మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి
Breaking News
రెండు వేల ఏళ్ల నాటి గ్రామం..! ఒకప్పుడూ..
Published on Mon, 05/05/2025 - 11:25
కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్‌గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి.
2000లో శనేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన
జేష్ట్యాదేవి సమేత శనేశ్వరస్వామిని కొలిస్తే ఏల నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని తొలగుతుంది.. ఈ నమ్మకంతోనే వేలాది మంది భక్తులు ఉమ్మడి పాలమూరు పరిధిలోని బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడిని కొలుస్తున్నారు.
రాష్ట్రంలోనే ఏకైక శనేశ్వర ఆలయం కావడంతో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం పూజలతోపాటు ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు భక్తులు వేలల్లో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని పూజలు జరుపుతారు.
నందివడ్డెమాన్‌లో వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉన్న నంది, వీరభద్రస్వామి విగ్రహాలను 1976లో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ పాండే పిల్లలమర్రికి తరలించే ప్రయత్నం చేయగా గ్రామానికి చెందిన కొందరు పెద్దలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నిలిపివేశారు. అనంతరం 1999 జనవరి 26న విగ్రహ పునఃప్రతిష్ఠ చేశారు.
ఆ సమయంలో 11 రోజుల పాటు రుద్రయాగం చేసిన అర్చకులకు పక్షి రూపంలో ఒక చెట్టు వేరు కనిపించి పూర్ణాహుతి జరిగాక శనేశ్వర విగ్రహం ప్రతిష్టించాలని కలలో చెప్పడంతో విగ్రహ ప్రతిష్ఠకు పూనుకున్నారు. నందనవనం సుబ్బారాయుడు అనే శిల్పి ఆలగడ్డ నుంచి ఒక శిలను తెప్పించి ఏడున్నర రోజులపాటు శ్రమించి జేష్ట్యాదేవి విగ్రహాన్ని చెక్కారు. అనంతరం ఏప్రిల్ 17, 2000లో ఏడున్నర లక్షల శని మంత్రాలతో విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. కాకిపై కొలువై ఉన్న శనేశ్వరస్వామి విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది.
మహిళలు సైతం పూజలు చేయొచ్చు..
శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వ్రస్తాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి..
స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు.
ఇలా చేరుకోవచ్చు..
హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు బిజినేపల్లి మండల కేంద్రానికి చేరుకుని.. అక్కడి నుంచి వడ్డెమాన్‌కు రావాల్సి ఉంటుంది. బిజినేపల్లి నుంచి వడ్డెమాన్‌కు వెళ్లే మార్గంలో ముందుకు ఎదురయ్యే కమాన్ (ఆర్చి) నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే శనేశ్వరుడి ఆలయం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 122 కిలోమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ శనేశ్వరుడి ఆలయం ఉంటుంది.
గోన గన్నారెడ్డిది ఈ ప్రాంతమే..
కాకతీయుల సామంత రాజు గోనగన్నారెడ్డి ఈ ప్రాంతానికి చెందినవాడే. గోన బుద్దారెడ్డి తర్వాత వర్ధమానపురం రాజ పగ్గాలు చేపట్టిన గోన గన్నారెడ్డి రుద్రమదేవికి కుడిభుజంగా ఉండి సమస్త కాకతీయ రాజ్యాలను రక్షించిన యోధుడిగా చెప్పుకుంటారు.
భక్తుల నమ్మకం..
జేష్ట్యాదేవీ సమేత శనేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ఇక్కడ ఏల నాటి శని తొలగి.. అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భక్తుల నమ్మకం. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. స్వామివారికి అత్యంత ప్రియమైన నల్లటి దుస్తులతో అభిషేకం చేయడం వల్ల అన్ని దోశాలు తొలగిపోతాయి.
– శాంతికుమార్, అర్చకులు, శనేశ్వరస్వామి ఆలయం
(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర)
Tags : 1