Breaking News

శిథిలావస్థ నుంచి సర్వాంగ సుందరంగా..

Published on Thu, 09/18/2025 - 18:29

వంద ఆలయాలు నిర్మించడం కంటే.. శిథిలమైన ఒక పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడం వంద జన్మల పుణ్యఫలమని పండితులు చెబుతుంటారు. ఆ మాటలు విన్న కొంతమంది భక్తులు కలిసికట్టుగా కృషిచేసి అత్యంత పురాతనమైన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి సరికొత్త చరిత్ర లిఖించారు. తమిళనాడులోని శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాథస్వామిని దర్శించుకోలేని భక్తులకు నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి అత్యంత చేరువలో ఉన్న శ్రీపురం శ్రీరంగనాథస్వామి కొంగు బంగారంగా మారారు. అత్యంత మహిమాన్వితమైన శ్రీపురం శ్రీరంగనాథస్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ జిల్లాలోనే ప్రముఖ ఆలయంగా మారింది. జిల్లాలోనే పురాతన వైష్ణవాలయాల్లో ఒకటైన శ్రీపురం రంగనాథస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

శ్రీరంగం నుంచి తలపై విగ్రహంతో.. 
శ్రీపురంలోని రంగనాథస్వామి ఆలయ నిర్మాణంతోపాటు ఆలయ చారిత్రక వైభవంపై చరిత్రకారులు రాసిన పుస్తకాల ద్వారా పలు విశేషాలు తెలుస్తున్నాయి. సుమారు 500 ఏళ్ల కిందట తిరుమల వింజమూరి వంశానికి చెందిన నాలుగో నర్సింహాచార్యులు శ్రీపురంలో శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. రంగనాథుడికి పరమ భక్తుడైన నర్సింహాచార్యుడికి కలలో స్వామివారు కనిపించి, తమకు శ్రీపురంలో ఆలయం నిర్మించాలని ఆదేశించారని, దీంతో ఆయన కాలినడకన శ్రీరంగం వెళ్లి అక్కడే రంగనాథస్వామి విగ్రహాన్ని తయారు చేయించారని.. అక్కడి నుంచి తలపై విగ్రహాన్ని పెట్టుకొని శ్రీపురం దాకా కాలినడకన వచ్చి ప్రతిష్టించారని చరిత్రకారులు చెబుతున్నారు.

కాలక్రమేణా రంగనాథస్వామి మహిమల కారణంగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దీంతో సమీపంలోని పలు సంస్థానాదీశులు కూడా శ్రీపురం రంగనాథస్వామికి భక్తులుగా మారడంతోపాటు ఆలయ నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను ఇనామ్‌గా ఇచ్చారని ఆధారాలున్నాయి. ఆత్మకూరు ప్రాంతంతోపాటు గద్వాల, నాగర్‌కర్నూల్‌ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో రంగనాథస్వామి ఆలయానికి భూములు ఉండేవని, కాలక్రమంలో చాలా భూములు అన్యాక్రాంతమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ చుట్టుపక్కల మాత్రమే రంగనాథస్వామికి 120 ఎకరాల దాకా భూములున్నాయి. 

కాగా, రంగనాథస్వామి ఆలయం 450 ఏళ్లపాటు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏకంగా అగ్రహారం వెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. సుమారు వందకుపైగా బ్రాహ్మణ కుటుంబాలు శ్రీపురంలో (Sripuram) ఉండేవని.. మారిన కాలంతోపాటు వారిలో ఎక్కువ భాగం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని స్థానికులు చెబుతున్నారు.

