బైకును ఎత్తిండ్రు అన్నలు
Breaking News
అతిగా చేస్తే.. ప్యాకైపోతారు..!
Published on Fri, 08/01/2025 - 11:29
శరీరాకృతిపై నేటి తరం యువతలో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఇందుకు ఆహార అలవాట్లలోనూ అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించకుండా ఓవర్‌నైట్‌లో కండలు, సిక్స్ ప్యాక్స్ సొంతం చేసుకోవాలనే అపోహతో అతిగా సాధన చేస్తున్నారు. గంటల తరబడి బరువులు ఎత్తుతూ సొంతంగా అనర్థాలకు కారకులవుతున్నారని పలువురు జిమ్ ట్రైనర్స్, వైద్యులు చెబుతున్న మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పలువురు అనారోగ్యానికి గురైన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈ తరహా ప్రమాదాలు రెగ్యులర్‌గా జరుగుతున్నాయని, పరిస్థితి దెబ్బతిన్న తర్వాత తమను సంప్రదిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
నగరంలో సుమారు 1.4 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడులతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. వీరిలోనూ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ, కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో పనిచేవారిలో ఎక్కువ మంది రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కుర్చీలకే పరిమితమవుతున్నారు.
ఈ కారణంగా శరీరాకృతిలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకెత్తయితే.. పని ఒత్తిడి, స్ట్రెస్ మరో ఎత్తు.. దీంతో తమ శరీరంలో పేరుకుపోయిన కేలరీలు తగ్గించుకునేందుకు వీలు చిక్కినప్పుడల్లా తమకు అందుబాటులో ఉన్న జిమ్ములు, పార్కులు, ఆట స్థలాల్లో తమకు తోచిన రీతిలో వ్యాయామాలు చేస్తున్నారు. కొందరైతే వీటికి ప్రత్యామ్నాయంగా ఆటలు, డ్యాన్స్ వంటి వాటిని సాధన చేస్తున్నారు.
పొంచి ఉన్న ముప్పు..
క్రమ పద్ధతి పాటించకుండా అతిగా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, కండరాల్లో దీర్ఘకాలిక అలసట, నొప్పులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నీరసం, ఆందోళన, నిరుత్సాహం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది.
కార్టిసాల్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు.. ఇటీవల తరచూ కనిపిస్తున్న కేసుల్లో 90 శాతం ఈ తరహా సమస్యలే ఎక్కువని, క్రీడలు, వ్యాయామం చేస్తుండగానే కుప్పకూలిపోతున్నారన్న విషయం తెలిసిందే..
లైఫ్‌స్టైల్ మేనేజ్‌మెంట్ అవసరం.. లైఫ్‌స్టైల్ మేనేజ్‌మెంట్‌లో శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో.. వ్యాయామం, ఆహారపు అలవాట్లు అంతే అవసరం.. ఒక్కసారిగా సన్నబడిపోవాలని ఎక్కువగా జిమ్ చేయడం, అలసిపోయే వరకూ క్రీడల్లో పాల్గొనడం కార్డియాక్ అరెస్ట్‌కు కారణం కావచ్చు. ఆహారం తగ్గించి ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు. జిమ్, క్రీడా మైదానాల్లో ఇంప్లాంటబుల్ కార్డియో వర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) అనే పరికరం వినియోగిస్తే గుండె లయను క్రమబద్ధీకరిస్తుంది.
ఎయిర్ పోర్టు, మాల్స్‌లో ఏఈడీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గుండె ఆగిపోయినప్పుడు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కమ్యూనిటీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థి దశ నుంచే పీసీఆర్‌పై శిక్షణ ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ భార్గవి, కార్డియాలజిస్ట్, రెయిన్‌బో హార్ట్ ఇన్స్‌స్టిట్యూట్
Tags : 1