73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
హైదరాబాద్ ఎస్‌బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
Published on Thu, 05/22/2025 - 12:31
సరైన పూచీకత్తు లేకుండా బంగారు రుణాలు మంజూరు చేసిన కేసులో ఇద్దరు ఎస్‌బీఐ ఉద్యోగులపై కేసు నమోదైంది. వడ్డీతో కలిసి సుమారు రూ.2.2 కోట్ల మేరకు మోసానికి పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని రాంనగర్ ఎస్‌బీఐ బ్రాంచి మేనేజర్ డి.సునీల్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఇద్దరు ఉద్యోగులతోపాటు మరో 18 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఎస్‌బీఐలో సర్వీస్ మేనేజర్‌గా పని చేస్తున్న గుగ్లోత్ జైరాం నాయక్ క్యాష్ ఇన్‌ఛార్జ్ చీర్లా రుతుపవన్‌తో కలిసి విధులను దుర్వినియోగం చేశారు. సరైన పూచీకత్తు లేకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరుల పేరిట నకిలీ బంగారు రుణాలను మంజూరు చేశారు. ఇందులో మరో 18 మంది పాత్ర ఉంది. ప్రధాన నిందితుడు నాయక్ తన పదవిని దుర్వినియోగం చేశాడని, అంతర్గత విచారణలో నిందితుడు చేసిన మోసం బయటపడిందని ఆరోపిస్తూ మే 15న బ్రాంచి మేనేజర్ సునిల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెల్లుబాటయ్యే పూచీకత్తు లేకుండా, బ్యాంకు విధానాలను ఉల్లంఘించి ఈ రుణాలను ప్రాసెస్ చేసి ఆమోదించారని తెలిపారు. క్యాష్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జిగా ఉన్నప్పటికీ, అతను ఉద్దేశపూర్వకంగా ప్రామాణిక బ్యాంకు మార్గదర్శకాలను పట్టించుకోలేదని చెప్పారు. ఈ మోసంతో అక్రమంగా పోగు చేసిన రూ.2.2 కోట్ల నిధులను వివిధ వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి ఎల్లారెడ్డిగూడలోని ఓ ప్రైవేటు సంస్థకు మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి
వడ్డీతో సహా రూ.2.2 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఇటీవల లిఖితపూర్వక వాంగ్మూలంలో నాయక్ అంగీకరించినట్లు బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) నిందితులపై సెక్షన్ 316(5) (ప్రభుత్వ ఉద్యోగి, లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత ఉల్లంఘన), 318(4) (మోసంతో ఆస్తి పంపిణీని ప్రేరేపించడం), ఆర్ / డబ్ల్యూ 61 (2) (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ మోసం ఇటీవల అంతర్గత ఆడిట్‌లో వెలుగు చూడడం గమనార్హం. ప్రధాన నిందితుడు నాయక్, రుతుపవన్‌ను అరెస్టు చేశారు. మిగతా నిందితుల పాత్రను పరిశీలిస్తున్నామని సీసీఎస్ అధికారి ఒకరు తెలిపారు.
Tags : 1