బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
Breaking News
జీడీపీ వృద్ధి 6.3 శాతం
Published on Sat, 05/17/2025 - 06:35
ఐక్యరాజ్యసమితి: భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను 2025లో 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి (యూఎన్) ప్రకటించింది. అయినప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తొలి అంచనాల్లో 2025కు భారత్ జీడీపీ 6.6 శాతం మేర వృద్ధి చెందుతుందని యూఎన్ పేర్కొనడం గమనార్హం.
2024లో భారత జీడీపీ 7.1గా ఉన్నట్టు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, వినియోగం బలంగా ఉండడానికితోడు సేవల ఎగుమతులు పటిష్టంగా ఉండడం ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తాయని ప్రస్తావించింది. ఈ మేరకు 2025 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తాజా నివేదికను విడుదల చేసింది. ‘‘అధిక స్థాయి వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సందిగ్ధ స్థితిలో ఉంది.
ఇటీవల యూఎస్ టారిఫ్‌ల పెంపుతో తయారీ వ్యయాలు భారీగా పెరగనున్నాయి. ఇది అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థకు అవరోధం కల్పించడంతోపాటు ఆర్థిక గందరగోళాన్ని పెంచుతుంది’’అని యూఎన్ నివేదిక పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్, ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్లు, ఇంధనం, కాపర్‌కు అమెరికా టారిఫ్‌లు మినహాయించడంతో వీటిపై ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. అయినప్పటికీ ఈ రంగాలకు టారిఫ్‌ల మినహాయింపు తాత్కాలికమేనన్న విషయాన్ని గుర్తు చేసింది.
2026లో 6.4 శాతం..
భారత జీడీపీ 2026లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘‘భారత్‌లో బలమైన ఆర్థిక కార్యకలాపాల నేపథ్యంలో నిరుద్యోగం నియంత్రణలోనే ఉంది. అయినప్పటికీ పని ప్రదేశాల్లో లింగ అసమానతలు కొనసాగుతున్నాయి. ఇది స్త్రీ, పురుషుల పరంగా మరింత సమాన అవకాశాల కల్పన అవసరాన్ని సూచిస్తోంది’’అని యూఎన్ నివేదిక తెలిపింది. ఇక ద్రవ్యోల్బణం ఈ ఏడాది 4.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. గతేడాది 4.9 శాతం కంటే తక్కువని పేర్కొంది. 2025లో ప్రపంచ జీడీపీ 2.4 శాతం వృద్ధి చెందొచ్చని ఐక్యరాజ్యసమితి నివేదిక అంచనా వేసింది. 2024లో నమోదైన 2.9 శాతం కంటే తక్కువ. ఈ ఏడాది ఆరంభంలో యూఎన్ వేసిన అంచనాతో పోల్చి చూస్తే 0.4 శాతం తగ్గింది. 2026లో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
అంతర్జాతీయంగా మారిపోయిన పరిణామాల నేపథ్యంలో జనవరిలో వేసిన అంచనా కంటే 0.4 శాతం తగ్గించాల్సి వచి్చనట్టు వివరించింది. ఇది మాంద్యం కాకపోయినప్పటికీ వృద్ధి రేటు తగ్గడం ఎన్నో దేశాలు, ప్రాంతాలపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక విధానాల్లో అనిశ్చితులు, అస్థిరతలు, భౌగోళిక ఉద్రిక్తతలతో కీలక పెట్టుబడుల నిర్ణయాలు వెనక్కి వెళ్లిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అధిక రుణ భారం, నిదానించిన ఉత్పత్తి వంటి ఇప్పటికే ఉన్న సవాళ్లను ఇవి మరింత పెంచుతాయని.. ప్రపంచ వృద్ధి అవకాశాలను దెబ్బతీయొచ్చని పేర్కొంది. అమెరికా జీడీపీ వృద్ధి 2024లో 2.8 శాతంగా ఉంటే, 2025కు 1.6 శాతంగా యూఎన్ నివేదిక అంచనా వేసింది. చైనా జీడీపీ 4.6 శాతానికి తగ్గొచ్చని తెలిపింది.
Tags : 1