బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం
Breaking News
'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..
Published on Fri, 05/16/2025 - 16:55
ఇటీవల కాలంలో సీజేరియన్ డెలివరీల కంటే..నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు పలువురు మహిళలు, సెలబ్రిటీలు. ఆ దిశగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని మరీ ప్రసవిస్తున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా ట్రెండ్ అవుతోంది 'వాటర్ బర్త్'. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు దీని గురించే సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్. అంతేగాదు ఈ నీటి ప్రసవం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పొకొచ్చారామె. ఇంతకీ ఏంటా ప్రసవం.. ? అందరూ దీన్ని ఎంచుకోవచ్చా..? తదితర విషయాలు గురించి తెలుసుకుందామా..
కల్కి కొచ్లిన్ ఫ్రెంచ్ దేశానికి చెందిన బాలీవుడ్ నటి. తన విలక్షణమైన నటనతో ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నటి. ఆమె పియానిస్ట్ గయ్‌ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె అందరిలాంటి నార్మల్ డెలివరీ కాకుండా..నీటి ప్రసవాన్ని ఎంచుకుంది. సంప్రదాయ నార్మల్ డెలివరీలలో ఇది కూడా ఒకటి.
బిడ్డను స్వాగతించడానికి ఈ పద్ధతి అద్బుతమైనదని అంటోంది నటి కల్కి. శరీరానికి చాలా సులభమైన ప్రక్రియని చెబుతోందామె. కానీ భారతీయ మహిళలు దీన్ని ఎందుకు ఎంచుకురో తెలియడం లేదన్నారు. బహుశా ఇది ఖర్చుతో కూడిన ప్రక్రియనే ఉద్దేశ్యంతో కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారామె.
ఇటీవల అలీనా డిసెక్ట్స్‌తో జరిగిన సంభాషణలో నటి కల్కి ఈ విషయాలు వెల్లడించారు. ఇదేమి ఆశ్చర్యపోవాల్సిన ప్రవాస ప్రక్రియ కాదంటున్నారామె. శిశువు అల్రెడీ ఉమ్మనీరులో ఉంటుంది కాబట్టి ఇలా నీటిలో ప్రసవిస్తే శిశువుకి మరింత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు కల్కి.
ఆస్పత్రిలో కూడా అందుకు సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెబుతోంది కల్కి. సహజ సిద్ధమైన కాన్పులలో ఇది ఒకటని..ఇటీవలే నెమ్మదిగా వెలుగులోకి వస్తోందని చెబుతున్నారామె. ముఖ్యంగా తనలాంటి సెలబ్రిటీల అనుభవాలతోనే ప్రజలకు తెలుస్తోందని చెబుతోంది. అసలేంటి ప్రసవం..
వాటర్ బర్త్ అంటే ..
సింపుల్‌గా చెప్పాలంటే..వాటర్ బర్త్ అంటే.. ఒక రకమైన ప్రసవం. దీనిలో కాబోయే తల్లి డెలివరీ టైంలో ప్రవహించే కొలను లేదా వెచ్చని నీటి తొట్టిలో గడుపుతారు. అలా విశ్రాంతి తీసుకున్నప్పుడూ..డెలివరీ సంక్లిష్టంగా కాకుండా సులభంగా అయిపోతుంది. సాధారణ ప్రసవంతో పోలిస్తే..ఈ ప్రసవం చాలా సౌకర్యవంతగంగా, తేలికపాటి కష్టంతో కూడుకున్నదని చెబుతున్నారు వైద్యులు.
ఇది ఎందుకు ప్రజాదరణ పొందుతోందంటే..తల్లి శరీర బరువుని తగ్గించి స్వేచ్ఛగా కదలడానికి అనుమతిస్తుంది. అలాగే సమర్ధవంతమైన గర్భాశయ సంకోచాలను ప్రోత్సహిస్తుంది. పైగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా గర్భాశయ కండరాలు తక్కువ నొప్పితోనే ప్రసవం అయ్యేలా చేస్తాయి.
అలాగే శిశువుకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుందట. అంతేగాదు డెలివరీ టైంలో ఉండే ఆందోళన కూడా నీటిలో మునిగి ఉండటం వల్ల తగ్గుతుందట. ఒత్తిడికి సంబధించిన హార్మోన్లు తగ్గించి..నొప్పులు వచ్చేలా ఎండార్ఫిన్‌లు విడుదలయ్యేలా వీలు కల్పిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల నీటిలో తక్కువ పురిట నొప్పులతోనే ప్రసవం సులభంగా అయిపోతుందట.
అందరూ ఈ ప్రక్రియ ఎంచుకోవచ్చా.?
క్రిటికల్ కానీ గర్భణిలు మాత్రమే ఈ పద్ధతిని ఎంచుకోగలరని చెబుతున్నారు నిపుణులు. అలాగే పిండం 37 నుండి 41 వారాల మధ్య ఉంటేనే ఈ పద్ధతికి అనుమతిస్తారట. అలాగే తల్లిలో అమ్నియోటిక్ ద్రవం(ఉమ్మనీరు) తగిన మోతాదులో ఉండాలని చెబుతున్నారు. అలాగే నెలలు నిండక ముందు అయ్యే కాన్పులకు ఈ పద్ధతి పనికిరాదని చెబుతున్నారు. అదీగాక గతంలో సీజేరియన్ అయ్యిన మహిళలు కూడా ఈ ప్రక్రియని ఎంచుకోకూడదని వెల్లడించారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!)
Tags : 1