శిథిలావస్థ నుంచి పునరుజ్జీవం వైపు.. 
ఎంతో ఘన చరిత్ర కలిగిన శ్రీరంగనాథస్వామి (Ranganatha Swamy Temple) ఆలయం 50 ఏళ్ల నుంచి క్రమంగా శిథిలావస్థకు చేరింది. ఆలయ నిర్వహణ కోసం కేటాయించిన భూములపై కౌలు సక్రమంగా రాకపోవడంతో ధూప, దీప, నైవేద్యాలకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్వహణ కొరవడి ఆలయం శిథిలావస్థకు చేరింది. 2012లో కొంతమంది భక్తులు, ఆలయ ధర్మకర్తల కుటుంబ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. గ్రామస్తులు, దాతల సహకారంతో రూ.కోటి వ్యయంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పురాతన శైలి దెబ్బతినకుండా గతంలో ఉన్న శిల్పకళను పోలిన రీతిలో ఆలయాన్ని పునరుద్ధరించారు. దీంతోపాటు ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, కోనేరు, 25 అడుగుల ఎత్తయిన భారీ రథం సమకూర్చుకున్నారు.

2014 జూన్‌లో పునఃప్రతిష్ట 
ఒకప్పుడు కూలిన గోడలు.. విరిగిన విగ్రహాలు, పిచ్చి మొక్కలతో నిర్మానుష్యంగా కనిపించే ఆలయ ప్రాంగణం ప్రస్తుతం అత్యంత శోభాయమానంగా మారింది. 2014 జూన్‌లో ఆలయాన్ని పునఃప్రతిష్టించగా.. భక్తులు స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నారు. అచెంచలమైన భక్తి స్వామివారి వైభవాన్ని నలువైపులా చాటుతోంది. ఏటా వైకుంఠ ఏకాదశితోపాటు ధనుర్మాస ఉత్సవాలు, గోదా కల్యాణం, విజయదశమి, సంక్రాంతి (Sankranti) వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

జ్యేష్ట మాసంలో.. 
ఏటా జ్యేష్ట మాసంలో నాలుగు రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం, తిరుమంజనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, గరుడ ముద్ద, భేరీ పూజ, దేవతాహ్వానం, శ్రీగోదా రంగనాథస్వామి తిరు కల్యాణం, రథోత్సవం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, దేవతోద్వాసన, ద్వాదశారాధన, ధ్వజారోహణ, కుంభ సంప్రోక్షణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రముఖ వైష్ణవాలయం.. 
పదేళ్ల కాలంలో జిల్లాలోనే అత్యంత ప్రముఖ వైష్ణవాలయంగా మారింది. ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఆలయ పునఃప్రతిష్టలో ప్రతిఒక్కరి సహకారం మరువలేనిది. కలిసికట్టుగా ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు.  
– నర్సింహారెడ్డి, ఆలయ పాలక మండలి ఉపాధ్యక్షుడు

అందరూ సహకరించారు.. 
రంగనాథస్వామి ఆలయ పునర్నిర్మాణంలో అందరూ విశేషంగా సహకరించారు. 2012లో కొంతమంది గ్రామ యువకులతో కలిసి మా కుమారుడు శ్రీధరాచార్యులు ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి వైభవాన్ని రంగనాథస్వామి ఆలయం మళ్లీ సంతరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఏటా ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతాయి. 
– తిరుమల వింజమూరి రంగాచార్యులు, ఆలయ ధర్మకర్త

గతంలో జాతర జరిగేది..
నా చిన్నప్పుడు ఇక్కడ జాతర జరిగేది. చుట్టుపక్కల ఊళ్ల నుంచి భక్తులు ఎడ్ల బండ్లపై వచ్చేవారు. పదిరోజులపాటు జాతర ఉండేది. గుడి చుట్టూ అగ్రహారం ఉండేదని.. దాదాపు 30 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవని మా అమ్మ చెప్పేది. ఇక్కడ ఎంతో మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. తర్వాత రోజుల్లో ఆలయ నిర్వహణ కష్టం కావడంతో బ్రాహ్మణ కుటుంబాలు వలస వెళ్లాయి. 12 ఏళ్ల కిందట గ్రామస్తులు, ధర్మకర్తలు భక్తులతో కలిసి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. 
– నారాయణరెడ్డి, శ్రీపురం

చ‌ద‌వండి: కొలిచిన వారికి బంగారు త‌ల్లి

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే