జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్
Breaking News
అంతర్జాతీయ స్థాయికి భారత ఆతిథ్యం
Published on Sat, 08/23/2025 - 05:55
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జీఎస్‌టీ శ్లాబుల హేతుబద్దీకరణతో భారత ఆతిథ్య రంగం అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాలను సంతరించుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 5 శాతం పన్ను రేటును ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం సేవలకు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాయి.
పన్నుల భారాన్ని తగ్గించేందుకు తదుపరి తరం జీఎస్‌టీ సంస్కరణలను తీసుకురానున్నట్టు స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనను హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఏఐ) స్వాగతించింది. అంతర్జాతీయంగా పర్యాటకులకు చిరునామాగా భారత్ మారేందుకు జీఎస్‌టీలో సంస్కరణలు అవసరమని పేర్కొంది.
ఇతర దేశాలతో పోల్చితే భారత ఆతిథ్య పరిశ్రమ ఆకర్షణీయంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, 2047 నాటికి ఏటా 10 కోట్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలన్న లక్ష్య సాధనకు ఉపకరిస్తుందని పేర్కొంది. భారత్‌లో టారిఫ్‌లు (పన్ను రేట్లు) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్న అభిప్రాయాన్ని హెచ్‌ఏఐ ప్రెసిడెంట్ కేబీ కచ్రు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా టాప్–5 పర్యాటక గమ్యస్థానాల్లో భారత్‌ను కూడా చేర్చాలంటే దేశ పోటీతత్వాన్ని పెంచాల్సి ఉందన్నారు. హోటళ్లపై 18 శాతం కారణంగా జీఎస్‌టీతో గదుల రేట్లు అధికంగా ఉంటున్నాయని.. దీంతో అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి ఉన్నట్టు వివరించారు.
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి..
‘‘ప్రస్తుతం హోటళ్లలో రూ.7,500 వరకు గదుల అద్దెపై 12 శాతం జీఎస్‌టీ రేటు అమల్లో ఉంది. ఇది 6–7 ఏళ్ల క్రితం నిర్ణయించిన రేటు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని రూ.15,000కు పెంచాలి. ఇలా చేయడం వల్ల పర్యాటకులకు గదుల ధరలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద పరిశ్రమ పోటీతత్వం పెరుగుతుంది’’అని హెచ్‌ఏఐ సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక సేవలపై ఏక రూప 5 శాతం పన్ను రేటును, ఐటీసీ సదుపాయంతో అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్టు పేర్కొంది. ఇలా చేస్తే నిబంధనల అమలు భారం తగ్గుతుందని, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
Tags : 1