73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan
Breaking News
Cannes 2025: కాన్స్‌లో ఇండియన్ సినిమాకు అరుదైన గౌరవం
Published on Thu, 05/22/2025 - 04:39
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలి అడుగు వేశారు జాన్వీ కపూర్. పింక్ కలర్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడిచారీ బ్యూటీ. హైదరాబాదీ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్ బౌండ్’ సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘అన్ సర్టైన్ రిగార్డ్స్’ విభాగంలో పోటీలో నిలవగా ఈ చిత్రంలో నటించిన జాన్వీ, ఇషాన్ కట్టర్ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు కోసం ఎంపికైన తొలి భారతీయ చిత్రం కూడా ‘హోమ్ బౌండ్’ కావడం విశేషం.
కరణ్ జోహార్, అపూర్వా మెహతా, అదార్ పూనావాలా, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రాన్ని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా, తొమ్మిది నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఇదిలా ఉంటే.. గత కొన్ని సంవత్సరాలుగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తప్పకుండా హాజరవుతున్నారు హీరోయిన్ ఐశ్వర్యా రాయ్. ఈ సారి కూడా కాన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచారామె. ఇక ఈ ఫెస్టివల్‌కు ఐశ్వర్యారాయ్ రావడం 22వ సారి కావడం విశేషం.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు సినిమా ‘విశ్వంభర’ గ్లింప్స్‌ని ప్రదర్శించనున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘విశ్వంభర’. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి. వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘విశ్వంభర’ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం ఫ్రాన్స్ వెళ్లారు నిర్మాత విక్రమ్ రెడ్డి.
భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండితెరపైకి రానుంది. ‘కలాం: ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో ధనుష్ టైటిల్ రోల్ చేయనున్నారు. కాన్స్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రకటించి, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘డా. కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అని మేకర్స్ తెలిపారు.
Tags : 1