బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
తెలుగు చిత్రం మెరిసింది
Published on Sat, 08/02/2025 - 05:50
71వ జాతీయ సినీ అవార్డులను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. 2023లో జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని, ఈ అవార్డులను ప్రకటించారు. అశుతోష్ గోవారీకర్ అధ్యక్షుడిగా, పదకొండు మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీ ఫీచర్ ఫిల్మ్ అవార్డుల విజేతలను నిర్ణయించింది.
నాన్–ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డుల విజేతలను ప్రకటించిన జ్యూరీకి పి. శేషాద్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. అవార్డుల్లోని ప్రధాన విభాగాల్లో హిందీ సినిమా జోరు కనిపించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి... ఇలాంటి ప్రధాన విభాగాల్లో నార్త్ సినిమా హవా కనిపించగా, టెక్నికల్ విభాగాల్లో దక్షిణాది సినిమాలకు అవార్డులు వచ్చాయి. కాగా తెలుగు చిత్రసీమ ఏకంగా ఏడు అవార్డులు దక్కించుకుని మెరిసింది.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం విశేషం. మూడు దశాబ్దాలకు పైగా సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా రాణిస్తున్న షారుక్ ఖాన్‌కు తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లోని ‘జవాన్’ సినిమాతో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఉత్తమ నటుడి విభాగంలో మరో హిందీ నటుడు విక్రాంత్ మెస్సీకీ అవార్డు దక్కింది.
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన స్ఫూర్తిదాయకమైన బయోగ్రాఫికల్ చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’లో హీరోగా నటించారు విక్రాంత్ మెస్సీ. విధు వినోద్ చోప్రాదర్శకత్వంలోని ఈ ‘ట్వెల్త్ ఫెయిల్’ ఉత్తమ చిత్రంగానూ అవార్డు కొల్లగొట్టింది.
ఇక తన బిడ్డల కోసం ఓ తల్లి చేసిన అసాధారణ పోరాటం ఆధారంగా రూపొంది, ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసిన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ సినిమాలోని నటనకుగాను రాణీ ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు లభించింది. ఉత్తమ దర్శకుడి అవార్డు ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు గాను సుదీప్తో సేన్‌కు దక్కింది. ఇక తెలుగు సినిమాకి దక్కిన అవార్డుల విషయానికొస్తే...
2023 దసరాకి విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘భగవంత్ కేసరి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఇక 2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘హను–మాన్’ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్), బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ)లో అవార్డులు వచ్చాయి.
‘హను–మాన్ (నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, యానిమేటర్–వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ జెట్టి వెంకట్ కుమార్‌లు అవార్డులు అందుకుంటారు. అలాగే స్టంట్ కొరియోగ్రఫీకి సంబంధించి నందు, పృథ్వీ అవార్డులు అందుకుంటారు. ‘బేబీ’ సినిమాకు రెండు అవార్డులు వచ్చాయి. మంచి స్క్రీన్‌ప్లేను సమకూర్చి యువత పల్స్ పట్టుకున్న ఈ చిత్రదర్శకుడు సాయిరాజేశ్‌కు స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజినల్)గా, ఇదే చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా...’ పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా పీవీఎస్‌ఎన్ రోహిత్‌కు అవార్డులు వచ్చాయి.
జాతీయ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘యానిమల్’ సినిమాకు ఆర్‌ఆర్ అందించిన హర్షవర్థన్ రామేశ్వర్‌కు అవార్డు దక్కింది. ఇక ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు..’ పాటను రాసినందుకు గాను బెస్ట్ లిరిక్ రైటర్‌గా కాసర్ల శ్యామ్‌కు అవార్డు దక్కింది. ఉత్తమ బాలనటి విభాగంలో ముగ్గుర్ని విజేతలుగా ప్రకటించగా, వారిలో తెలుగు నుంచి ప్రముఖ దర్శక – నిర్మాత సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి ఉన్నారు. ‘గాంధీతాత చెట్టు’ సినిమాకుగాను సుకృతికి అవార్డు లభించింది.
