పరిశీలించిన సాదిక్ దృష్టి అక్కడ పడున్న ఓ కారు సైడ్ మిర్రర్‌పై పడింది. అది ప్రమాదానికి కారణమైన కారుదే అయి ఉంటుందనే ఉద్దేశంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి అదే కీలకాధారం అవుతుందని ఆ సమయంలో ఆయన అనుకోలేదు. అద్దం తీసుకుని నేరుగా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పట్లో ఆ ఠాణా ఇన్స్పెక్టర్ పని చేస్తున్న టి.లక్ష్మీనారాయణకు కేసు పూర్వాపరాలు వివరించి, ఆ అద్దాన్ని ఆయన ముందుంచారు.
ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇరువురూ దేశానికి సేవ చేసిన మాజీ సైనికాధికారి కుటుంబానికి చెందిన వారని తెలుసుకున్నారు. ఈ విషాదానికి కారణమైన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలని నిర్ణయించుకున్న ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆ కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆశాదేవి, శ్వేతలను ఢీ కొట్టింది స్విఫ్ట్ కారు అని స్థానికులు చెప్పడంతో ముందుగా ఆ మోడల్స్ పైనే దృష్టి పెట్టారు. ప్రమాద సమయంలో ఆ కారు శామీర్‌పేట వైపు నుంచి వస్తోందని నిర్ధారణ కావడంతో ఆ దిశలో ముందుకు వెళ్లారు. ఆర్టీఓ డేటాబేస్ ఆధారంగా హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్‌ల్లో నమోదైన తెల్లరంగు స్విఫ్ట్ కార్ల వివరాలు సేకరించారు. అది భారీగా ఉండటంతో విశ్లేషించే పనిలో పడ్డారు.
ఆయా వాహనాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? ఎవరైనా ఆ రోజు బొల్లారం మీదుగా ప్రయాణించారా? ఇలాంటివి తేల్చడానికి కొంత సమయం తీసుకుంటుందని భావించిన ఇన్స్పెక్టర్ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలెట్టారు. బొల్లారంలో ఉన్న ఓ కార్ మెకానిక్‌ను పిలిపించి ఘటనాస్థలిలో లభించిన అద్దాన్ని చూపించారు. దాన్ని పరిశీలించిన ఆ మెకానిక్ అది స్విఫ్ట్ కారుది కాదని, ఫోర్డ్ కంపెనీకి చెందిన కారుదని నిర్ధారించారు. దీనికి తోడు రెండుగా విడిపోయిన ఆ అద్దం వెనుక భాగంలో ‘22.6.2012’ అని రాసి ఉండటాన్ని అదే సమయంలో ఇన్స్పెక్టర్ గుర్తించారు. ఈ ఆధారాలను బేరీజు వేస్తూ సదరు కారు ఆ తేదీ తరవాత వినియోగదారుడికి డెలివరీ అయి ఉంటుందని అంచనా వేశారు. ఆ రోజు తరవాత రిజిస్టర్ అయిన ఫోర్డ్ కార్ల వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వాటిలో నాలుగు తెల్లరంగువి ఉన్నట్లు తేల్చారు. ఆయా కార్ల రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా యజమానుల చిరునామాలు గుర్తించారు.
ఈ నాలుగు చిరునామాలకు స్వయంగా వెళ్లి, విచారణ చేసి రావడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. చందానగర్ చిరునామాతో రిజిస్టర్ అయి ఉన్న కారును వెతుక్కుంటూ వెళ్లిన ఈ టీమ్ ఓ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న ‘ఏపీ 29 ఏవీ 6037’ నెంబర్ కారును గుర్తించింది. ఆ కారుకి కుడివైపు సైడ్ మిర్రర్ య«థాతథంగా ఉండటం, ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో తాము వెతుకుతున్న కారు అది కాదేమోనని అనుకుంటూ విషయాన్ని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణకు చెప్పింది. ఆయన సూచనల మేరకు ఆ కారుకు కొత్తగా రంగు వేసిన దాఖలాలు, దానికి సంబంధించిన ఆధారాల కోసం సమీపంలోకి వెళ్లి పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే ఆ కారుకు కొత్తగా రంగు వేస్తుండగా దాని టైర్‌పై పడిన పెయింట్ చుక్కలు గమనించింది. వెంటనే అప్రమత్తమైన టీమ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని యజమానుల్ని పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పింది.
అలా వచ్చిన యజమానుల్ని విచారించడంతో జనవరి ఒకటో తేదీన ఆ కారుని తన సమీప బంధువైన ఎంటెక్ విద్యార్థి, నేరేడ్మెట్ వాసి డి.భరద్వాజ్ తీసుకువెళ్లాడని, తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడైంది. దీంతో అతడి కోసం గాలింపు ప్రారంభించారు. తన వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారనే విషయం తెలుసుకున్న భరద్వాజ్ నేరుగా బొల్లారం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆ రోజు పొగమంచు కారణంగా ఓ ప్రమాదం జరిగిందని, అయితే తాను గొడను ఢీ కొట్టానని భావించానని పోలీసులకు తెలిపారు.
ప్రమాదం జరిగినట్లు కారు యజమానులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే కారుకు రంగు వేయించానని అంగీకరించాడు. దీంతో బొల్లారం పోలీసులు భరద్వాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భరద్వాజ్ నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు మరణించడంతో పాటు ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఇంజనీరింగ్ చదువుతున్న మరో కుమార్తె సుదీర్ఘకాలం షాక్‌లో ఉండిపోయి మాట పలుకు లేకుండా తనను తాను మర్చిపోయారు. ఎవరైనా దగ్గరకు వెళ్లి పలకరిస్తే... ‘అమ్మ వెళ్లి చాలాసేపు అయింది. రమ్మని చెప్పండి’ అని మాత్రమే అంటూ కోలుకోవడానికి చాలా రోజులు తీసుకుంది.
∙
Tags : 1