2023లో విడుదలైన సినిమాలకే అవార్డులను ప్రకటించారు. కానీ... ‘హను–మాన్’ సినిమా 2024లోవిడుదలైంది కదా అనే సందేహం రావొచ్చు. కానీ ఈ సినిమాకు 2023లో సెన్సార్ పూర్తయింది. ఇంకా పలు విభాగాల్లో పలు భాషలకు చెందిన అవార్డులను జ్యూరీ ప్రకటించింది.
ఆ అవార్డుల జాబితా ఈ విధంగా...
→ ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ – జవాన్
→ నటుడు: విక్రాంత్ మెస్సీ – ‘ట్వెల్త్ ఫెయిల్’
→ నటి: రాణీ ముఖర్జీ – మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రం
→ సహాయ నటుడు: విజయరాఘవన్ – ‘పోక్కాలమ్’ (మలయాళం); ముధుపెట్టయి సోము భాస్కర్ – ‘పార్కింగ్’ (తమిళ చిత్రం)
→ సహాయ నటి: ఊర్వశి – ఉళ్లోళుక్కు (మలయాళ చిత్రం);
→ జంకీ బోడివాల – ‘వశ్ (గుజరాతీ చిత్రం)
→ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి – (గాంధీ తాత చెట్టు
→ కబీర్ ఖాండరి – జిప్సీ (మరాఠీ మూవీ)
→ త్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ – నాల్ 2 (మరాఠీ మూవీ)
→ మేల్ ప్లేబ్యాక్ సింగర్: ప్రేమిస్తున్నా.. (పీవీఎన్ ఎస్ రోహిత్) – బేబీ మూవీ
→ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: చెలియా.. (శిల్పరావు సింగర్) – జవాన్
→ సినిమాటోగ్రఫీ: ప్రసంతను మొహపాత్ర – ది కేరళ స్టోరీ
→ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత – బేబీ: సాయిరాజేశ్ నీలం
→ పార్కింగ్: రాంకుమార్ బాలకష్ణన్
→ డైలాగ్ రచయిత: దీపక్ కింగక్రాని: సిర్ఫ్ ఏక్ బండా కాఫి హై
→ తమిళ చిత్రం – పార్కింగ్
→ పంజాబీ చిత్రం – గొడ్డే గొడ్డే చా
→ ఒడియా చిత్రం– పుష్కర
→ మరాఠీ చిత్రం – శ్యాంచీ ఆయ్
→ మలయాళ చిత్రం – ఉళ్లోళుక్కు
→ కన్నడ చిత్రం – కందిలు
→ హిందీ చిత్రం: కాథల్
→ గుజరాతీ చిత్రం: వశ్
→ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్
→ అస్సామీస్ చిత్రం: రొంగటపు 1982
→ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ) – హనుమాన్ , స్టంట్ కొరియోగ్రాఫర్: నందు, పృథ్వి
→ స్పెషల్ మెన్షన్ : యానిమల్ (రీ రికార్డింగ్ మిక్సర్) – ఎమ్‌ఆర్ రాజకృష్ణన్

భగవంత్ కేసరి
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ఇతర పాత్రలు పోషించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా 2023 అక్టోబర్ 19న విడుదలైంది.
‘భగవంత్ కేసరి’ కథేంటంటే...
నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ) ఒక ఊచకోత కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. మంచితనంతో అక్కడి జైలర్‌కు (శరత్ కుమార్) దగ్గరవుతాడు. జైలర్ కుమార్తె విజయలక్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల)తో మంచి అనుబంధం ఏర్పడుతుంది భగవంత్ కేసరికి. విజ్జి పాపని ఆర్మీలో చేర్చాలనేది జైలర్ కల. అయితే అనూహ్య పరిస్థితుల్లో జైలర్ మరణించే క్రమంలో విజ్జి పాపని ఆర్మీలో చేర్పించమని భగవంత్ కేసరిని కోరతాడు. దీంతో ఆ పాప బాధ్యతల్ని భగవంత్ కేసరి తీసుకుంటాడు. ఆమెని ఓ సింహంలా తయారు చేసి, ఆర్మీలో జాయిన్ చేయాలని శిక్షణ ఇప్పిస్తుంటాడు. అయితే ఆర్మీలో చేరడం విజ్జి పాపకు ఇష్టం ఉండదు. కానీ, ఆ తర్వాత ఆమె పశ్చాత్తాపం చెంది, శిక్షణ తీసుకుంటుంది. పోలీసాఫీసర్ అయిన భగవంత్ కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? విజ్జి పాప మిలిటరీలో జాయిన్ అయిందా? లేదా? కేసరిని ఇష్టపడిన సైకాలజిస్ట్ కాత్యాయని (కాజల్) భగవంత్‌కి చేసిన సాయం ఏంటి?ప్రాజెక్ట్ వి కోసం ప్రయత్నాలు చేస్తున్న బిలియనీర్ రాహుల్ సంఘ్వీతో (అర్జున్ రాంపాల్) భగవంత్ కేసరికి ఉన్న వైరం ఏంటి వంటి అంశాలు ఈ సినిమాలో ఆసక్తిగా అనిపిస్తాయి. అంతేకాదు.. అమ్మాయిలపై గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పిన అంశం ఈ సినిమా ప్రేక్షకులకు దగ్గర కావడానికి ప్రధాన కారణం.
‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికవడం గర్వంగా ఉంది. ఈ గౌరవం మా చిత్ర బృందానికి చెందుతుంది. నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. జాతీయ అవార్డుల జ్యూరీకి నా కృతజ్ఞతలు. ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిచ్చి, మరిన్ని శక్తిమంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరిచింది.
– బాలకృష్ణ, నటుడు
ట్వెల్త్ ఫెయిల్
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా తెరకెక్కింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయ ప్రాంతమైన మౌర్యానాకి చెందిన మనోజ్ కుమార్ శర్మది నిరుపేద కుటుంబం. చదువులో మనోజ్ బిలో యావరేజ్ స్టూడెంట్. అయితే ఓసారి మనోజ్ చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ పరీక్షల్లో కాపీ కొట్టి పాస్ అవ్వమని స్టూడెంట్స్‌కు చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీ దుష్యంత్ ప్రిన్సిపాల్‌ను జైలుకు పంపుతాడు. నిజాయితీగా చదివి పాస్ కావడంలోనే అసలైన గెలుపు ఉందని, మనల్ని మనం మోసం చేసుకోకూడదని డీఎస్పీ దుష్యంత్ స్టూడెంట్స్‌కు చెబుతాడు. ఇక మనోజ్ ఏమో ట్వెల్త్ ఫెయిల్ అవుతాడు. కానీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న మనోజ్ నిజాయితీగా చదివి ట్వెల్త్ పాస్ అవుతాడు. సివిల్స్‌వైపు అడుగులు వేస్తాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొంటాడు? రీ స్టార్ట్ అంటూ... ఫైనల్‌గా మనోజ్ ఎలా కష్టపడి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు? అన్నదే ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా కథ.
ఏడు అవార్డులు రావడం సంతోషం
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు ఏడు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ఎంపికవడంపై బాలకృష్ణకి, తెలంగాణలోని పల్లె ఆ΄్యాయతను కళ్లకు కట్టినట్లు చూపిన ‘బలగం’లోని పాటల్లో ‘ఊరు.. పల్లెటూరు...’ పాటకిగానూ జాతీయ అవార్డుకు ఎంపికైన కాసర్ల శ్యామ్‌కు అభినందనలు. ‘బేబీ, హను–మాన్’ చిత్రాలకు రెండేసి అవార్డులు రావడం, ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి సుకృతి వేణి బాలనటిగా ఎంపికవడం అభినందనీయం. తెలుగు సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది.
– సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జాతీయ ఉత్తమనటుడు అవార్డు రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఈ అవార్డుకు నేను అర్హుడిని అని నమ్మిన జ్యూరీకి, కేంద్ర సమాచార, మంత్రిత్వ శాఖ.. ఇలా అందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి, నాకు అవకాశం కల్పించిన అట్లీసార్ అండ్ టీమ్‌కి థ్యాంక్స్..
అట్లీసార్ చెప్పినట్లు...మాస్!. సినిమాల కోసం నేను మరింత కష్టపడాలన్న దానికి ఈ అవార్డు ఓ రిమైండర్ వంటిది.
– షారుక్ ఖాన్, నటుడు
మా ‘హను–మాన్’కి రెండు ప్రతిష్టాత్మక విభాగాలైన యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్‌లో అవార్డు వచ్చినందుకు మా వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ వెంకట్ కుమార్ చిట్టికి అభినందనలు. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీలో నందు, పృథ్వీ మాస్టర్లకు ఈ అవార్డు వచ్చింది.. వారికీ అభినందనలు. మా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా తర ఫున చాలా థ్యాంక్స్. మా సినిమాకి ఈ గుర్తింపు ఇచ్చిన జ్యూరీ సభ్యులకు మా యూనిట్ తరఫున ధన్యవాదాలు.
–ప్రశాంత్ వర్మ, డైరెక్టర్
మా ‘బేబీ’ బెస్ట్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ మేల్ సింగర్ విభాగాల్లో రెండు అవార్డులకి ఎంపికవడం సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్‌లో గేమ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేకి అవార్డు రావడం అనేది చాలా పెద్ద విషయం. నేను ఒక్కటే చెబుతాను. ఎస్‌కేఎన్ నమ్మకపోతే ఇది జరిగేది కాదు. చిన్న సినిమాలు తీసుకునే నన్ము నమ్మి ‘బేబి’ సినిమా నిర్మించి, నాకు ఈ గౌరవం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్.. అలాగే నా టీమ్‌కి కూడా అభినందనలు. మా సింగర్ పీవీఎన్‌ఎస్ రోహిత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా సినిమాతో తనకు పెద్ద బ్రేక్ రావడం గర్వంగా ఉంది.
– సాయి రాజేశ్, డైరెక్టర్
జాతీయ అవార్డు సాధిస్తాననుకోలేదు. నాకు అవార్డు వచ్చిన విషయం తెలిసి దర్శకుడు సందీప్‌గారు హ్యాపీ ఫీలయ్యారు. ‘యానిమల్’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం లాక్‌డౌన్ సమయంలో ఎంతో కష్టపడ్డాం. మనకు దక్షిణాదిలోనే చాలా పోటీ ఉంటుంది. అలాంటిది ఉత్తరాది వెళ్లి, అవార్డు అందుకోవడం అనేది దేవుడి దయ, కొంచెం అదృష్టం, నా కష్టం... ఇవన్నీ కలిసి నా కల నిజమై నట్లుగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి సందీప్‌రెడ్డిగారితో నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాం.
– హర్షవర్ధన్ రామేశ్వర్, సంగీత దర్శకుడు
రెండోసారి జాతీయ అవార్డు వచ్చినందుకు హ్యాపీగా ఉంది (గతంలో ‘సూరరై పోట్రు’కు వచ్చింది). ‘వాత్తి’ (తెలుగులో ‘సార్’గా విడుదలైంది) సినిమాకిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు నన్ను ఎంచుకున్న ‡హీరో ధనుష్‌కి ధన్యవాదాలు. నన్ను నమ్మి ప్రోత్సహించిన దర్శకుడు వెంకీ అట్లూరి, నాగవంశీ, త్రివిక్రమ్‌గార్లతో పాటు టీమ్ అందరికీ «థ్యాంక్స్.
– జీవీ ప్రకాశ్, సంగీత దర్శకుడు
Tags : 1